We Know What to do: భారత విదేశాంగ మంత్రి జై శంకర్ విదేశీ రాయబారిగా ఉన్నతోద్యోగం చేసి రాజకీయాల్లోకి వచ్చినవారు. ఉద్యోగిగా అనేక దేశాలు తిరిగినవారు. నాలుగయిదు అంతర్జాతీయ భాషలు మాట్లాడగలిగినవారు. అనేక సంస్కృతుల మీద లోతయిన అవగాహన ఉన్నవారు. సగటు భారతీయ రాజకీయ నాయకుడి లక్షణాలు లేనివారు. ఎవరికి ఏ భాషలో, ఏ ధ్వనిలో సమాధానం చెప్పాలో తెలిసినవారు.
రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలు పెట్టినప్పటి నుండి భారత్ వైఖరిని అటు అమెరికా ఇటు యూరోప్ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఎగతాళి చేస్తున్నాయి. దెప్పి పొడుస్తున్నాయి. ఎటో ఒక వైపు ఉండాలని నీతులు చెబుతున్నాయి.
కోవిడ్ రెండో వేవ్ సద్దు మణిగి ప్రపంచం మళ్లీ మామూలు కాగానే అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రతి సమావేశంలో భారత్ కు ఎదురయ్యే మొదటి ప్రశ్న- అంతర్జాతీయంగా మీరు ఏ కూటమిలో ఉంటారు? అని.
ఈ ప్రశ్నకు మామూలు రాజకీయ నాయకుడు చిత్ర విచిత్రంగా సమాధానాలు ఇస్తారేమో కానీ…జై శంకర్ మాత్రం తడబడకుండా… స్పష్టంగా… ఆచి…తూచి…సమాధానాలిస్తున్నారు. లోకల్ గా మన ఊరి పెద్ద అజ్ఞాన అహంకార అంధకారాల మీద ఉన్నంత ఆసక్తి మనకు అంతర్జాతీయ వ్యవహారాల మీద ఉండదు కాబట్టి జై శంకర్ దౌత్య నీతి పెద్దగా రిజిస్టర్ కావడం లేదు.
అమెరికా గడ్డమీద అమెరికా జర్నలిస్టులను ఆయన ఒక ప్రశ్న అడిగారు. “అమెరికా పాకిస్థాన్ కు ఎఫ్ 16 విమానాల ఆధునికీకరణ కోసం ఆర్థికసాయం చేసింది కదా? మీరిచ్చిన ఆ నిధులతో గాల్లోకి ఎగిరిన ఆ ఎఫ్ 16 విమానాలు ఏ పనులు చేస్తున్నాయో తెలుసా? ఎవరిని ఫూల్స్ చేయడానికి ఈ కల్లబొల్లి కబుర్లు? చెప్పమంటే ఇంకా చాలా చెబుతా…”అన్నారు.
ఉక్రెయిన్ అలజడి మొదలయ్యాక భారత్ రష్యాను ద్వేషించాల్సినంత ద్వేషించడం లేదని అమెరికా తెగ బాధపడ్డప్పుడు ఒక చర్చ వచ్చింది. రష్యా నుండి చమురు కొనుగోళ్లు ఆపేస్తే దాని ఆర్థిక మూలాలు దెబ్బ తీయవచ్చు అన్నది ఆ చర్చ. అదే రష్యా నుండి అమెరికా ప్రత్యేకించి యూరోప్ దేశాలు కొంటున్న చమురుతో పోలిస్తే…భారత్ కొంటున్నది సముద్రంలో నీటి చుక్కంత అని లెక్కలు ముందు పెట్టి…విల్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్? అని మర్యాద చెప్పారు.
యూరోప్ జర్నలిస్టులు జై శంకర్ ను దాదాపు ఇంటరాగేషన్ లెవెల్లో ప్రశ్నిస్తున్నారు. దానికి ఆయన నిర్మొహమాటంగా సమాధానమిస్తున్నారు.
“మా అవసరాలు మావి. మేము ఎటుండాలని మీరెవరు నిర్ణయించడానికి? కొన్ని సందర్భాల్లో తటస్థంగా ఉండడం మా హక్కు. దాన్ని చేతగానితనంగా చూస్తే మీ ఖర్మ. మీరు లేని తగువులు నెత్తికి తెచ్చుకుని వాటిల్లోకి మమ్మల్ని దూరమని అడిగితే ఎలా? మౌనం, సమాధానం, ప్రతిస్పందన, అభ్యంతరం, నిరసన…ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కోటి అవసరమవుతాయి. కొన్ని ఇలా బహిరంగ వేదికల మీద చెప్పేవి కాకపోవచ్చు. అంతిమంగా భారత్ ప్రయోజనాలతోనే దేన్నయినా మేము నిర్ణయించుకుంటాం. అలాగని అంతర్జాతీయంగా మేము ఏకాకిగా ఉండదలుచుకోలేదు”.
ఇప్పటి దాకా ఉన్న విదేశాంగ మంత్రుల్లో జై శంకర్ అత్యుత్తమ మంత్రి కావచ్చు. కాకపోవచ్చు. కానీ…ఇటీవలి కాలంలో నీళ్లు నమిలే అనేక మంది విదేశాంగ మంత్రులతో పోలిస్తే…ఎదుటివారిచేత నీళ్లు తాగిస్తున్న జై శంకర్ ఖచ్చితంగా మెరుగయినవారే. తటస్థం అంటే తలవంచుకోవడం కాదని…తల ఎత్తుకుని చెబుతున్న జై శంకర్ ను అభినందించాల్సిందే.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :