Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాలం తుంచిన స్నేహం

కాలం తుంచిన స్నేహం

Testing Time: ఈనాడు ‘వసుంధర ‘లో పనిచేసేటప్పుడు ‘కాలం తెచ్చిన కొత్త స్నేహం’ అనే పేరుతో మారుతున్న అత్తాకోడళ్ల సంబంధాలపై ఒక స్టోరీ చేశాను. సమాజంలో ప్రముఖులైన కొంతమంది అత్తలు, కోడళ్లతో మాట్లాడి చేసిన స్టోరీ అది. బహుశా దానికి పునాది పడింది మాత్రం నా పెళ్లిలోనే.

‘నేనే మధు వాళ్ళ అమ్మను’ అని పెళ్లి పందిట్లో పరిచయం చేసుకున్న స్నేహం మా అత్తగారు. అంతవరకూ నేను ఆవిడని కలవలేదు. సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో కనిపించే అత్తగార్లకి పూర్తి భిన్నం. పెద్దగా చదువుకోలేదు. చాలా చదువుకున్న మామయ్యగారితో సుదీర్ఘ ప్రయాణమే చేశారు. అందుకేనేమో గత ఆగష్టులో మామయ్యగారు పోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోయారు. ఐదునెలలకే ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఇది బాధాకరమే అయినా ఆవిడ కోరుకున్న మార్గం కాబట్టి ఏమీ అనుకోలేము.

ఈ సందర్భంగా మా అత్తగారితో నా అనుబంధం గురించి కొన్ని మాటలు…
అత్తగారంటే సినిమాల్లో సీరియళ్ళలో చూపినట్టు గయ్యాళిగా, కోడల్ని నొప్పించే వారిగానే భావిస్తారు . నా బంధుమిత్రులలోనే అటువంటి అత్తాకోడళ్లు ఎందరో. పాతికేళ్ల ప్రస్థానంలో ఒక్కమాట కూడా అనుకోకుండా ఉండటం అరుదే. అదే మా ప్రత్యేకత. అన్నట్టు మా అత్తగారు వాళ్ళ అత్తగారితో కూడా అంతే స్నేహంగా ఉండేవారు. మేము, మా అత్తమామలు వేరే ఊళ్లలో ఉండటం వల్ల కొంచెం తక్కువగా కలుసుకునేవాళ్ళం. ఉండేది ఒకటి రెండు రోజులే కావడం వల్ల నా దగ్గర ఆవిడ కానీ, వాళ్ళదగ్గరికెళ్ళినపుడు నేను కానీ పని చేయాల్సిన అవసరం రాలేదు. ఏ రోజూ ఇలా ఉండాలనికానీ చెయ్యాలని కానీ చెప్పలేదు. ఇద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకొనేవాళ్ళం. నా చెయ్యి విరిగినప్పుడు వచ్చి సహాయంగా ఉన్నారు. నేను ఏం చేసినా బాగుందనేవారు. ( నాకొచ్చింది అరాకొరా వంటలే ) ఆవిడేమో చక్కటి వంటలు చేసేవారు. కడప ఎర్రకారం, ఉల్లిపాయ- కొబ్బరి పచ్చడి ఆవిడ దగ్గరే నేర్చుకున్నా. ముఖ్యంగా ఆవిడ పెట్టే రసం మా అబ్బాయికి చాలా ఇష్టం. ‘ నానమ్మ చారు’ అంటాడు. ఏం చేసినా రుచిగా, త్వరగా చేసేవారు. ఇన్నేళ్ళుగా చారుపొడి, బిసిబెళెబాత్ పొడి ఆవిడే పంపించేవారు. చకచకా చక్కగా తయారవడం, నవ్వుతూ మాట్లాడటం ఆవిడ ప్రత్యేకత. పిల్లలంటే ఎంతో ప్రేమ. మనవళ్ళంటే మురిపెం. తన సమస్యలు, ఇబ్బందులు ఎప్పుడూ చెప్పేవారు కాదు. అదొక్కటే నా ఫిర్యాదు.

మొక్కలు, పువ్వులు ఆవిడకి ఇష్టమైన సబ్జెక్టు. అద్దె ఇళ్లల్లోనే అనేక రకాల మొక్కలు పెంచేవారు. నాకు కూడా పువ్వులతో, దీపాలతో అలంకరణ ఇష్టం. మా ఇద్దరికీ దోస్తీ కుదిరింది ఇక్కడే. ఏటా వరలక్ష్మీ వ్రతానికి స్నేహితులను పిలిచేదాన్ని. మెల్లగా మా అత్తగారు రావడం మొదలుపెట్టారు. దాంతో ఇద్దరం కలసి అలంకరించేవాళ్ళం. పండుగకు ఒకరోజు ముందే తిరుపతి నుంచి పూలు కూడా ఓపికగా తెచ్చేవారు. అలంకరణ బాధ్యత అంతా ఆవిడదే. వచ్చిన వారంతా బాగుందంటే మురిసిపోయేవారు. అత్తగారి సూచనతో రకరకాలుగా పువ్వులు, దీపాల అలంకరణ చేసేవాళ్ళం. సుమారు పదేళ్ళపాటు సాగిన ఈ సంప్రదాయానికి కరోనా అడ్డుకట్ట వేసింది. అత్తగారు రాలేదు. మరో ఏడాది బయటివారిని పిలిపించి అలంకరణ చేయించాను. మామగారికి బాగాలేక అప్పుడూ రాలేదు. అయన పోయారు. యాభై ఐదేళ్లకు పైగా ఆయనతో అనుబంధం ఉన్న అత్తయ్య తట్టుకోలేకపోయారు. ఎంత ఊరడించినా, స్థలం మార్చినా వేదన తీరలేదు. ఉన్నట్టుండి ప్రాణం వదిలేేశారు.

ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కొడుకుల కుటుంబానికి ఇది తీరని విషాదం. నాకు వ్యక్తిగతంగా లోటు. ఆమెనుంచి ఓపిక, మంచి మాట చక్కటి ఆభరణాలని తెలుసుకున్నా. కొత్త స్నేహాన్ని పరిచయం చేసిన కాలమే ఇంత హఠాత్తుగా తుంచేస్తుందని తెలుసుకోలేక పోయాను. అయితేనేం, ఆకులో ఆకులా, పూవులో పూవులా పువ్వుల్లో, పచ్చటి ఆకుల్లో అత్తయ్య పలకరిస్తూనే ఉంటారు. అలంకరణల్లో కనిపిస్తూనే ఉంటారు. మిస్ యూ అత్తయ్యా!

-కె. శోభ

Also Read :

తల్లీ! నిన్ను తలంచి…

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్