This is too much:
నటుడు నాని ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లున్నారు. ఆమధ్య ఓ టీ టీ విషయంలో ఎగ్జిబిటర్లతో ఏదో గ్యాప్ వచ్చి “నా సినిమాను మీరు రద్దు చేయడమేమిటి? హీరోగా నన్ను నేనే రద్దు చేసుకుంటాను” అన్నారు. ప్రతి సినిమా విడుదలలో నాని ఇలా ఏదో ఒకటి చెప్పని పరిస్థితి కాకతాళీయమో? లేక ఇంకేవయినా ఇతరేతర కారణాలున్నాయో?
తాజాగా “శ్యామ్ సింగ రాయ్” సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానిస్తోందని అన్నారు. వెనువెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ నానికి సమాధానమిచ్చారు. నాని ప్రకటనలో ఆయన సినిమా లాభనష్టాల తపనను అర్థం చేసుకోవచ్చు. ఒక్కో టికెట్టు మీద పది రూపాయలు ఎక్కువ రాబట్టుకోగలిగితే సినిమా నిలబడుతుందన్న ఆయన ఆరాటాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచంలో ఎక్కడయినా జనబాహుళ్యానికి ఒక రూపాయి బరువు తగ్గితే…ఊరట కలిగినట్లు. సామాన్యులకు కొంత పొదుపు అయినట్లు. వందరూపాయలు ఎక్కువ ఖర్చు అయితేనే పొదుపు అయినట్లు నాని కొత్త సూత్రాన్ని కనుగొన్నారు. అలా పొదుపు జరగడంవల్ల ప్రేక్షకులను ఘోరంగా అవమానించినట్లు అన్నది నాని నవీన సిద్ధాంతం.
నిజమే.
వెయ్యో, రెండు వేలో పెట్టి …శ్యామ్ సింగ రాయ్ సినిమా చూద్దామని నోట్లను విసరబోయిన ఏ పి పేక్షకులకు…అంతకంటే చాలా తక్కువకే టికెట్ దొరకడంతో జరిగిన అవమానం అంతా ఇంతా కాదు. ఆ అవమాన భారంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ప్రేక్షకులు ఇళ్లు దాటి బయటికి రావడం లేదు!
నిజమే.
ఎంత రేటయినా పెట్టి టికెట్ కొందామనుకున్నవారికి అంతకంటే తక్కువ ధరకు దొరకడం అవమానాల్లోకెల్లా పెద్ద అవమానం!
ఇంతకూ…
అవమానం అన్న మాటను నాని ఏ అర్థంలో వాడుతున్నారో? ఆయన నిఘంటువులో అవమానం అన్న మాటకు ఏయే అర్థాలున్నాయో?
సందర్భం వచ్చింది కాబట్టి…నిజంగా ప్రేక్షకులకు జరుగుతున్న అవమానాలను ఎవరయినా నాని దృష్టికి తీసుకెళితే…వాటి మీద కూడా ఆయన ఇలాగే ఆవేదన వ్యక్తం చేస్తే బాగుంటుంది.
రెమ్యునరేషన్ అవమానం:-
కరోనాలు కట్టగట్టుకుని మీద పడితే సినిమా పరిశ్రమలో చిన్నవారికి ఉపాధి పోయింది. చిగురుటాకులా వణికిపోయారు. పెద్దవారి ఇంటి చెట్టు ఆకు కూడా కదల్లేదు. అగ్ర హీరోల రెమ్యునరేషన్ తాత్కాలికంగా అయినా తగ్గితే అవమానం కాబట్టి…తగ్గలేదు. తగ్గాల్సిన అవసరం మీద నాని ఏదయినా మాట్లాడితే బాగుంటుంది.
శ్రమకు అవమానం:-
శ్రమను మరచిపోవడానికి…కాసేపు వినోదానికి కష్టజీవులు ఎక్కువగా సినిమాలకు వెళుతుంటారు. వారికి పది రూపాయలు మిగిలితే అవమానమా? వారి శ్రమ సొమ్మును దోచుకుంటే అవమానమా? నానీకి ఎవరయినా అర్థమయ్యేలా చెబితే బాగుండేది.
సైకో ఫ్యాన్స్ అవమానం:-
అభిమానులు వేళ్లు కోసుకుని రక్త తిలకాలు దిద్దితే స్టార్లు ఆకాశంలో మెరుస్తుంటాయి. జేబులకు చిల్లులు పడి, రక్తం కూడా పీల్చి పిప్పి చేశాక…అభిమానుల దగ్గర ఇక స్టార్లు తోడుకోవడానికి ప్రాణాలు తప్ప ఏమీ మిగల్లేదని నానీకి ఎవరయినా విడమరచి చెబితే బాగుండేది.
దోపిడీకే అవమానం:-
ఎవరయినా రూపాయి రూపాయి ఎక్కువసార్లు తీసుకోవాలనుకుంటారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక్క రోజులో ప్రేక్షకుల దగ్గరనుండి వందల, వేల కోట్లు లాక్కోవడానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కుతుంది. అహోరాత్రుల బెనిఫిట్ షోలతో బెనిఫిట్ ను పిండుకుంటుంది.
విలువలకు అవమానం:-
“మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి …..
కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు”
ఇదొక సినిమా డైలాగ్.
ఈ సందర్భంలో ఈ డైలాగ్ కు ప్రతిపదార్థాన్ని త్రివిక్రమ్ లు ఎవరయినా నానీకి చెబితే బాగుండేది!
ప్రేక్షకుల మర్యాదకు, భాషకు, మనోభావాలకు జరిగిన, జరుగుతున్న, జరగబోయే అవమానాలు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరయినా నానీకి ఒక్కొక్కటిగా చెబితే బాగుండేది!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :