Real Vedantam: ఉపోద్ఘాతం, పరిచయం అక్కర్లేని పేరు నిత్యానంద. నిజానికి నిత్యానంద మాట సమాసాన్ని భక్తులు విభక్తుల సాయంతో అన్వయించుకుంటే ఎన్నెన్నో అలౌకికానందార్థాలు వాటంతటవే దొర్లుకుంటూ వస్తాయి.
నిత్యం ఆనందంగా ఉండేవాడు.
నిత్యం ఆనందం తానే అయినవాడు.
నిత్యం ఆనందం పంచేవాడు.
ఆనందం నిత్యమై, సత్యమై మన కళ్ల ముందు నిలిచినవాడు.
ఇలా ఆనంద సముద్రమంత అర్థ గాంభీర్యం నిత్యానందలో దాగి ఉంది.
దశాబ్దాలుగా మనకు ఆనందం పంచి…పంచి…ఆయనలో ఆనందం ఆవిరి అయ్యిందో? లేక ఇన్నాళ్లకు నిజంగా ఆయనకు నిజమయిన ఆనందం అర్థం తెలిసిందో కానీ…ఎప్పుడూ లేనిది బరువయిన, చాలా రియలిస్టిక్ మాటలు మాట్లాడుతున్నారు.
1. ఆరు నెలలుగా ఆయనకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు.
2. అన్న పానీయాలు తీసుకోలేకపోతున్నారు.
3. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటూ…ఈ శారీరక బాధ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు.
4. భక్తులెవరూ దిగులు పడవద్దు.
5. త్వరలో కోలుకుని ఇనుమడించిన ఉత్సాహంతో మళ్లీ ప్రత్యక్షమవుతారు.
తనకు తానే ప్రకటించుకుని, తనకు తానే నిర్మించుకుని, ఉంటున్న కైలాస గ్రహం/ఖండం/దేశం/ద్వీపం నుండి స్వామివారు అనుగ్రహించిన పాయింట్ల సారాంశమది.
ఈ బుల్లెట్ పాయింట్లు చదవగానే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాసేపు వైరాగ్యంతో నిర్వికల్ప, నిరామయ, నిస్సంగ, నిర్మల, నిష్ప్రపజ్ఞ, నిర్గుణ, నిర్ద్వంద్వ, నిరాధార, నిరుపమ, నిత్య అయోమయ, సత్య అనుమాన స్థితిలోకి వెళ్లి…”ఇల్లే కైలాసం” అన్న సహజ న్యాయ సూత్రం ప్రకారం మళ్లీ ఈ లోకంలోకి వచ్చాను.
మనలాంటి మామూలు మనుషులకు నిద్రపట్టకపోవడానికి ఆందోళనలు కారణం.
మరి స్వామివారి కారణాలేమిటో?
అరుచి, అజీర్తి మన విషయ లంపటాలు.
మరి స్వామివారి అజీర్తికి కారణాలేమిటో?
అరగనివి ఏమి తిన్నారో?
మనకు జుట్టు నెరిసినా, పళ్లు కదిలినా, కళ్లు చెదిరినా మనోవ్యధ.
మరి స్వామివారి మనోవ్యధకు కారణమేమిటో?
సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా, వై ఫై లేకపోయినా మనకు కాళ్లు చేతులు ఆడవు.
మరి స్వామివారి కాళ్లు చేతులు ఆడకపోవడానికి కారణాలేమిటో?
లేచీ లేవగానే కాఫీ టీ లు తాగకపోతే మనకు తలతిరిగినట్లు ఉంటుంది.
మరి స్వామివారి తలతిరుగుడుకు కారణాలేమిటో?
బ్యాంకు హౌసింగ్ లోన్లు, వెహికిల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, పిల్లల ఎమ్మెస్ యూ ఎస్ గ్రీన్ కార్డ్ వీసా గొడవలు మనకు రుణానుబంధాలు.
మరి స్వామివారిని పట్టి పీడిస్తున్న రుణానుబంధాలు ఏవో?
త్రిబుల్ ఆర్ విజయం, ఆచార్య అపజయం, కె జి ఎఫ్ అఖండ విజయం మనకు అలౌకిక పారమార్థిక విషయాలు. మరి స్వామివారి పారమార్థిక విషయాలేవో?
మనకు రోగమొస్తే డాక్టరు చెబితే మంచాన పడి ఉంటాం. స్వామివారు కూడా డాక్టర్లు చెబితే మంచం మీదే పడుకుని ఉంటే ఎలా?
త్వరగా కోలుకుని లే స్వామీ!
లేచి నడువు స్వామీ!
కూర్చుని మాట్లాడు స్వామీ!
మాట్లాడి మమ్ము అనుగ్రహించు స్వామీ!
నీ మాట వినక…
వేదప్రామాణిక సంస్కృత భాష, క్లాసికల్ తమిళ భాషల్లో మాట్లాడాల్సిన పశువులు మూగగా రోదిస్తున్నాయి.
నిన్ను చూడక…
పడి పడి నవ్వాల్సిన పెదవులు మౌనంగా మూతి ముడుచుకుని ఉన్నాయి.
నువ్వు లేక…
హాస్యరసం లేని సామాజిక మాధ్యమాలు నీరసించి ఉన్నాయి.
నీ అపార కృపా పారావార దృష్టి పడక…
తెరుచుకోవాల్సిన మా మూడో కన్ను మూసుకునే ఉంది.
“నాకు బతకాలని లేదు” అని అనే అధికారం, అర్హత, అవసరం మానవమాత్రులమయిన మాకే ఉంటుంది. ఆ మాట నువ్వంటే మేమెలా బతుకుతాము స్వామీ?
రా స్వామీ!
రా!
నిత్యమై…సత్యమై…
నిత్యసత్యమై…
మా నిత్యానందమై…
కైలాసం వదిలి…కదిలి…రా!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :