Telugu-Tegulu: తెలుగులో హాస్య రచనలు బాగా తగ్గిపోయాయని బాధ పడాల్సిన పనిలేదు. జంధ్యాల తరువాత ఆ స్థాయిలో ప్రతి పదానికి నవ్వుల పూత పూసే కలాలు లేవని దిగులు పడాల్సిన పనే లేదు. రోజూ పత్రికల్లో వచ్చే తెలుగు ప్రకటనలు చదివితే…ప్రతి పదంలో నవ్వులే నవ్వులు. ప్రతి లైనుకు పొట్ట చెక్కలయ్యే నవ్వులే నవ్వులు. నవ్వలేక నవ్వలేక మన కళ్లల్లో నీళ్లు తిరిగేలా ప్రకటనలు తయారు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకు, అనువాదకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
మనల్ను కడుపుబ్బా నవ్వించడానికి ఒక ప్లాటినం ఆభరణాల ప్రకటన ఎంత కష్టపడుతోందో మచ్చుకు చదవండి. స్థూలంగా ఇది హాస్య రచనలో భాగం కాబట్టి అక్షర దోషాలు, అన్వయ దోషాలు, విరామ చిహ్నాలు లేకపోవడం వల్ల కలిగే గందరగోళం, దురర్థం, గజిబిజి, ఎలా చదవాలో తెలియని అయోమయం..అన్నీ రచయిత ఉద్దేశపూర్వకంగా చేసినవనే అనుకుందాం. తల్పానికి గిల్పం; కంబళికి గింబళి; అస్మదీయులకు అసమదీయులు; దుష్టకు దుషట అని మాటల మాంత్రికుడు పింగళి మాయాబజార్లో మాయ చేస్తే అర్ధ శతాబ్దం దాటినా పడి పడి నవ్వుతూనే ఉన్నాం కదా! దీన్ని కూడా ఆ కోణంలోనే చదవండి. చూడండి.
“అసమానంగా అమూల్యమైనది. కేవలం కొద్ది మందికే రాసిపెట్టినది. సహజంగా అరుదైనది.
సహజంగా యదార్ధమైనది.
మీరు ఇప్పుడు ఉన్న ప్రతిదీ మీ సొంతం మిమ్మల్ని అసాధారణంగా మలచే యదార్ధంగా ఒక రకం మిమ్మల్ని అరుదైన వ్యక్తిగా చేసేది, ఏది మిమ్మల్ని మార్చలేనిది ప్లాటినమ్ లాగానే. పరిమితమైన పరిమాణంలో లభించే లోహం, యదార్ధంగా అసాధారణమైనది.
ప్లాటినమ్ మీ దగ్గర ఉన్నందుకు ఆనందాన్ని సంబరంగా జరుపుకోండి.
అరుదైనది, అమూల్యమైనది మరియు అసలైనది. ఎంతో అరుదైనది మీ లాగానే ఉండే లోహం”
అర్థమయ్యింది కదా? ఇదొక సహజ యదార్ద(యథార్థ అని గ్రహించగలరు) వ్యధాభరిత అరుదయిన లోపం. సారీ…లోపం కాదు లోహం.
ఇది ఖర్మ కాలిన కొద్ది మందికే రాసి పెట్టిన అసమానమయిన అమూల్య సహజ లావణ్యాభరణం.
మీరిప్పుడున్న ప్రతిదీ మీ సొంతం కావాలంటే తొడుక్కోవాల్సిన ఆభరణమిది.
ఏది మిమ్మల్ని మీరుగా చేస్తుందో…అదే ఈ ప్లాటినం అని గ్రహించండి.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.
ప్లాటినాన్ని ప్లాటినంతోనే అర్థం చేసుకోవాలి. ఈ కషాయం భాషా ప్రయోగశాలలో తేలే విషయం కాదు. లోహ రసాయన ప్రయోగశాలలో తేలాల్సిన విషయం!
మీ గుండె రాయి చేసుకోండి. మీరు బండబారి పొండి. చివరకు మీరు ఈ అరుదయిన లోహమై పోండి!
ఒక్కసారి వాడి చూడండి. యదార్దంగా మీరు కొని తెచ్చుకోవాల్సిన ఈ లోహ వ్యామోహంతో లోహంలో లోహంగా మారకపోతే…నా పేరు “ప్లాటినం ఎవరా” కానే కాదు.
ఎవర్రా అక్కడ?
ఇందాకటి నుండి ఎవరో ఎర్రగడ్డకు దారడుగుతుంటే ఒక్కడన్నా బదులు పలకడు!
అంతగా గొంతు చించుకుని అరుస్తుంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ఒక్కడయినా అరుదయిన, సహజమయిన, యథార్థమయిన జి పి ఎస్ అయినా పెట్టి పంపడు!
మీరు మీరేనా!!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]