Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆకలి విలువ- అన్నం విలువ

ఆకలి విలువ- అన్నం విలువ

Hungry-Angry: “మనకు ఉచితంగా జ్ఞాన బోధ ఎవరయినా చేస్తారు;
మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి” అన్నాడు పతంజలి.

“There is no free meal in this world”  ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు అన్న అర్థంలో ఇంగ్లీషులో ప్రఖ్యాత నానుడి.

“అన్నమయితేనేమిరా?
సున్నమయితేనేమిరా?
పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!” అని కొంటె సామెత ఉండనే ఉంది.

అధ్వ అంటే దారి;
అన్నం- తిండి.
రెండు మాటలు సవర్ణదీర్ఘ సంధితో కలిస్తే “అధ్వాన్నం”. అంటే దారి మధ్యలో వండుకుని తిన్నది, వండినది అని. ఇంట్లోలా అన్నీ కుదిరినా, కుదరకపోయినా, రుచి-శుచి లేకపోయినా ఆకలితో అలమటించి స్పృహతప్పి పడిపోకుండా దారిలో ఏదో ఒకటి అనుకుని తినే అన్నమే “అధ్వాన్నం”.

భాషలో మాటలకు అర్థవ్యాప్తి, అర్థ సంకోచాలు వస్తుంటాయి. ఆ రుచి పచీ లేని ఆహారపరమైన అధ్వాన్నం కాస్త బాగలేని దేనికయినా “అధ్వాన్నం” అయ్యింది. అలా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏదో ఒక అధ్వాన్నం దొరికితే చాలనుకుని తింటున్నప్పుడు సర్వర్లకు- తింటున్నవారికి మధ్య జరిగిన సంభాషణలో అంతులేని ఆకలి, ఆవేదన, వేదాంతం కలగలిసి దొరికాయి.

ఒక మిట్ట మధ్యాహ్నం వేళ నా వ్యాపారం పనిలో భాగంగా మా బృందంతో కలిసి అవనిగడ్డ చేరాను. దారిలో ఒక కూడలిలో దివిసీమ పెను ఉప్పెన సమయంలో కృష్ణా కలెక్టర్ గా అనన్యసామాన్యమయిన సేవలందించిన ఏ వి ఎస్ రెడ్డి విగ్రహం చూశాను. ఎప్పుడో పొద్దున ఎనిమిదింటికి విజయవాడలో తిన్న టిఫిన్ అరిగిపోయింది. మధ్యాహ్న భోజన సమయం దాటిపోతోంది. దగ్గర్లో వెజ్ హోటళ్లు లేనందుకు మా స్టాఫ్ బరువెక్కిన గుండెతో నన్ను బస్టాండ్ ఎదురుగా చిన్న నాన్ వెజ్ హోటల్ కు తీసుకెళ్లారు. అక్కడ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో సిమెంటు దిమ్మెల మీద నల్లబండల టేబుళ్లు ఉన్నాయి. పాతిక మంది తింటున్నారు. వారు లేవగానే తినడానికి మరో పాతికమంది ఆవురావురుమని ఎదురుచూస్తున్నారు. కాసేపు నిరీక్షించాక పార్టీ ఎమ్మెల్యే టికెట్టు దొరికినట్లు మా స్టాఫ్ లో ఒకతను మూడు టేబుళ్లు దొరికిన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులయ్యాడు. తీరా ఆ నల్లబండల ముందు కూర్చుంటే తిని వెళ్లినవారి ప్లేట్లు తీసేవారు లేరు.

మాలాగే బండల ముందు కూర్చున్నవారిలో అసహనం పెరుగుతోంది. ఈలోపు ఒకతను- “అన్నం పెట్టకపోతే పోయావు కానీ…ముందు ఈ ప్లేట్లు తీసేయ్” అన్నాడు.

ఇంకొకాయన- “సామీ! పొద్దున్నుంచి ఏమీ తినలేదు! కళ్లు తిరుగుతున్నాయి. ఏదో ఒకటి త్వరగా పెట్టు”
అన్నాడు.

“నాకేమి నలభై చేతుల్లేవు కదా? పెడుతున్నాను. ఆగు…” అంటాడు ఒక సర్వర్.

“కడుపు ఆకలితో నకనకలాడితే గానీ…అన్నం విలువ తెలియదు” అన్నాడు మరో సర్వర్.

“ఏమండీ! చూడబోతే ఎంగిలి కంచాలు కూడా తినేసేలా ఉన్నారే! నన్ను క్లీన్ చేయనివ్వండి” అన్నాడు వడ్డించేవాడే శుభ్రం చేస్తూ.

“అడుక్కునేవాళ్ళలా అలా అరుస్తారేమిటయ్యా బాబూ!” అని ఒకాయన విసుక్కుంటున్నాడు.

“ఏది త్వరగా పెట్టగలిగితే అది పెట్టండి” అని ఒక అన్నార్థుడు అభ్యర్థిస్తున్నాడు.

మేము లేస్తే తినడానికి ఆకలితో ఉన్న మరికొన్ని కడుపులు నిరీక్షిస్తున్నాయి. పప్పు, కూర, సాంబారు, పెరుగు తిని బయటపడ్డాము. తిన్నది అన్నమో? అధ్వాన్నమో? తెలియదు కానీ…కళ్లు తిరిగి పడకుండా మాత్రం కాపాడింది.

ఆకలి విలువ; అన్నం విలువ గురించి వడ్డించేవారు అనర్గళంగా ఇచ్చిన ఉపన్యాసం మాత్రం మెదడుకు గొప్ప ఆహారంగా అనిపించింది నాకు. కొన్ని మాటలు సభా మర్యాద దృష్ట్యా రాయకూడదు. రిడీమెడ్ డబ్బా పెరుగు కాదు…మేమే పాలు కాచి తోడుబెట్టిన పెరుగు ఇంకాస్త వేసుకోండి అని నా బలహీనతను పసిగట్టి గడ్డ పెరుగు కుమ్మరించాడు. ఆ పెరుగు; అంతకు మించి లోకానికి వారిస్తున్న ఆకలి, ఆహార జ్ఞానంతో నా కడుపు నిండిపోయింది.

మా వంతు కోసం హోటల్ గుమ్మం ముందు వేచి ఉన్నవేళ పోతన భాగవతంలో రంతిదేవుడి కథ గుర్తొచ్చి…ఆ పద్యం-

“అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి; ద్రావుమన్న; రా
వన్న, శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపద
ల్గ్రన్నన మాన్పి వారి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కడు సుమ్ము పుల్కసా!”

పాడి…అర్థం చెప్పాను మా బృందానికి. నెలకు పైగా ఉపావాసం ఉండి…దీక్ష విరమించే వేళ రంతిదేవుడు అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతే దేవతలు పరీక్ష పెట్టి ఒకరి తరువాత ఒకరిని పంపుతారు. ఉన్న ఆహార పదార్థాలు వచ్చినవారికి తలా కొంత ఇచ్చేస్తాడు. చివరికి మర చెంబులో మంచి నీళ్లు ఒక్కటే మిగిలి ఉంటాయి. ఎత్తి నోట్లో నీళ్లు పోసుకునేవేళకు భిక్షకు మరొకరు వస్తారు. ఎదుటి వారి ఆకలి తీర్చడం కంటే గొప్ప మేలు ఈ భూమ్మీద మరొక్కటి ఉండదు. స్వామీ! ఈ మంచి నీళ్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. దాహం తీర్చుకోండి! అని ఇచ్చేస్తున్న సందర్భంలో రంతిదేవుడు చెప్పిన పద్యమిది. ఆ రంతిదేవుడి రాజధాని రంతిపురం. అదే తరువాత రణతంబోర్ అయ్యింది.

వీడి పద్యం పిచ్చి పాడుగాను…ఎండలో ఆకలికి అలమటిస్తుంటే…పద్యం పాడుతున్నాడేమిటి? అని మావాళ్లు దిక్కులు చూశారు. ఎవరు విన్నా వినకపోయినా…సందర్భానికి తగిన పద్యం గుర్తొస్తే గాలికయినా చెప్పాలని…నాకు హిందూపురంలో ఏళ్లతరబడి ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణ పాఠాలు చెప్పిన గురువుగారు కర్రా వెంకటసుబ్రహ్మణ్యం సార్ ఆదేశం. దానివల్ల ఎదుటివారి సంగతి మనకనవసరం. మనకు పద్యాలు నోట్లో తిరుగుతూ జీవితాంతం గుర్తుగా వెంట వస్తాయి– అన్నది ఆయన సూత్రీకరణ.

పతంజలి అన్నది నిజమే. జ్ఞానం ఎవరయినా ఊరికే ఇస్తారు. మన మెతుకులను మాత్రం మనమే సంపాదించుకోవాలి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్