Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబిబి'ఛీ'పై ఇంత గగ్గోలా?

బిబి’ఛీ’పై ఇంత గగ్గోలా?

No need of  Ban: చాలా కాలమైంది బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) గురించి విని! మీడియా అనేది భారత్ లో పెద్దగా విస్తరించని వేళ, ఆత్మన్యూనతతో విదేశమంటే గొప్ప అనుకునే కాలంలో బిబిసిలో వచ్చిందంటే నిజం కాబోలు అనుకునేవాళ్ళం. అప్పుడు… బిబిసి వార్తల్లో నిజం ఎంత ఉండేదో ఏమో తెలియదు, మన దగ్గరే తామర తంపరగా మీడియా పుట్టుకొచ్చాక బిబిసి ఊసే లేకుండా పోయింది. మొత్తానికి అమృతోత్సవ వేళ నరేంద్ర మోడీ ప్రభుత్వ పుణ్యమా అని మళ్ళీ ఆ పేరు చాలా మంది చెవులను తాకింది.

22 ఏళ్ళ కిందట గుజరాత్ లో జరిగిన అల్లర్లపై బిబిసి డాక్యుమెంటరీ రూపొందించి, నాటి అలర్లలో మోడీ పాత్రపై ప్రశ్నలు సంధించింది. దాన్ని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం భారత్ లో నిషేధించడం ఈ గొడవ అంతటికీ మూలకారణం!

బిబిసి తయారుచేసిన డాక్యుమెంటరీ మోడీపై కొత్త విషయం ఏమైనా బైటపెట్టిందా? ఆయన పాత్రపై సరికొత్త సాక్ష్యాలేమైనా తీసుకొచ్చిందా? అంటే ఏమీ లేవు.  22 ఏళ్ళుగా మన దేశంలోని విపక్షాలు (కాంగ్రెస్, వామపక్షాలు, ఇతరత్రా మైనార్టీ పార్టీలు), విదేశీ  మీడియాలోని కొందరు చేసిన ఆరోపణలనే మళ్ళీ పోపు వేసి కొత్త డాక్యుమెంటరీగా విడుదల చేసింది. అంతే!

కాబట్టి ఆశ్చర్యపరిచే అంశం బిబిసి డాక్యుమెంటరీ కాదు, భారత ప్రభుత్వ స్పందన! మరీ ఈమాత్రం దానికే ప్రభుత్వంలో ఇంత గగ్గోలా? ఒక వంక వలసవాద మనస్తత్వం పోవాలనుకుంటూ, అమృతోత్సవ వేళ ఆంగ్లేయ భావజాలం నుంచి బైట పడాలంటూనే…బిబిసి లాంటి వాటికి ఇంతగా ఉలిక్కి పడితే ఎలా?

ఒకవేళ ఇదే బిబిసి మోడీని మెచ్చుకుంటూ డాక్యుమెంటరీ చేస్తే నిషేధం విధించేవారా? భారత్ ఎదుగుతోందంటూ బిబిసి కథనం చేసి ఉంటే నిషేధించేవారా? బిబిసి లాంటి వాటి నుంచి మనకు ధృవీకరణ అక్కర్లేదు. విమర్శనూ పట్టించుకోవాల్సిన పనిలేదు. ఏదైనా గడ్డిపోచతో సమానంగా భావించాలంతే!

ఎందుకంటే… కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ మీడియా ఈ విషయంలో పదే పదే మోడీని తప్పుబడుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా!  ఇందులో కొత్తేమీ లేదు.  గుజరాత్ లో ఏం జరిగిందో గుజరాత్ వాసులకు తెలుసు. కోర్టు తీర్పులూ వచ్చాయి. సుప్రీంకోర్టు సైతం మోడీకి క్లీన్ చీట్ ఇచ్చేసింది. ఆ సంఘటన నుంచీ, తర్వాతి పరిణామాల నుంచీ ఈ దేశం ఎంతో ముందుకు సాగింది. నిజంగా ఆనాటి అల్లర్లలో  సాక్ష్యం అంటూ ఉంటే పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీ పార్టీ, చిదంబరం సారథ్యంలోని హోంశాఖ మోడీని విడిచిపెట్టేవారా? ఆమాత్రం ఇంగిత జ్ఞానం దేశ ప్రజలకు లేదని బిబిసి భావించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ప్రజలు నమ్మరని తెలిసినా తాను నమ్మిందే రుద్దటం బిబిసి నైజం.

బిబిసి డాక్యుమెంటరీలో చెబుతున్నది కొత్తేమీ కాదు. వామపక్షాలు, కాంగ్రెస్, మీడియాలోని ఒక వర్గం వారు, విదేశీ మీడియా చాలాకాలంగా చెబుతూ చెబుతూ అరిగిపోయిన రికార్డే! అయినా బిబిసి ఏదో ఎవ్వరికీ తెలియని నిజాన్ని వెలికితీసినట్లు, మన సుప్రీంకోర్టుకు కూడా దొరకని సాక్ష్యాలతో బిబిసి బైటకు వచ్చినట్లు, దానికి ప్రభుత్వం భయపడుతున్నట్లు, అందుకే నిషేధిస్తున్నట్లు భావన కలిగించాల్సిన అవసరం ఏమీలేదు. నిషేధం విధించకుండా భారత ప్రభుత్వం చేయాల్సిన పనులు రెండున్నాయి.

గుజరాత్ అల్లర్ల వ్యవహారంపై ఇన్నేళ్ళ తర్వాత బిబిసి ఇప్పుడే ఎందుకు ఈ డాక్యుమెంటరీ తయారు చేసి ప్రసారం చేస్తోంది? రాబోయే లోక్ సభ ఎన్నికల వేళ దీని ఆంతర్యమేమిటి? వాటిలోని అంశాలకున్న ప్రాధాన్యమేంటి? అనే ప్రశ్నలు లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూడటం. ప్రజల్లో ఆలోచన రేకెత్తించడం.

బిబిసికి అనవసర ప్రాచుర్యం కల్పించకుండా, ఈ అమృతోత్సవ వేళ భారతీయులు, ప్రభుత్వం చేయాల్సిన…. ఈ 75 ఏళ్ళలో సమర్ధంగా చేయలేని పని ఒకటుంది. అదే..

200 ఏళ్ళు అంగ్లేయులెలా మనల్ని పీడించారు?

వారి రాకకు ముందు భారత సమాజం ఎలా ఉండేది?

మన పూర్వీకులైన ప్రజలెలా ఉండేవారు?

ఆర్ధికంగా మనం ఎంత ఉన్నతంగా ఉండేవాళ్ళం?

నిజంగా వారన్నట్లు అనాగరికులమే, దరిద్రులమే అయితే మన దేశాన్ని ఆంగ్లేయులు ఎందుకింత పట్టుకొని వేలాడారు?

ఆంగ్లేయులు తెచ్చిన సామాజిక, ఆర్ధిక మార్పులేంటి?

మన కుల, మతాలతో అంగ్లేయులేలా ఆడుకున్నారు?

అందులో ఎలాంటి మార్పులు తెచ్చారు, ఎందుకోసం తెచ్చారు?

తెల్లవారి పాలనలో సంభవించిన క్షామాలెన్ని? అవి సృష్టించిన మారణ హోమాలేంటి?

భారత్ లో ఆంగ్లేయుల పాలన… యావత్ మానవాళి చరిత్రలోనే అత్యంత దారుణమైన మారణహోమం అని చరిత్రకారుడు డ్యురాంట్ ఎందుకన్నారు?

అన్నిటికీ మించి దేశాన్ని విడిచి వెళ్ళే ముందు కూడా విన్ స్టన్ చర్చిల్ సృష్టించిన క్షామానికి బెంగాల్ వీధుల్లో పిట్టల్లా ప్రజలెలా రాలిపోయారు. నరరూప చర్చిల్ రాక్షస కృత్యాలేంటి? వీటిపై డాక్యుమెంటరీలు తయారు చేయాలి. ఈనాటి ప్రపంచానికే కాదు, 75 ఏళ్ళుగా తప్పుడు చరిత్రనూ, తక్కువ చరిత్రనూ చదువుతున్న, చదవని మన దేశంలోని ఈ తరానికీ అద్దంలో చూపించాలి.

అలా బిబిసి చేయని,చేయలేని మంచి పనులు చేయాలి. అంతేగానీ ఇప్పటికీ బ్రిటిష్ అజెండాను రుద్దే బిబిసి వెంట పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వారి తాజా డాక్యుమెంటరీ చూసి నరేంద్రమోడీని అభిమానించే వారేమైనా వ్యతిరేకులుగా మారతారా?  నాటి అల్లర్లలో మోడీ పాత్ర ఏమీ లేదన్న సుప్రీం కోర్టు తీర్పు ఏమైనా మారిపోతుందా? ఎందుకింత హంగామా? బిబిసికి ఎందుకింత ప్రాధాన్యం ఇవ్వడం? ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ నివేదికలను పట్టుకొని వాటి ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించింది.

ఆనాడున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో  అప్పటి ఐరోపా, అమెరికా ప్రభుత్వాలు మోదీపై గుర్రుమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన్ను తమ దేశంలో అడుగు పెట్టకుండా నిషేధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అవే దేశాలు ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాయి. ఆయనతో ఆలింగనానికి, కరచాలనానికి అవే ఐరోపా, అమెరికా దేశాధినేతలు తహతహలాడుతున్నారు. ఇప్పుడు బిబిసి చెప్పినంత మాత్రాన అవన్నీ మారిపోతాయనుకోవటం, అది రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించి దానికి లేని ప్రాధాన్యం కల్పించటం మూర్ఖత్వం.

బిబిసి అంటేనే బ్రిటిష్ భూతద్దంలో విషయాలను చూపించేది. అంతేగాకుండా వామపక్ష భావజాలంతో నిండింది. ఈమాట మనం అనటం కాదు.. 2020లో బిబిసి డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టిన టిమ్ డేవీ స్వయంగా అన్నారు. వామపక్ష భావజాలాన్ని, కరడుగట్టిన ముందస్తు భావనలను వదులుకోవాలని, లేదంటే ఉద్యోగం మానేయాలని ఆయన సంస్థలోని ఉద్యోగులందరినీ హెచ్చరించారు. కాబట్టి వార్తల విషయంలో బిబిసి నిజాయితీ ఎంతో, వారు చెప్పే కోణాల్లో వాస్తవమెంతో, వార్తా ప్రసారంలో బిబిసి నిబద్ధత ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి వార్తలు, డాక్యుమెంటరీల గురించి గగ్గోలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు.

ప్రపంచంలో, మన కళ్ళముందు జరిగిపోయిన అంశంపై ఆంగ్లేయుల వ్యాఖ్యానాలు జోడించి, వండివార్చిన డాక్యుమెంటరీని చూసి గంగవెర్రులెత్తటం మరీ దారుణం! బిబిసి అనేది ఇలాగే చెబుతుంది.  వారినుంచి శభాష్ ను కోరుకుంటున్నామా? అమృతోత్సవ వేళ అలా కోరుకోవటాన్ని మించిన భావదారిద్ర్యం మరొకటి లేదు. తాము చెప్పిందే సత్యమని, తమకు వ్యతిరేకమైనదంతా ఫేక్ న్యూస్ అని ముద్ర వేసి, ప్రపంచాన్ని నమ్మించడంలో బిబిసిది అందేవేసిన చేయి. బిబిసియే కాదు, అగ్ర రాజ్యం మీడియా సంస్థలన్నీ తము చెప్పేదే నిజమనే భ్రమలో ఉండి , మనల్ని కూడా ఉంచాలని చూస్తుంటాయి. బిబిసిలో వచ్చిందంటే నిజం, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిందంటే నిజమనుకునే భ్రమల కాలంనుంచి భారతావని ఎంతో ముందడుగు వేసింది.

-హరితస

Also Read :

ప్రింట్ మీడియా మనుగడ ప్రశ్నార్థకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్