Madhya Pradesh Government To Procure Cow Urine Manure
MP CM announced ‘Cow Cabinet’
ఫ్రెండ్లి పోలీసింగ్ అని ఈమధ్య కొత్త బిరుదు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంటే అంతకుముందు ఎనిమీ పోలీసింగ్ అన్న ముద్ర ఏదో ఉండి ఉంటుంది. పోలీసులు స్నేహపూర్వక సేవలు చేయడం ఒక ఆదర్శం. చేతిలో తుపాకీ పెట్టి స్నేహపూర్వక ప్రవచనాలు చేయమంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రాణం మీదికి వచ్చినప్పుడు ముందు గుర్తొచ్చేది పోలీసులే.
మధ్యప్రదేశ్ లో ఒక రైతు పెరట్లో గేదె పాలివ్వడం మానేసింది. పైగా దగ్గరికి వెళితే చాచి తంతోంది. దాంతో రైతు ఆ గేదెను తీసుకుని దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్ కు వెళ్లాడు.
అయ్యా,
ఈ గేదె నాదే అయినా…యజమాని అన్న పట్టింపు కూడా లేకుండా నన్నే తంతోంది. పైగా పాలివ్వడం మానేసింది. మీరే ఎలాగయినా గేదెకు బుద్ధి చెప్పి…నన్ను తన్నకుండా…బుద్ధిగా పాలివ్వమని చెప్పండి అని ఫిర్యాదు చేశాడు.
మనుషులు పశువులుగా మారి తన్నుకుంటున్న కేసులు విచారించడానికే సమయం చాలక చస్తుంటే…పశువు స్వాభావికంగా పాశవికంగా తంతున్న కేసులు కూడానా? అని పోలీసులు దిక్కులు చూశారు. అయినా ఆ రైతు అమాయకత్వానికి పోలీసులు కరిగిపోయారు.
(v6 సౌజన్యంతో)
నాయనా!
మీ గేదె గారిని పశు వైద్యుడికి చూపించు అని పోలీసులే అడ్రెస్ చెప్పి పంపించారు. వైద్యుడు ఏ మందు ఇచ్చాడో గానీ…గేదె దారిలోకి వచ్చింది. యజమానిని తన్నకుండా చక్కగా పాలిస్తోంది. రైతు బాధ్యతగా మళ్లీ పోలీసుల దగ్గరికి వెళ్లి కృతఙ్ఞతలు చెప్పి వచ్చాడట.
నిజమే.
పోలీస్ డెస్క్ సింగిల్ విండో కావాలి. ఏ సమస్య వచ్చినా పోలీస్ డెస్క్ పరిష్కరించగలగాలి. ఫ్రెండ్లి పోలీస్ అంటే యానిమల్ ఫ్రెండ్లి పోలీసింగ్ కూడానేమో!
ఏమో?
అదే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఇకపై ఆవు పేడను అధికారికంగా కొంటుందట. ఆవు పేడతో ఎరువులు, మందులు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అందుకు భారీ ఎత్తున ఆవు పేడ అవసరం. అందుకు అనుగుణంగా ఆవు పేడ ఉందని ఫోన్ చేస్తే ప్రభుత్వ వాహనం వచ్చి తీసుకెళ్లేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
ఇకపై మధ్యప్రదేశ్ లో పేడే కదా అని పడేస్తే కుదరదు. జాగ్రత్తగా దాచి ప్రభుత్వానికి ఫోన్ చేయాలి. ఏమో! రేప్పొద్దున వివిధ రాష్ట్రాల్లో పేడ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు కావచ్చు!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : అతి చేస్తే గతి చెడుతుంది