Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅతి చేస్తే గతి చెడుతుంది

అతి చేస్తే గతి చెడుతుంది

Over Dose Of Exercises May Harm The HEalth As Per Doctors :

can over exercise cause heart problems?
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణానికి- ఆయన చేసిన వ్యాయామాలకు సంబంధం ఉన్నట్లుంది. ఇంతకుముందు కూడా వ్యాయామం చేస్తూ
కుప్పకూలి అసువులు బాసిన నటుల వార్తలు విన్నాం. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు, నారాయణ హృదయాలయ వైద్యుడు దేవిశెట్టి గుండె ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు.

  1. శారీరక దృఢత్వం అంటే వ్యాయామం కాదు.
  2. ఎక్కువ సేపు వ్యాయామం చేయడం, తక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదు.
  3. రోజులో ఒక మోస్తరు వ్యాయామం 20 నిముషాల పాటు చేస్తే సరిపోతుంది.
  4. కీటో, మోటో డైట్ లు అవసరం లేదు. మనకు ఆయా రుతువులలో స్థానికంగా దొరికే పండ్లు, ఇతర ఆహారం పరిమిత మోతాదులో తీసుకుంటే చాలు.
  5. ఏడు గంటల నిద్ర తప్పనిసరి.
  6. సిగరెట్లు, మద్యం, ఇతర ఉత్ప్రేరకాల జోలికి వెళ్లకూడదు.
  7. నడక కన్నా మేలయిన వ్యాయామం ఏదీ లేదు.
  8. సప్లిమెంట్ పానీయాలు, ఆహారాలు అవసరం లేదు. సహజమయిన ఆహారమే మేలు.
  9. ధ్యానం మంచిది.
  10. శరీరం మాట్లాడుతుంది. దాని భాషను మనం వినాలి. అర్థం చేసుకోవాలి.
  11. నాలుగు పదుల వయసు దాటిన తరువాత శరీరంలో మార్పులు సహజం. శరీర సౌష్ఠవం కంటే…శరీరం లోపలి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

సినిమా తారలకు రూపమే పెట్టుబడి. యాభై, అరవైల్లో అయినా ఇరవై వయసువారిలా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వయసును ఒప్పుకోవడం ఎవరికయినా మహా కష్టం. పొట్ట పెరగకూడదు. చర్మం రంగు తగ్గకూడదు. ముడుతలు పడకూడదు. జుట్టు తెల్లబడకూడదు.

కాలం ఎవరికోసం, ఎప్పుడూ ఆగదు. వయసును అంగీకరించడం మామూలువారికే కుదరదు. అలాంటిది సినిమావారికి ఇంకా కష్టం.

శరీరం భరించగలిగే వ్యాయమ శ్రమ అందరికీ ఒకే మోతాదులో ఉండదు. జిమ్ములు, వ్యాయామం యాప్ లు వచ్చాక ఇక తొక్కుడే తొక్కుడు. ఎగురుడే ఎగురుడు. అదొక వ్యసనం అయిపోతోంది. కొంతమంది రోజులో నాలుగు గంటలు జిమ్ములో కుమ్మేస్తున్నారు. వారు కోరుకున్న సిక్స్ ప్యాక్ లు, ఎయిట్ ప్యాక్ లు వస్తే రావచ్చు కానీ…ఇతరేతర రిస్క్ లు కూడా పెరుగుతున్నాయి. బాహుబలి బౌన్సర్లలా ఎగుభుజాలు, విశాల వక్షంతో వస్తున్న బాడీ గార్డ్ లుక్ ను గొప్పగా అనుకుంటున్నారు. శరీరం లోపలి బాడీని రక్షించలేని ఈ బాడీ గార్డ్ అవతారమెందుకో అర్థం కావడం లేదు.

ఒకడు వెన్న తినమంటాడు. ఒకడు నూనె వద్దంటాడు. ఒకడు గింజలు తినమంటాడు. ఒకడు చిరుధాన్యాలు నోట్లో కుక్కుతాడు. ఒకడు పచ్చి కూరల భోజనం పెడతాడు. మన అజ్ఞానమే మనకు ఆహారమై పచ్చి పచ్చిగా కడుపులోకి దిగుతోంది.

శరీరం యంత్రం కాదు. దాని శక్తికి కొన్ని పరిమితులు ఉంటాయి. అభిమానుల ముందు తమ శరీరాన్ని దృఢంగా, ఠీవిగా నిలబెట్టడానికి తారలు వయసుతో యుద్ధం చేస్తున్నారు. తమ శరీరంతో తామే యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో జయాపజయాలకు సాక్షులుగా మిగిలిపోతున్నారు.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్