Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమునుగోడులో మునిగేది ఎవరు?

మునుగోడులో మునిగేది ఎవరు?

What For?:
“ఉన్నది మనకు ఓటు;
బతుకు తెరువుకే లోటు…”
అని ఆరుద్ర అనవసరంగా తొందరపడి రాసేసినట్లున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటు విలువ తెలుసుకుని ఉంటే…

“ఉన్నది మనకు ఓటు;
బతుకు తెరువుకే చోటు…”
అని ఖచ్చితంగా పదం మార్చి రాసి ఉండేవారు.

హైదరాబాద్ మహా నగరానికి గంట, రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న గ్రామీణ నియోజకవర్గం మునుగోడు. 2,41,000 ఓటర్లు. ఏడు మండలాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేసి…భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో గెలవబోయే ఎమ్మెల్యే పదవీ కాలం మహా అయితే పద్నాలుగు నెలలు. తరువాత ఎలాగూ సాధారణ ఎన్నికలు వస్తాయి.

ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బహుశా భారత దేశంలోనే ఈ ఉప ఎన్నిక అత్యంత ఖర్చుతో కూడినది అన్నది నిజం కావచ్చు. అతిశయోక్తి కావచ్చు. రాజకీయాలను కాస్త లోతుగా అర్థం చేసుకునేవారి లెక్కల ప్రకారం...టీ ఆర్ ఎస్- బి జె పి రెండు పార్టీలు, అభ్యర్థులు మునుగోడు వైతరణి దాటడానికి పెడుతున్న ఖర్చు అక్షరాలా అయిదు వందల కోట్ల రూపాయల పైమాటే.

భారత ఎన్నికల సంఘం ఒక్కో అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికలకు అనుమతించిన మొత్తం అక్షరాలా నలభై లక్షల రూపాయలు దాటకూడదు.

నియోజకవర్గంలో ఎంపిటిసీలు, జెడ్పిటీసి లు దాదాపు 700 మంది ఉండగా వీరందరికీ బీ జె పి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇచ్చారని…మరో విడత కూడా ఒక్కొక్కరికి దాదాపు పది లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారని చౌటుప్పల్ జాతీయ రహదారి ఉవాచ. దాంతో తగ్గేదే ల్యా అనుకుంటూ టీ ఆర్ ఎస్ కూడా ఎంతో కొంత తాంబూలంలో పెట్టి ఇస్తోందట. నగదు పంపకంలో ఇప్పటికయితే టీ ఆర్ ఎస్ బాగా వెనుకపడి ఉందని మునుగోడులో గోడలు చెవులు కొరుక్కుంటున్నాయి. కాంగ్రెస్ దగ్గర పంచడానికి బూడిద తప్ప ఏమీ మిగల్లేదు కాబట్టి…ఆ బూడిదను ఓటర్లు ఎవరూ తీసుకోవడం లేదు కాబట్టి…తామే బూడిద పూసుకుని వైరాగ్యంతో తిరుగుతున్నారు. అలాగని కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకు లేదని కాదు. వనరులు సమకూర్చుకునే పోటీలో మాత్రం వెనకబడింది.

ఇవి కాక సంప్రదాయేతర విధానాల్లో కూడా బి జె పి- టీ ఆర్ ఎస్ ఈ ఎన్నికను ఎక్కడికో తీసుకెళ్లాయి. అందులో మచ్చుకు కొన్ని:-

1. యాదగిరిగుట్టకు ఓటర్లను బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లి…నరసింహస్వామి గుళ్లో తమకే ఓటు వేస్తామని ప్రమాణం చేయించడం.
2. ప్రచారంలో మూడు పూటలా ఉచితంగా అన్ లిమిటెడ్ చికెన్ బిర్యానీ, మందు.
3. మండల స్థాయి నాయకులకు సరికొత్త నాలుగు చక్రాల వాహనాలు ఉచితంగా ఇవ్వడం.
4. కుల సంఘాల వన భోజనాలు.
5. ఒక స్థాయి లీడర్ల పాత అప్పులు తీర్చి…వారిని రుణ విముక్తులను చేయడం.
6. పెళ్లిళ్లు, చావులు ఉంటే అడక్కపోయినా ధన సహాయం.
7. ఇంకా చాలా ఉన్నాయి కానీ…సభా మర్యాద దృష్ట్యా ప్రస్తావించకూడదు.

అయిదు వందల కోట్లు ఖర్చు పెడితే ఒక గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని-
1. బళ్లకు భవనాలు కట్టవచ్చు?
2. ఆసుపత్రులు కట్టవచ్చు?
3. రహదారులు వేయవచ్చు?
4. చెరువులు తవ్వించవచ్చు?
5. కాలువలు వేయవచ్చు?
6. బియ్యం బస్తాలు ఇవ్వవచ్చు?
7. ఎంతమందికి మంచి చదువు చెప్పించవచ్చు? …లాంటి పిచ్చి ప్రశ్నలు అకెడెమిగ్గా బాగుంటాయని కానీ…ప్రాక్టికల్ గా కుదరదు.

“గాంధి పుట్టిన దేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా?
యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు…
పేరుకు ప్రజలది రాజ్యం…పెత్తందార్లకే భోజ్యం”

అన్నట్లు-
మునుగోడు ఓటరు ఎంత క్లారిటీతో ఉన్నాడో చెప్తున్న వీడియో ఒకటి తెగ వైరల్ గా తిరుగుతోంది. (ఒకాయన చెప్పిన మాటలకు కొంత హాస్యం జోడించి…ఎవరో కట్ అండ్ పేస్ట్ చేసినట్లున్నారు)

ఓటు చాలా విలువయినది అంటే ఏమో అనుకున్నారు…
మరీ ఇంత వందల కోట్ల విలువయినదా?

మునుగోడులో గెలిచే అభ్యర్థి…
ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తాడా?
ఓడిస్తాడా?
గేలి చేస్తాడా?

ఎవరి క్లారిటీ వారికున్నప్పుడు…
ఇంతకూ క్లారిటీ లేనిదెవరికి?
ఎన్నికల సంఘనికా!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ప్రత్యర్థి గెలిస్తే …తానోడుతోందా?

Also Read :

అస్త్రాయా ఫట్ ఫట్ – వస్త్రాయా జట్ జట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్