Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపద పదవే ఒయ్యారి గాలి పటమా!

పద పదవే ఒయ్యారి గాలి పటమా!

The Greatness of Kites:

పదపదవే వయ్యారి గాలిపటమా!
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా!

ప్రేమగోలలోన చిక్కిపోయినావా?
నీ ప్రియుడున్న చోటుకై పోదువా?
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా

నీకు ఎవరిచ్చారే బిరుదు తోక?
కొని తెచ్చావేమో అంతేగాక!
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచె నీ తోక
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో?
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో?

వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే?

 

 Kites

దాదాపు అరవై ఏళ్ల కిందట కులదైవం  సినిమాలో కొసరాజు రాయగా, ఘంటసాల స్వరపరచి జమునా రాణితో కలిసి గానం చేసిన పాట ఇది. అంతకు ముందే 1957 లో బాబీ సినిమాలో “చలి చలిరే పతంగ్…” హిందీ పాట ట్యూన్, భావం ఆధారంగానే ఈ పాట తయారయినా తెలుగులో ఆ పతంగ్ మరింత హొయలు పోయింది. గాలిపటానికి జయపతాక లాంటి ఒకే ఒక పాట ఇది. గాలి పటానికి భుజ కీర్తులు తొడిగి విను వీధిన సమున్నతంగా నిలబెట్టిన పాట ఇది. తెగిన గాలి పటానికి తోక కట్టి నీలాకాశంలో దారి చూపిన పాట ఇది. గాలి పటంలో ఒయ్యారాలను దర్శించిన సాహిత్యమిది. తెలుగు జ్ఞాన పథాన్ని జానపదంలో ముంచి పునీతం చేసిన కొసరాజు రసగీతి ఇది. సినిమాలో ప్రేమాభిమానాల వ్యక్తీకరణకు గాలిపటాన్ని రాయబారిగా చేసిన ఉదాత్త సందర్భమిది. తెలుగువారు ఎవరయినా విని తీరాల్సిన పాట ఇది. ఇప్పటికే ఎన్నో సార్లు విన్న వారు సంక్రాంతి గాలిపటాల మధ్య మళ్లీ ఈ పాటను మననం చేసుకోండి. వినని వారు అర్జెంటుగా యూ ట్యూబులో అయినా చూసి, విని తరించండి.

గాలి పటాలను ఎగరేసే బాల్యాన్ని ఎలాగూ కోల్పోయాం. కనీసం గాలి పటం గొప్పతనం మీద  తెలుగులో ఇంత గొప్ప పాట ఉందని కూడా తెలియకపోతే నిజంగా మన బతుకుల్లో భావం తెగిన గాలి పటమే అయి దిక్కూ మొక్కూ లేకుండా పోతుంది.

పదండి…
కొసరాజు గాలి పటం వెంట మనం కూడా భావ రాగాల రెక్కలు కట్టుకుని పక్క చూపు చూసుకుంటూ పక్షిలా పైకి ఎగిరిపోదాం. విను వీధిన నీలి మబ్బుల్లో ఎగురుతూ కింద పుడమి తళుకు బెళుకులను, ప్రకృతి కులుకులను విహంగ వీక్షణం చేద్దాం. మన బరువయిన అహంకారపు తోకలను కత్తిరించుకుని, బరువు తగ్గి కాసేపు గాల్లో తేలి వద్దాం. రాజులువస్తుంటారు. పోతుంటారు. పాత మోజులు పోయి, కొత్త మోజులు మోసులెత్తుతూ ఉంటాయి.  రాజుల పదవి ఉంటే ఉంటుంది. ఊడిపోతే ఊడిపోతుంది. కంటికి కనిపించకపోయినా తెగిపోక నిలిచే మనవయిన ఆత్మాభిమాన తోకలే మన ఆస్తి పాస్తులు. మింట చుక్కల దాకా ఎగరడానికి స్పేస్ క్రాఫ్ట్ లు అక్కర్లేదు. మనసుకు రెక్కలు తొడిగితే చాలు…దిక్కులు దాటి…చుక్కలు దాటి ఎగురుతున్న ఈ తెలుగు గాలి పటాన్ని సంక్రాంతి పూట అయినా పట్టుకోగలం.

కొమ్మల్లో గాలిపాఠం
భోగి రోజు మధ్యాహ్నం మా ఆఫీసు పక్కన సందడిగా ఉంటే వెళ్లి చూశా. పది, పన్నెండేళ్ల లోపు పిల్లలు పది మంది ఉన్నారు. పిల్లలు గాలిపటాలతో ఆడుకుంటున్నారు. రెండు మతాల పిల్లల చేతిలో గాలిపటాలు, దారాలున్నాయి. హ్యాపీ సంక్రాంతి అంకుల్ అని విష్ చేశారు. నేను కూడా విష్ చేసి…ఇందాకటి నుండి అరుస్తున్నారు…ఏమిటి సంగతి అని అడిగాను. గాలి పటాలు ఎగరేస్తూ పరుగెడుతుంటే ఒక గాలిపటం కొమ్మల్లో చిక్కుకుందట.

అంతెత్తున కొమ్మ మీద కోయిలలా కూర్చున్న ఆ గాలి పటాన్ని చిరిగిపోకుండా ఒడుపుగా తీయడానికి ఒక పిల్లాడు ప్రయత్నిస్తున్నాడు. మిగతా వారు సహకరిస్తున్నారు. శ్రీహరి కోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ ప్రయోగంలా సమస్య చాలా క్లిష్టంగా, గంభీరంగా ఉంది. నేను కూడా అర గంట వారితో పాటు రోడ్డు మీద వచ్చి పోయేవారిని నియంత్రించే పనిలోకి దిగాను.

అందులో భవిష్యత్తులో శాస్త్రవేత్త అయి తీరాల్సిన ఒక పిల్లాడు ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ కు పొడవాటి దారం కట్టాడు. కింది నుండి ఆ బాటిల్ ను సరిగ్గా పైన కొమ్మ మీద గాలి పటం ఎక్కడుందో…అక్కడికి విసురుతున్నాడు. పది…ఇరవై…ముప్పయ్ సార్లు విసురుతూనే ఉన్నాడు. పిల్లలందరూ డైరెక్షన్లు చెబుతూనే ఉన్నారు. ముప్పయ్ ఒకటో సారి…ఖచ్చితంగా తగిలింది. గాలిపటం చిరిగిపోకుండా… జెండాను ఆవిష్కరించేప్పుడు చేతితో తాడును జాగ్రత్తగా కదిలించినట్లు నాలుగైదు యాంగిల్స్ లో కదిలించాడు. అంతే…కొండెక్కిన గాలిపటం కిందికి దిగి వచ్చి పిల్లాడి చేతిలో పడింది.

కొసమెరుపు:
తీరా చూస్తే ఆ గాలి పటం ఆ అబ్బాయిది కాదు. స్నేహితుడి చేతిలో పెట్టి…నా దగ్గరికొచ్చి నా పక్కనున్న మా శునకరాజాన్ని పలకరించాడు. కుక్కకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. గాలి పటం అంత పైన ఉంది…దారం లాగినప్పుడు చిరిగిపోయి ఉంటే? అని నా మట్టి బుర్రతో లోతయిన లాజికల్ ప్రశ్న వేశాను. చిరిగిపోకుండా తీశాను కదా? అన్నాడు.
నిజమే…
ఆ అబ్బాయిది సిద్ధ విద్య. సూత్రానికి అందదు.
నాది అవిద్య. సూత్రాల దగ్గరే ఆగిపోయి ఉంటుంది.

పండగపూట ఏదో కొత్త పాఠం నేర్చుకున్నట్లు ఆఫీసులో వచ్చి కూర్చున్నా. కిటికీలో ఆ కొమ్మ ఊగుతూ కనిపిస్తోంది. రెక్క విప్పిన చిన్ని పక్షి విశ్వాసం ముందు అంతులేని ఆకాశం దూది పింజ!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : సంస్కృత విశ్వవిద్యాలయానికి తెలుగు అధిపతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్