Self Made: ఏ మాటకామాట. లలితా బంగారు నగల గుండాయన ఆయనకు ఆయనే ఒక బ్రాండ్. “డబ్బులెవరికీ ఊరికే రావు; డబ్బులు చెట్లకు కాయవు” అని గుండాయన చెప్పేవరకు మనకు తెలియనేలేదు. “జ్ఞానం ఎవరయినా ఉచితంగా పంచుతారు…మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి” అని పతంజలి సూత్రీకరించారు. ఈ దేశంలో ఏ పూటకు ఆ పూట వండుకోవడానికి గింజలు లేకపోయినా…బంగారు మాత్రం ఉండి తీరాలి అన్న తపన అనాదిగా ఉంది కాబట్టి…మధ్యతరగతి వారి బంగారు కలలను లలితా గుండాయన చక్కగా పట్టుకున్నాడు.
అమితాబ్, మహేష్ బాబు లాంటి పేరుమోసిన సెలెబ్రిటీలను ప్రకటనల్లో వాడుకోవాలంటే కోట్లల్లో వ్యవహారం. ఒక పూటో, కొన్ని గంటలో నటించినందుకు కోట్లు, షూటింగ్ కు కొన్ని కోట్లు. ఒక్కో సంవత్సరం ఆ ప్రకటన వాడుకోవడానికి కొన్ని కోట్లు. మాధ్యమాల్లో ఆ ప్రకటన రావడానికి కోటానుకోట్లు. వెరసి…డబ్బులు ఊరికే చెట్లకు కాచినవారికి కూడా తలకు మించిన భారమవుతోంది. దాంతో తన నగల దుకాణానికి తనే బ్రాండ్ అంబాసడర్ అయ్యాడు గుండాయన. కళ్ళల్లో కాంతి, చక్కటి రూపం, నిత్య గుండుతో దక్షిణ భారతదేశంలో ఏ టీ వీ ఎప్పుడు ఆన్ చేసినా లలితా గుండు దర్శనమిస్తూ ఉంటుంది. బ్రాండ్ విలువను సృష్టించడం ఎలాగో లలితా గుండును చూసి ఎవరయినా నేర్చుకోవచ్చు.
ఏళ్ల తరబడి రకరకాల డ్రస్సులతో అదే గుండు మొహంతో కనిపిస్తూ ఉంటే…మనకు మొహం మొత్తుతుందని గ్రహించిన లలితా గుండాయన రూటు మార్చాడు. ఏ పండగ వస్తే…ఆ పండగను గుండాయన భక్తి ప్రపత్తులతో అతి పెద్ద గుళ్లో లేదా గుడి సెట్లో చేసుకుంటుండగా ప్రకటన తయారవుతుంది. ధన్ తేరాస్- ధన త్రయోదశి, అక్షయ తృతీయ వస్తే లక్ష్మీ పూజ, దసరా వస్తే దుర్గా పూజ, చవితి వస్తే వినాయక పూజ. ఆవు వ్యాసంలా చివర ఫలానా పవిత్ర పర్వదినాన లలితా జ్యువెలరీలో అగ్గువకు నగలు కొనుక్కుని పండగ చేసుకోండి…అని గుండాయన ప్రశాంత వదనంతో మనల్ను కోరుతూ ఉంటాడు.
కృత్రిమ గ్రాఫిక్స్, యానిమేషన్ తో కాకుండా ప్రకటన సహజంగా, కనువిందుగా చేయించడంలో లలితా గుండాయన మెలకువ మరికొందరికి దారి దీపమయ్యింది. రియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు చాలా మంది లలితా గుండాయన్ను అనుకరిస్తున్నారు. ఈమధ్య స్వర్గసీమ, సుకేతన ఫార్మ్ ల్యాండ్స్ అంటూ ఏ టీవీ, రేడియో, పేపర్లో అయినా చండ్ర చంద్రశేఖర్ ప్రకటనోత్సాహ విశ్వరూపం చూస్తున్నాం. ఆయనే రైతు అవుతాడు. ఆయనే బైక్ నడుపుతాడు. మెట్రో ఎక్కుతాడు. తానాకు అమెరికాలో కలుద్దాం అంటాడు. తాజాగా వినాయకచవితికి పంచభూతాల్లో మట్టిని ముట్టుకుని…భూమిని నమ్ముకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ భూములను అమ్ముకుంటున్నాడు.
చాలా మంది రియలెస్టేట్ వ్యాపారులు రాజకీయాల్లో ఉంటారు. వారికి వ్యాపారరీత్యా, రాజకీయ అవసరాల దృష్ట్యా ప్రకటనలు ఇవ్వాల్సిన, పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. పొట్ట దాకా చొక్కా గుండీలు విప్పి, మెడలో పులి గోరు హారాలు, వైట్ అండ్ వైట్ ఖద్దరు, చేతులకు బంగారు బ్రేస్ లెట్లు, పది వేళ్ళకు పదకొండు ఉంగరాలతో పొద్దున చూడగానే రాత్రి కలలోకూడా వచ్చి భయపెట్టేంత భయంకర రూపంతో ప్రకటనల్లో కనపడుతున్నవారు వారి కస్టమర్ దేవుళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమయినా…సుకుమారుడయిన మన ఇంటి పెద్ద లలితా గుండాయన్ను, హితుడయిన మన మిత్రుడు చండ్ర చంద్రశేఖర్ ని ఆదర్శంగా తీసుకోవాలి. లేకపోతే వారి వెంచర్ మంచిదే అయినా…వారి స్వ స్వరూప ప్రకటనే వారి వెంచర్ ను నిలువునా ముంచుతుంది.
అయినా మన పిచ్చి కానీ…లలితా గుండాయన, చంద్రశేఖర్ లాంటివారికి డబ్బులు ఊరికే రాకపోవచ్చు. రాజకీయ నాయకుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఊరికే రాకుండా ఉంటాయా? వారు సాధారణ ప్రకటన పాఠాలకు అతీతులు. నన్ను కాదని…ఇక్కడ ఎవడు బతికి బట్ట కట్టగలడురా? అన్నదే వారు చెప్పదలచుకున్న హెచ్చరిక/బెదిరింపు/అల్టిమేటం/వార్ణింగ్ కాబట్టి వారి ప్రకటన అలాగే ఉండడం రాజకీయ వ్యాపార కోణంలో సరయినదేనేమో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018