Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రకటనలు- వికటనలు

ప్రకటనలు- వికటనలు

Ads- Captions:భారత ప్రకటనల రంగ నిపుణులు ప్రధాని మోడీ దగ్గర అర్జెంటుగా ట్రెయినింగయినా తీసుకోవాలి. లేదంటే ఆయన బృందంలో ఆయన కోసం పంచ్ డైలాగులు రాసే కాపీ రైటర్ల దగ్గరయినా ట్రెయినింగ్ తీసుకోవాలి. రెండు నిముషాల్లోపు ట్విట్టర్ వీడియోలు, 140 క్యారెక్టర్లు దాటని రెండు వాక్యాల టెక్స్ట్, ట్యాగ్ లైన్లు, డి పి లు, షేర్లు, ఫార్వార్డ్ ల డిజిటల్ కాలాన్ని పూర్తిగా వాడుకోవడంలో మోడీ తరువాతే ఎవరయినా. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో ప్రజలకు టేక్ హోమ్ పంచ్ డైలాగులు పంచి పెట్టడంలో మోడీ తరువాతే ఎవరయినా.

మాటల ఉపయోగం
మొన్నామధ్య ఉత్తర ప్రదేశ్ లో అనేక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. రాజకీయంగా ఉత్తరప్రదేశ్ గెలుపు దేశం గెలుపులా ఉంటుంది. బహుజన బాంధవి మాయమ్మ ఎందుకో మౌనంగా ఉంది. లాల్ టోపి సమాజ్ వాది అఖిలేష్ అనూహ్యంగా దూసుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో యు పి ఎన్నికలమీద ఢిల్లీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

అఖిలేష్ లాల్ టోపీని రెడ్ అలెర్ట్- ప్రమాదానికి సంకేతంగా ప్రధాని వర్ణిస్తూ…యు.పి. కి “ఉపయోగి” ఆదిత్యనాథ్ అని “UPayogi” కొత్త సమాసాన్ని సృష్టించి దాని ఇంగ్లీషు, సంస్కృత మిశ్రమ విభక్తి ప్రత్యయాలను కూడా చక్కగా వ్యాకరణీకరించి చెప్పారు. వెంటనే మరుసటి రోజు దేశవ్యాప్తంగా అన్ని భాషల పత్రికల్లో, టీ వీల్లో

“U P plus Yogi is equal to Upayogi” అని ప్రధాని పేరుతో యు పి సమాచార పౌరసంబంధాల శాఖ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలను కుమ్మరించింది.

ప్రవహించేదే భాష అని ఒక నిర్వచనం కూడా ఉంది. యు పి లో గంగ ప్రవహిస్తూనే ఉంది. గంగను, కాశీని నమ్ముకున్న మోడీ- యోగులకు భాషా గంగ కూడా అనుకూలంగానే ప్రవహిస్తోంది.

దీనికి కౌంటరుగా లాల్ టోపీ అఖిలేష్ మీడియా బృందం “నిరుపయోగి” అన్న మాటను కాయిన్ చేసింది కానీ…ఉపయోగి ఉధృత వాణి ముందు...నిరుపయోగి నీరసంతో నిముషం కూడా నిలబడలేదు. రాజకీయాల్లో డిఫెన్స్ విద్య పనికి రాదు!

పొదుపులేని మాటలు
ఏ భాషలో అయినా కొన్ని నిత్య ఏక వచనాలు, కొన్ని నిత్య బహు వచనాలు ఉంటాయి. పాలు/లకు పా ఏకవచనం కాదు. పాలు పొంగుతున్నాయి. పాలు చిక్కగా ఉన్నాయి అనే అంటాం.

పాలు పొంగుతోంది. పాలు చిక్కగా ఉంది అనడానికి పాలల్లో ఉన్న బహువచన సంకేతం లు అభ్యంతరం చెబుతుంది. మీది నాయన ఇంట్లో ఉందా? అంటే ఎలా ఉంటుందో అలాగే వచన వ్యత్యాసం పాటించకపోతే అంతా గజిబిజిగా ఉంటుంది.

ఇంగ్లీషులో saving సింగ్యులర్. Savings ప్లూరల్. తెలుగులో పొదుపు నిత్య ఏకవచనం. అంటే ఒక పొదుపు అయినా ఇద్దరి పొదుపు అయినా కోటి మంది పొదుపు అయినా పొదుపే అవుతుంది కానీ…పొదుపులు కాదు. మహిళా స్వయం సహాయక బృందాల పొదుపు సంఘం; మహిళల పొదుపు సంఘాలు అని ఎప్పటినుండో చక్కగా వాడుతున్నాం. ఒక ఆన్ లైన్ సేల్స్ ప్రకటనలో ఇంగ్లీషు సేవింగ్స్ కు అనువాదమై ఇబ్బడి ముబ్బడిగా పొదుపులు 50 శాతం వరకు జరుగుతున్నాయి. తెలుగులో దేనికయినా బహువచన ‘లు’ పెట్టుకునే స్వేచ్ఛ వ్యాకరణం ఇస్తుంది అనుకుంటే…పద పదాన చివర ఇలాగే ‘లు’ చేర్చుకుంటూ పోవచ్చు!

ఫ్యామిలీ ఫీలింగ్
అమెరికా వాహనాల తయారీ కంపెనీ ఫోర్డ్ కు భారత్ లో ఏదో విశ్వసనీయత సమస్య వచ్చినట్లుంది. కస్టమర్ల మనసు గెలవడానికి, తమ వాహనాలు మన్నికయినవి అని చెప్పడానికి ఏవో తంటాలు పడుతోంది. బహుశా ఇంగ్లీషు యాడ్ టెక్స్ట్ ను ఏ యంత్రం అనువదించిందో కానీ…

“ఫోర్డ్- కొంచెం విభిన్నమయిన, ఫ్యామిలీ లాంటి ఫీలింగ్”
అని మక్కికి మక్కి దిగిపోయింది. ఎన్నో మైళ్ల దూరం వరకు మనకు సర్వశ్రేష్ఠమయిన సేవలు అందిస్తూ మన ఫ్యామిలీతో వాళ్ల ఫ్యామిలీని కలిపేసుకుంటారట. ఫోర్డ్ ఫ్యామిలీ పెళ్లి సంబంధం ప్రకటన రాయబోయి…ఆటోమొబైల్ ప్రకటన రాసినట్లున్నారు!

భాషా అస్థిరతకి!
మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే…అన్నది ఈనాడు వారి మార్గదర్శి ట్యాగ్ లైన్. తెలుగంటే ఈనాడు. ఈనాడంటే తెలుగు. అలాంటి ఈనాడు వారి మార్గదర్శికి ఈ ప్రకటన ఎవరు రాశారో? ఎవరు డిజైన్ చేశారో?

అస్థిరత మాటకు విభక్తి ప్రత్యయం చేరితే- అస్థిరతకు అవుతుంది. అస్థిరత చివరి అక్షరంలో అ ఉన్నప్పుడు ‘కు’ మాత్రమే వస్తుందని ఈనాడు జర్నలిజం స్కూల్లోనే వ్యాకరణ పాఠాలు చెబుతుంటారు. ఈనాడుకు అనే అనాలి. ఈనాడుకి అని అనకూడదు. కిటికీకి అనే అనాలి. కిటికీకు అనకూడదు. అయినా స్థిరమయిన మార్గదర్శిని ఇలాంటి కి కు కున్ యొక్క లోన్ లోపలలు ఏ రకంగానూ అస్థిరపరచలేవు.

“అస్థిరతకు సెలవు- ఆనందానికి నెలవు” అన్నది శీర్షిక. నిజానికి రాసిన కాపీ రైటర్ ప్రాసయుక్తంగా చక్కగా రాశారు- కు అన్న లోపం తప్ప.

అయితే యాడ్ డిజైన్లో పైన

అస్థిరతకి-
కింద
మార్గదర్శి కి
ఒక సైజు అక్షరాలు పెట్టి, మిగతా మ్యాటర్ అంతా చిన్న లెటర్స్ లో  పెట్టి మొత్తం స్పిరిట్ ను భంగపరిచారు. కంటి చూపు సమస్య ఉన్నవారికి మొదట పెద్ద అక్షరాలు-
అస్థిరతకి మార్గదర్శి అని ప్రయారిటీలో పెట్టినట్లు కనిపిస్తుంది.
మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే కాబట్టి…తెలుగు వ్యాకరణం తోడురాకపోయినా పెద్ద నష్టమేమీ ఉండదు!

ఒకప్పుడు పంటి కింద రాళ్ళు దొరికేవి. ఇప్పుడు రాళ్ళ కింద పళ్ళను వెతుక్కోవాల్సి వస్తోంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : నిరీక్షణ రామాయణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్