Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకోతులకూ వచ్చింది అడుక్కునే విద్య

కోతులకూ వచ్చింది అడుక్కునే విద్య

Begging Skills:
పద్యం:-

అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను?
మృగజాతి కెవ్వడు మేతబెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె?
జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె?
స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?
ఫణుల కెవ్వడు పోసె బరగబాలు?
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె?
బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి?

జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ!
భూషణవికాస | శ్రీధర్మ పురనివాస |
దుష్టసంహార | నరసింహ దురితదూర |
-నృసింహ శతకంలో కవి శేషప్ప

అర్థం:-
అడవిలో పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు?
జంతువులకు మేత ఎవరు పెడుతున్నారు?
అడవిలో ప్రాణులకు అన్నం ఎవరు పెడుతున్నారు?
చెట్లకు ఎవరు నీళ్లు చేది పోస్తున్నారు?
స్త్రీల గర్భంలో శిశువును ఎవరు పెంచుతున్నారు?
పాములకు ఆహారం ఎవరు పెడుతున్నారు?
తేనెటీగలకు మకరందాన్ని ఎవరు ఇస్తున్నారు?
పశువులకు పచ్చి గడ్డిని ఎవరు అందిస్తున్నారు?
ఎంత తరచి చూసినా…జీవకోట్లకు వేళకింత ఆహారం పెట్టి…పెంచి పోషించేవాడివి నీవు తప్ప…
వేరొక దాత లేడయ్యా! నరసింహస్వామీ!

భారత దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో కోతుల ప్రవర్తన మీద జంతు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయన నివేదిక ప్రచురితమయ్యింది. భారతీయ శాస్త్ర పరిశోధన మండలి శాస్త్రవేత్తలు కూడా ఈ అధ్యయన బృందంలో ఉన్నారు. వారి నివేదికలో విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో ముఖ్యమయిన విషయాలివి:-

1 . పుణ్యక్షేత్రాల్లో భక్తులను ఆహారం అడగడానికి కోతులు 8 రకాల హావభావాలను అలవాటు చేసుకున్నాయి. మనుషుల్లా చేయి చాచి ఆహారం కావాలని సైగ చేయడం ఇందులో ప్రధానమైనది.

2 . భక్తుల కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడడం ద్వారా అతడు/ఆమె ఇచ్చే రకమా? ఇవ్వకుండా వెళ్లిపోయే రకమా? తెలుసుకోగలుగుతున్నాయి.

3 . బ్రెడ్డు ముక్క, కొబ్బరి చిప్ప, అరటి పండు ఇవ్వబోతే అరటి పండుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాయి. బెల్లం ముక్క, చాకొలేట్ లాంటి ఇస్తున్న పదార్థం వాటికి నచ్చకపోతే…తీసుకోవడం లేదు. లేదా తీసుకుని కింద పడేసి…ఇంకేదో కావాలని శరీర భాష- బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పగలుగుతున్నాయి.

4 . భక్తులు ఇవ్వకుండా వెళ్లిపోతే…బాధను వ్యక్తం చేస్తున్నాయే కానీ…వారి మీద పడి కోతుల సహజగుణంతో అల్లరి చేయడం లేదు.

5 . పట్టణ ప్రాంతాలకు అలవాటు పడ్డ కోతులు రోడ్ల కూడళ్లలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు.. .గమనించి… జనంతో పాటు రోడ్డు దాటుతున్నాయి. గ్రీన్ సిగ్నల్ పడి వాహనాలు వెళుతున్నప్పుడు ఆగుతున్నాయి.

https://www.youtube.com/watch?v=DhhSfHm6j1s

హనుమ అనుమ ఓ మనమా!
హనుమ నామమే సుఖమనుమా!
lహనుమl

అనుమానము మానుమ ఓ మనమా!
వినుమా మహిమ గరిమ మనమా!
lహనుమl

రామాయను మానితమానవ సంక్షేమ వర మారుతి…మారుతి…మా హనుమా!
lహనుమl

మురళీ రవ మాధురివౌ
నిను మాతరమా!
వర మౌనులమా తెలియ?
lహనుమl” అని అందుకే మంగళంపల్లి బాలమురళీకృష్ణ తాదాత్మ్యంతో రచించి…పరవశించి గానం చేశారు.

సృష్టిలో తానొక్కడే గొప్పవాడని మనిషి విర్రవీగుతూ ఉంటాడు కానీ…ప్రతి ప్రాణికీ ఆహారం వెతుక్కునే విద్య అంతర్గతంగా ఉంటుంది. నిజానికి ఆహారాన్వేషణలో మనిషి కంటే మిగతా ప్రాణులే గొప్ప.

ఒక చీమ అతి చిన్న బెల్లం ముక్కను కష్టపడి ఇతర చీమల సహాయంతో మోసుకుపోతుంటే అటుగా వెళుతున్న నారదుడు చూసి…జాలి పడి…అర చేతిలోకి తీసుకుని…అయ్యో చీమా! ఎంత కష్టపడుతున్నావు? నేను వైకుంఠానికి వెళుతున్నాను. నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్లి…పునరావృత్తి రహిత శాశ్వత వైకుంఠ స్థానం ఇప్పిస్తాను…నాతో రా! అన్నాడు. నాతో పాటు ఒకసారి నా చీమల గూట్లోకి రండి స్వామీ! అని నారదుడిని చీమ తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ వందల చీమలు. అరలు అరలు. ప్రతి అరలో చెక్కర, బెల్లం ముక్కలు. ఏమిటిదంతా? అని అడిగాడు నారదుడు. వర్షాకాలం వస్తోంది కదా స్వామీ! నాలుగు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకున్నాము. ఎండన పడి వచ్చారు…కొంచెం బెల్లం పానకం కలిపి ఇవ్వమంటారా! చల్లగా తాగి వెళుదురు కానీ…అని చీమ అతిథి మర్యాదతో అడిగింది.

నారాయణ! నారాయణ!
సృష్టిలో అతి చిన్న చీమక్కూడా ఆహార సేకరణ, ఆహార నిల్వ మీద ఇంతటి క్లారిటీ పెట్టావా స్వామీ! అని నారాయణుడిని మనసులో తలచుకుని… “జీవకోట్లను పోషింప నీవెకాని…
వేఱె ఒక దాత లేడయ్య వెదకిచూడ!”
అన్న కవి శేషప్ప పద్యం పాడుకుంటూ…చీమకు థాంక్స్ చెప్పి…చీమ గూట్లో నుండి బయటపడ్డాడు.

కోతులు కొమ్మలు వదిలి నాగరికమై…మనుషుల్లా మారుతున్నాయి.
కోతుల నుండి పుట్టిన మనిషి…తన మూలాలను వెతుక్కుంటూ కోతి అవుతున్నాడు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్