Sunday, January 19, 2025

అతడు- ఆమె

Re-Remarriages: అరటి బోదెలు, మామిడి తోరణాలు, మొగలి పూల హారాలతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పురోహితుడి భుజం మీద కాలు పెట్టి ఫోటోగ్రాఫర్ మంచి యాంగిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వచ్చినవారు ఎవరికి వారు సెల్ఫీలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. మూలన బిక్కు బిక్కుమంటూ జంపఖానా మీద కూర్చుని పిడికిట తలంబ్రాల అన్నమయ్య కీర్తన మేళం వాయిస్తున్నవారి వారి చెవిలో రత్తాలు బొత్తాలు పెట్టిన కెవ్వు కేక వాయించమని ఎవరో అడిగితే అది మైకులో అందరికీ వినపడింది. వచ్చినవారు ఏ పదార్థాలు తినలేరో, ఏది వెజ్జో, ఏది నాన్ వెజ్జో తెలియదో, అలాంటి పదార్థాలను రోబోల్లాంటి మనుషులు నిర్వికారంగా చెక్క మొహాలు వేసుకుని ప్లేట్లలో పెట్టుకుని అందరి ముందుకు వస్తున్నారు.

పెళ్లి కూతురు వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్న తల్లి పెళ్లి కూతురిగా ముస్తాబు అవుతోంది. పెళ్లి కొడుకు వయసు కంటే కొంచెం ఎక్కువ వయసున్న నలుగురు పిల్లలు కలిగిన పెళ్లి కొడుకుకు గోచీ కట్టి కాళ్లకు పారాణి పూసి…బుగ్గన చుక్క పెడుతున్నారు. పెళ్లి కూతురి ముగ్గురు కూతుళ్లు, పెళ్లి కొడుకు నలుగురు కొడుకులు జిగేల్ జిగేల్ మనే యూనిఫార్మ్(ఏకరూప దుస్తులు అని మీడియా అనువాదం) బట్టలతో వారిలో వారే మురిసిపోతున్నారు. మెరిసిపోతున్నారు. పెళ్లి పందిట్లో వారి హడావుడిని చిత్రీకరించడానికి నాలుగు వీడియో కెమెరాలు, రెండు డ్రోన్లు, మూడు స్టిల్ క్యామ్స్ చాలడం లేదు.

ఇలాంటి లోకోత్తర వివాహం వెనుకటి యుగాల్లో జరగలేదు…ఇక ముందు యుగాల్లో జరుగుతుందో లేదో తెలియదు కాబట్టి మీడియా వారందరూ లైవ్ వాహనాలతో వచ్చేశారు. ఒక్కసారిగా పెళ్లి మండపం కాస్త ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లా మారిపోయింది. కట్టుడు పళ్లకు పెట్టుడు ముహూర్తమయినా చెల్లుబాటే కాబట్టి…తాళి తరువాత ఎప్పుడయినా కట్టవచ్చు ముందు ప్రెస్సు పేరంటమే మంచి ముహూర్తమని పేద్ద పెళ్లి కొడుకు- అతి పేద్ద పెళ్లి కూతురు పెద్ద మనసుతో, పెద్ద బుగ్గల్లో పెద్ద సిగ్గుల పెద్ద మొగ్గలు పెద్దగా విచ్చుకుంటుండగా పెద్ద నిర్ణయం తీసుకున్నారు.

విలేఖరి ప్రశ్న:-
సార్! ఈ క్షణాన మీ అనుభూతి ఎలా ఉంది?

పెళ్లి కొడుకు:-
మాటల్లో చెప్పలేను. ఇప్పటికి ఎన్నో సార్లు తాళి కట్టినా…అవన్నీ వట్టి ఎగతాళి. ఇప్పుడు కడుతున్నది నిజం తాళి. తరువాత సౌతిండియన్ తాళి కూడా ఉంది. మరచిపోకుండా తిని వెళ్లండి.

వి. ప్ర:-
సార్! తేపకు తేపకు తాళి కట్టి కట్టి మీరు సౌతిండియన్ తాలిని కూడా తాళి చేశారు.

పె. కొ:-
మీ యాంకర్లు పెళ్లిని పెల్లి అంటే తప్పు లేదు కానీ…నేను తాలిని తాళి అంటే తప్పయ్యిందా? ఏదయినా నా కళ్లకు కట్టే తాళే.
(పెళ్లి కొడుకు కొడుకులు, పెళ్లి కూతురు కూతుళ్లు కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ ఉత్సాహంతో పెళ్లి కూతురు వేళ్లు నోట్లో పెట్టి ప్రొఫెషనల్ గా ఈల వేసింది)

వి. ప్ర:-
సార్! మీ రెండో భార్య మూడో భార్య కలిసి ఇందాకే ప్రెస్ మీట్ పెట్టి…మీరు వారికి విడాకులు ఇవ్వకుండానే ఈ పెళ్లి పీటలు ఎక్కినట్లు ఆధారాలు చూపించారు. దానికి మీ సమాధానం?

పె. కొ:-
లేదండీ. అవి నిరాధారమయిన ఆరోపణలు. రెండో భార్యకు రెండేళ్ల కిందటే రెండు విడి విడి అరటి ఆకులు పళ్లెంలో పెట్టి ఇచ్చాను. మూడో భార్యకు మూడేళ్ల కిందట బంగారు పళ్లెంలో పెట్టి మూడు ఎండు విస్తరాకులు ఇవ్వబోతే…ఆమే కాలితో తన్నేసింది. ఇదిగోండి ఆ ఫోటోలు, వీడియోలు. నేను ఇద్దరికీ విడి ఆకులు విడి విడిగా ఇచ్చానా? లేదా? మీరే న్యాయం చెప్పండి.

(ముందు వరుసలో ఉన్న ముగ్గురు మహిళా విలేఖరులు స్పృహదప్పి పడిపోతే…పెళ్లి కూతురి కూతుళ్లు ముగ్గురూ ఒక్క ఉదుటున వచ్చి మొహాల మీద నీళ్లు చల్లి…వారు స్పృహలోకి వచ్చాక కొబ్బరి నీళ్లు ఇచ్చి సపర్యలు చేశారు)

వి. ప్ర:-
సార్! ఈ పెళ్లిలో ఎండు విస్తరాకులు వేస్తున్నారా? పచ్చి అరటి ఆకులు వేస్తున్నారా?

పె. కొ:-
రెండూ కాదండీ. ప్లాస్టిక్ ప్లేట్లే పెట్టాము.

(ఈలోపు పెళ్లి కొడుకు నలుగురు కొడుకులు వచ్చి…తండ్రి నుండి మైక్ లాక్కున్నారు)

పెళ్లి కొడుకు కొడుకులు సామూహికంగా:-

క్షమించాలి. ఇప్పటికే పెట్టుడు ముహూర్తం టైమ్ కూడా దాటి… అమావాస్య యమగండం వర్జ్యం రాహుకాలంలోకి వచ్చేశాము. ఇక తాళి కట్టుడు కార్యక్రమంలోకి వెళ్లాలి. దానికి ముందు మా నాన్న తన సొంత అనుభవాలతో రాసిన కొన్ని పుస్తకాలను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం.

1. పెళ్లినాటి ప్రమాదాలు
2. పెళ్లి- పెటాకులు
3. పచ్చాకులు, ఎండాకులు, విడాకులు
4. పిల్లలు చేసే పెద్దల పెళ్లిళ్లు
5. తాళి- తాలి- ఎగతాళి
6. పెళ్లికి వయసా? మనసా? ఏది ముఖ్యమో తెలుసా?
7. పెళ్లంటే పెద్ద వంట

దాదాపు వంద పుస్తకాల వరకు మా నాన్న రాసి పారేసినా...ప్రస్తుతం ఏడడుగులు మళ్లీ వేస్తున్న శుభ తరుణాన ఏడు అమూల్యమయిన పుస్తకాలను మాత్రమే ప్రచురించి…పెళ్లికి వచ్చిన మీకందరికీ రిటర్న్ గిఫ్ట్ కింద సముచితంగా అందజేయబోతున్నాం. పెళ్లి కూతురు కూతుళ్లు వీటిని హిందీ, ఇంగ్లీషులోకి అనువదిస్తున్నారు. వచ్చే నెల ఇదే ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగే వారి పెళ్లిళ్లల్లో ఆ అనువాద గ్రంథాలను మరి కొన్ని క్షణాల్లో మా కాబోయే అమ్మ అమృతహస్తాల మీదుగా అప్పుడు ఆవిష్కరింపజేయాలని నిర్ణయం తీసుకున్నాం….అని ఇంకా ఏదో చెప్పబోతున్నారు.

…ఈలోపు ముగ్గురు పెద్ద మనుషులు కళ్లల్లో ఆనందబాష్పాలు జల జలా రాలుతుండగా…కరతాళ ధ్వనులు చేస్తూ…సిగ్గులేకుండా ముందుకొచ్చి…చొరవగా మైకందుకుని వారిని వారు మీడియాకు పరిచయం చేసుకున్నారు. ఈ పెళ్లి పందిట్లో మరి కొద్ది క్షణాల్లో తాళి కట్టించుకోబోతున్న పెళ్లి కూతురికి గతంలో తాళి కట్టి…కాలక్రమంలో విడాకులు ఇచ్చినవారు ఇద్దరు. విడాకులు ఇవ్వాలో? వద్దో? తెలియక…ఇవ్వకపోయినా ఇచ్చినట్లే భావిస్తున్న అభర్త మరొకాయన. తమ మాజీ భార్య కలకాలం ముత్తయిదువగా పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండాలని…వారు నిండు మనసుతో దీవించారు!

ఒకామెను వీల్ చైర్లో ఎవరో వేదిక మీదికి మెల్లగా తీసుకొచ్చారు. ఆమె ప్రస్తుతం తాళి కట్టబోతున్న పెళ్లి కొడుకు మొదటి మాజీ భార్య అట. ఎంత సేపు బతికి ఉంటానో తెలియదు…నా మాజీ భర్త నెత్తిన అక్షింతలు ముందే చల్లుతున్నాను…అని ఆమె నెత్తిన ఆమె అక్షింతలు చల్లుకుని నిష్క్రమించింది!

(వెనుక వరుసలో నిలుచున్న కెమెరా మ్యాన్లు అందరూ కళ్లు తిరిగి పడిపోయారు. పెళ్లి కొడుకు కొడుకులు వారిచేత ఎలెక్ట్రోల్ తాగించినా…కళ్లు తెరవకపోవడంతో అప్పటికప్పుడు నాలుగు అంబులెన్సులను పిలిపించి…మెరుగయిన వైద్యం కోసం సమీపంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు)

తరువాత “మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి” అన్న తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ ను అక్షర సత్యం చేస్తూ ఆ పెళ్లి జరిగిందో? లేదో? మనకు తెలియడం చాలా కష్టం. ఎందుకంటే పందిట్లో మిగిలిన విలేఖరులందరికీ ఒక్కసారిగా కడుపులో గడబిడ, మెదడులో గుడగుడ అనడంతో అందరూ మూకుమ్మడిగా ఆసుపత్రులను వెతుక్కుంటూ…అర్ధంతరంగా వెళ్లిపోయారట! దాంతో ఆ జగత్కల్యాణ వార్తా విశేషాలను అందించలేకపోతున్నామని మీడియా అవనత శిరస్సుతో, బరువెక్కిన గుండెతో, గద్గద స్వరంతో లోకానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్