పరాభవ నామ సంవత్సర ఫలాలు
మేషం
ఆదాయం : 11 వ్యయం : 5
రాజపూజ్యం: 2 అవమానం : 4
గోచార గ్రహ స్థితి:
- గురుడు 1-6-2026 వరకు మూడవ భావంలో రజతమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు నాలుగో భావంలోనూ రజతమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు అయిదవ భావంలో తామ్రమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు నాలుగో భావంలో రజతమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 12వ భావంలో లోహమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 11వ ఇంట, కేతువు 5వ ఇంట తామ్రమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 10వ భావంలో, కేతువు 4వ భావంలో తామ్రమూర్తులు.
- వేధ గోచారం ప్రకారం.. ఉగాది నుంచి జూన్ 18వ తేదీ వరకు గురుడు శుభుడు. శని, రాహు, కేతువులు సంవత్సరమంతా శుభులు.
మేష రాశివారి మీద.. ఏలిననాటి శని, గురుడి అతిచార ప్రభావాలు కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో కొద్దిపాటి ఒడుదుడుకులు ఎదురవుతాయి. అయితే, చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకుంటారు.
కుటుంబ స్థితిగతులు :
శుభ గురుడి కారణంగా కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా సోదర వర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. జూన్ 2వ తేదీ తర్వాత నూతన వాహనం లేదా సొంతింటి నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం చదువు విషయంగా స్వల్ప ఆందోళన నెలకొంటుంది. అక్టోబర్ తర్వాత ఇంట్లో వివాహాది శుభకార్యాల నిర్వహణ యత్నాలు చేస్తారు. కుజ సంబంధ ప్రతికూలత వల్ల.. ఏప్రిల్, మే నెలల్లో వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.
ఉద్యోగ, వ్యాపారాలు:
ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగులకు పని భారం అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు బెడిసికొట్టే వీలుంది. అయితే, వృత్తిపరంగా మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. గురుడి శుభత్వం కారణంగా.. ప్రమోషన్లు, బదిలీలు, ఉద్యోగ మార్పులు చోటుచేసుకునే సూచనలున్నాయి. ఈ సంవత్సరం వ్యాపారులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. పెట్టుబడులు, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో తొందరపాటు తగదు. సంవత్సరం చివరలో రాహువు దశమ భావంలోకి ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా, రాజకీయ, సామాజిక రంగాల్లోని వారికి విశేషమైన లబ్ది ఉంటుంది. ప్రజాదరణను పొందుతారు.
ఆర్థిక లావాదేవీలు :
మేషరాశివారికి ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది. అయితే, ఏలినాటి శని ప్రభావం వల్ల.. ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఊహించని ఖర్చులు ఆవేదనను కలిగిస్తాయి. రాహువు శుభసంచారం కారణంగా, అక్టోబర్-జనవరి నెలల మధ్యకాలంలో పాత బాకీలు వసూలవుతాయి. షేర్ మార్కెట్స్‌లో పెట్టుబడుల వల్ల లాభాలను పొందుతారు.
ఆరోగ్యం
ఏలినాటి శని ప్రభావం వల్ల.. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే వీలుంది. ముఖ్యంగా పాదాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలుంటాయి. నిద్రలేమి వేధిస్తుంది. ఆలయ సందర్శనం మానసిక ప్రశాంతతనిస్తుంది.
పరిహారం:
పరాభవ సంవత్సరంలో మరిన్ని మేలిమి ఫలితాలను పొందేందుకు ప్రతి శనివారం శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం, శివాలయ సందర్శనం, హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం మేలు చేస్తాయి. గురుబలం కోసం గురుక్షేత్రాలను సందర్శించడం మంచిది.
*****
వృషభం
ఆదాయం : 5 వ్యయం : 14
రాజపూజ్యం: 5 అవమానం : 4
గోచార గ్రహ స్థితి:
- గురుడు 1-6-2026 వరకు ద్వితీయంలో సువర్ణమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు తృతీయంలో లోహమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు చతుర్థంలో రజతమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు తృతీయంలో లోహమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 11వ భావంలో సువర్ణమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 10వ ఇంట, కేతువు 4వ ఇంట రజతమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 9వ భావంలో, కేతువు 3వ భావంలో సువర్ణమూర్తులు.
- వేధ గోచారాన్ని బట్టి ఉగాది నుంచి జూన్ 18 వరకు గురుడు శుభుడు. శని,రాహు, కేతువులు సంవత్సరమంతా శుభులు.
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురు సంచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త ప్రయత్నాలకు ఆటంకాలు.. చేస్తున్న పనుల పూర్తి గోచరిస్తోంది. గౌరవ, మర్యాదలకు భంగం ఏర్పడే వీలుంది.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అక్టోబర్ లోగా ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు సంబంధించిన చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. నవంబర్ నెల నుంచి కుటుంబంలో చికాకులు తలెత్తే వీలుంది. స్థిరాస్తి వ్యవహారాలు, తల్లి ఆరోగ్యం ఆందోళనను కలిగిస్తాయి. పూర్వీకుల ఆస్తి పంపకాల్లో తగాదాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో వాటిని పరిష్కరించుకునే వీలుంది. మాట తూలకుండా ఉంటే అన్నీ సవ్యంగా సాగుతాయి. ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి.
ఉద్యోగం మరియు వ్యాపారం:
ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. విధి నిర్వహణలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు. కార్యాలయాల్లోను, పై అధికారుల వద్ద మీ మీటకు విలువ పెరుగుతుంది. డిసెంబర్ నెలలోగా అనూహ్య స్థానచలనం కూడా ఉంది. ఆర్థిక స్థిరత్వం దిశగా ఈ మార్పు ఉంటుంది. వ్యాపారులు కీలక నిర్ణయాల్లో తొందరపాటుగా వ్యవహరించరాదు. భాగస్వామ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులు సానుకూల ఫలితాలనిస్తాయి.
ఆర్థిక లావాదేవీలు:
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం బలంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం, మొండి బకాయిల వసూళ్లు, నిలిచిన పనుల పూర్తి వంటి సానుకూలతలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇంటికి అవసరమైన వస్తువులు, వస్త్రాభరణాలు, స్థిరాస్తి కొనుగోలు వంటివి అనుకూలిస్తాయి.
ఆరోగ్యం:
ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి పెద్దగా సమస్యలు ఉండవు. అజీర్తి, ఉష్ణ సంబంధ సమస్యలు ఉన్నా.. అతి త్వరగా కోలుకుంటారు. ఆహార నియమాలను పాటించడం, ఆరోగ్య పరిరక్షణ దిశగా యోగా, ధ్యానం వంటి చర్యలు తీసుకోవడం ఉత్తమం.
పరిహారం:
పరాభవ సంవత్సరంలో వృషభరాశి వారు, సుబ్రహ్మణ్యస్వామితో పాటు, గాయత్రీమాతను పూజించండి. మూగజీవాలకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.
*****
మిథునం
ఆదాయం : 8 వ్యయం : 11
రాజపూజ్యం: 1 అవమానం : 7
గోచార గ్రహ స్థితి
- గురుడు 1-6-2026 వరకు జన్మరాశిలో లోహమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు ద్వితీయంలో తామ్రమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు తృతీయంలో సువర్ణమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు ద్వితీయంలో తామ్రమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 10వ భావంలో లోహమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 9వ ఇంట, కేతువు 3వ ఇంట లోహమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 8వ భావంలో, కేతువు 2వ భావంలో రజతమూర్తులు.
- వేధ గోచారాన్ని బట్టి గురు-శనులు ఈ సంవత్సరమంతా పాపులు. కేతువు సంవత్సరమంతా శుభుడు. రాహువు 2-8-2026 నుంచి శుభుడు.
మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. జూన్ వరకు ఉద్యోగులకు చికాకులు, ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు, ప్రతి విషయంలో ఆందోళనలు ఉంటాయి. జూన్ తర్వాత పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. సంతానం తీరు పట్ల ఓపికగా ఉండాలి.
కుటుంబ స్థితిగతులు:
జూన్ నెల తర్వాత కుటుంబ వ్యవహారాలు అత్యంత సంతృప్తికరంగా ఉంటాయి. గురుబలం వల్ల కుటుంబ సభ్యలతో వినోదంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. మీ కోప స్వభావం వల్ల.. జీవిత భాగస్వామితో సఖ్యత చెడే వీలుంది. ఓపిక, శాంత స్వభావాలను అలవాటు చేసుకుంటే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు కలవర పరుస్తాయి. వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఉద్యోగ, వ్యాపారాలు:
ఉద్యోగులు, వ్యాపారులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉండబోతోంది. శని గోచారం వల్ల కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. విధినిర్వహణలో ప్రతిభను చూపి పైఅధికారుల ప్రశంసలను పొందుతారు. అలసట కూడా అదే స్థాయిలో ఉంటుంది. మీ మాటతీరు అందరినీ ఆకర్షిస్తుంది. డిసెంబర్ నెల నుంచి కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి వుంటుంది. వ్యాపారులు భాగస్వామ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార విస్తరణ, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.
ఆర్థిక లావాదేవీలు:
సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక చికాకులు తలెత్తినా, సమన్వయం, చాకచక్యంతో పరిస్థితులను సరిదిద్దుతారు. జూన్ తర్వాత అన్నీ అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి సంబంధ శుభ ఫలితాలను పొందుతారు. పూర్వీకుల ఆస్తి వశమవుతుంది. మొండిబాకీలు వసూలవుతాయి. అనూహ్య ఖర్చులుంటాయి.
ఆరోగ్యం
ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలసటను జయించాల్సి వుంటుంది. చర్మసంబంధ సమస్యలకు ఆస్కారం ఉంది. తరచూ వైద్యుల సలహాలు తీసుకోవడం, ప్రయాణాల్లో ఔషధాలను దగ్గరుంచుకోవడం మంచిది.
పరిహారం:
మిథున రాశివారు పరాభవ సంవత్సరంలో మరిన్ని మేలిమి ఫలితాల కోసం.. విష్ణు సహస్రనామ పారాయణ, దుర్గాదేవికి కుంకుమార్చన, నవగ్రహ శాంతి చేయించుకోవాలి. ఆస్తి, ఆరోగ్య సంబంధ చికాకులు తలెత్తినప్పుడు సుబ్రహ్మణ్యస్వామికి పాలతో అభిషేకం చేయడం మంచిది.
*****
కర్కాటకం
ఆదాయం : 2 వ్యయం : 11
రాజపూజ్యం: 4 అవమానం : 7
గోచార గ్రహ స్థితి
- గురుడు 1-6-2026 వరకు 12వ భావంలో సువర్ణ మూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు జన్మరాశిలో సువర్ణమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు ద్వితీయంలో లోహమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు జన్మరాశిలో రజతమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 9వ భావంలో రజతమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 8వ ఇంట, కేతువు 2వ ఇంట తామ్రమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 7వ భావంలో, కేతువు జన్మరాశిలో లోహమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు 18-8-2026 నుంచి శుభుడు. శని సంవత్సరమంతా శుభుడు. రాహువు సంవత్సరమంతా పాపి. కేతువు 5-12-2026 నుంచి పాపి.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ నోటిదురుసు, కఠినమైన మాటల కారణంగా, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో సఖ్యత చెడిపోయే సూచనలు ఉన్నాయి. సమాజంలోనూ మాట చెల్లుబాటు కాని పరిస్థితి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం గురించిన ఆందోళన ఉంటుంది. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు వేదనను కలిగిస్తాయి. జీవిత భాగస్వామి సూచనలను పాటించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొనే వీలుంది.
ఉద్యోగ్య, వ్యాపారాలు:
ఉద్యోగులు విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అనూహ్యమైన, అయిష్టమైన మార్పులకు గురికావాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతోను, సహోద్యోగులతోనూ సఖ్యంగా ఉండండి. సంభాషణల్లో సంయమనంతో వ్యవహరించండి. డిసెంబర్ వరకు పోటీదారుల కదలికలు, శత్రువుల కుట్రలను గమనిస్తూ.. ప్రతి సందర్భంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రస్తుతం నడుపుతున్న వ్యాపారంలోనూ ఒడుదుడుకులు గోచరిస్తున్నాయి. అక్టోబర్ తర్వాత స్వల్ప ఊరట ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లోను, నూతన అగ్రిమెంట్ల విషయంలోనూ తొందరపాటు తగదు.
ఆర్థిక లావాదేవీలు:
ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. శుభకార్యాలు లేదా వైద్యం కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబం కోసం చేసే ఖర్చులు అదుపు తప్పు వీలుంది. ప్రయాణాల్లో ధనాన్ని తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణ విముక్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పొదుపును అలవాటుగా చేసుకుంటే మంచిది.
ఆరోగ్యం
మానసిక ఒత్తిడి, అకారణ భయాలు వెంటాడతాయి. ఉదర సంబంధ సమస్యలూ తలెత్తుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా లేకుంటే ఆసుపత్రి సందర్శనకు ఆస్కారముంది. వేళకు భోజనం చేయడం, జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు, వ్యాయామం, యోగా వంటి శారీరక శ్రమ.. మేలు చేస్తాయి.
పరిహారం:
కర్కాటక రాశివారు, ఈ పరాభవ సంవత్సరంలో గురు, రాహు గ్రహ శాంతులు చేయించుకోవాలి. శివారాధన, గురుక్షేత్ర సందర్శన, కనకదుర్గ, ఆంజనేయ స్వామి స్తోత్రాలు, జపదానాలు చేసుకోవడం ఉత్తమం.
*****
సింహం
ఆదాయం : 5 వ్యయం : 5
రాజపూజ్యం: 7 అవమానం : 3
గోచార గ్రహ స్థితి
- గురుడు 1-6-2026 వరకు 11వ భావంలో తామ్రమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 12వ భావంలో రజతమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు జన్మరాశిలో సువర్ణమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 12వ భావంలో సువర్ణమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 8వ భావంలో లోహమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 7వ ఇంట, కేతువు జన్మరాశిలో సువర్ణమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 6వ భావంలో, కేతువు 12వ భావంలో తామ్రమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు 2-6-2026 నుంచి శుభుడు. శని సంవత్సరమంతా శుభుడు. రాహు-కేతువులు 2-8-2026 నుంచి పాపులు.
పరాభవ సంవత్సరం.. సింహరాశి వారికి అతి సామాన్యంగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం ఈ రాశివారిపై అమితంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, విధి నిర్వహణలో అలసత్వం వంటివి బాగా నష్టాన్ని కలిగిస్తాయి. అయిష్టమైన పనులను కూడా క్రమశిక్షణతో పూర్తి చేయాలి. ఇతరుల చేతుల్లో మోసపోయే వీలుంది కాబట్టి, ఎవరినీ గుడ్డిగా నమ్మకండి.
కుటుంబ స్థితిగతులు :
కుటుంబ వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో పంతాలకు పోవడం మంచిది కాదు. తరచూ మాటపట్టింపులు వస్తుంటాయి. ఆవేశం వల్ల.. తెగదెంపుల దాకా పరిస్థితి వెళ్లే అవకాశం ఉంది. సంప్రదింపులు, ప్రశాంత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అష్టమ శని వల్ల, ప్రతి విషయంలోనూ మీ మాట, నడత.. ఎదుటివారిలో దురర్థాన్నే కలిగిస్తాయి. ఆత్మీయులతోనే గొడవలకు ఆస్కారముంది. నోటిదురుసును తగ్గించుకుని సంయమనంతో ఉండండి.
ఉద్యోగ, వ్యాపారాలు:
అష్టమ శని ప్రభావం వల్ల ఉద్యోగ వ్యవహారాలు అంతగా అనుకూలంగా ఉండవు. కష్టానికి తగ్గ ఫలితం అందక నిరాశ చెందుతారు. ఉన్నతాధికారులతో గొడవలు, ఇష్టంలేని బదిలీలు.. వంటి ప్రతికూలతలు గోచరిస్తున్నాయి. అక్టోబర్ నెల తర్వాత ఆకస్మిక స్థానచలనం, ఉద్యోగ మార్పిడులు ఉంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో బద్దకాన్ని వీడి, చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేసుకోవడం ఉత్తమం. వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం ఏమంత మెరుగ్గా ఉండదు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలించవు. వ్యాపార విస్తరణ ఆలోచనలను వాయిదా వేయండి. డిసెంబర్ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి.
ఆర్థిక లావాదేవీలు:
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. గురు, శని గ్రహాల ప్రభావం వల్ల అనూహ్యమైన ఖర్చులు కలవరాన్ని కలిగిస్తాయి. అప్పులు చెల్లించే పరిస్థితి ఉండదు. రుణదాతల ఒత్తిళ్లు పెరుగుతాయి. తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సహనంతో వ్యవహరించడం ఉత్తమం. గతంలో ఇచ్చిన హామీని నిలుపుకోక పోవడం వల్ల నిందలు, అవమానాలు ఎదురవుతాయి. ఎవరికీ పూచీలు ఇవ్వకండి.
ఆరోగ్యం
గోచార గ్రహస్థితి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. నరాలు, కీళ్ల సంబంధ సమస్యలుంటాయి. ముఖ్యంగా మానసిక వేదన అధికమవుతుంది. ఆరోగ్యంపై అమితమైన శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా, నడక వంటి వ్యాయామాలను అనుసరించడం మంచిది.
పరిహారం:
సింహరాశివారు, ఈ పరాభవ సంవత్సరంలో శనైశ్చరుడికి నల్లనువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణం, సూర్యనమస్కారాలు, శివుడికి రుద్రాభిషేకం చేయండి. దుర్గా సప్తశతి పారాయణ, నవగ్రహ శాంతులు, తత్సంబంధ జపదానాలు మేలు చేస్తాయి.
*****
కన్య
ఆదాయం : 8 వ్యయం : 11
రాజపూజ్యం: 3 అవమానం : 3
గోచార గ్రహ స్థితి
- గురుడు 1-6-2026 వరకు 10వ భావంలో రజతమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 11వ భావంలో లోహమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు 12వ భావంలో తామ్రమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 11వ భావంలో లోహమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 7వ భావంలో తామ్రమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 6వ ఇంట, కేతువు 12వ రాశిలో రజతమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 5వ భావంలో, కేతువు 11వ భావంలో రజతమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు 2-6-2026 నుంచి శుభుడు. శని, రాహు, కేతువులు సంవత్సరమంతా శుభులు.
పరాభవ సంవత్సరంలో ఆటంకాలు ఎదురైనా తెలివితేటలతో వాటిని చాకచక్యంగా అధిగమిస్తారు. సమస్యలను మేధోశక్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. జనవరి నుంచి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగానే సాగుతాయి. గురుబలం కారణంగా, శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదర వర్గంతో పాటు స్నేహితులూ మీకు తోడ్పడతారు. కన్య రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో తరచూ వివాదాలు, అపార్థాలు, మాట పట్టింపులు పెరుగుతాయి. కోపం కన్నా ప్రేమపూరిత చర్చల వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి. సంతానం తీరు కూడా కలవరాన్ని కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. నమ్మదగ్గ ఆత్మీయుల సలహాలను పాటించండి.
ఉద్యోగ, వ్యాపారాలు:
ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. ప్రమోషన్లు, రివార్డులు లభిస్తాయి. కొత్త బాధ్యతల్లో ఒదిగిపోతారు. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి కూడా అనుకూల కాలమిది. అయితే, భాగస్వాములతో వ్యవహారాల్లో వివాదాలకు దూరంగా అతి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాల్లోని వారు అందివచ్చే అవకాశాలను ఉపయోగించుకోండి.
ఆర్థిక లావాదేవీలు:
ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. జూన్ నెల తర్వాత గురువు ఆర్థికపరమైన మీ ఆకాంక్షలను నెరవేరుస్తాడు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లోని వారికి అత్యంత యోగదాయకం. పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వచ్చే వీలుంది. వృథా ఖర్చులను అదుపు చేసుకుంటే ఈ సంవత్సరం కొద్దిపాటి ధనాన్ని నిల్వ చేసుకోగలుగుతారు.
ఆరోగ్యం:
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమయ్యే సూచనలున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సంబంధ సమస్యలు వచ్చే వీలుంది. వేళకు ఆహారం తీసుకోని కారణంగా కూడా సమస్యలు పెరుగుతాయి. అయితే రోగనిరోధక శక్తి కారణంగా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా, వెంటనే కోలుకోగలుగుతారు.
పరిహారం:
పరాభవ సంవత్సరంలో కన్యా రాశి వారు, విష్ణు సహస్ర నామ పారాయణం, శ్రీవేంకటేశ్వరుని సప్తవార వ్రతం, శనికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, శివాలయంలో నువ్వులను దానం చేయడం వంటి పరిహారాలను పాటించడం వల్ల మేలు జరుగుతుంది. గురుబల ప్రాప్తికి దత్తాత్రేయ, సాయిబాబా, రాఘవేంద్ర, వీరబ్రహ్మేంద్ర వంటి గురువుల క్షేత్రాలను సందర్శించండి
*****
తుల
ఆదాయం : 5 వ్యయం : 14
రాజపూజ్యం: 6 అవమానం : 3
గోచార గ్రహ స్థితి
- గురుడు 1-6-2026 వరకు 9వ భావంలో లోహమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 10వ భావంలో తామ్రమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు 11వ భావంలో రజతమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 10వ భావంలో సువర్ణమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 6వ భావంలో సువర్ణమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 5వ ఇంట, కేతువు 11వ రాశిలో లోహ మూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 4వ భావంలో, కేతువు 10వ భావంలో సువర్ణమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు సంవత్సరమంతా పాపి. శని, రాహు, కేతువులు సంవత్సరమంతా శుభులు
తులారాశి వారికి పరాభవ సంవత్సరంలో అనుకూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిరుటి కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా గడుస్తుంది. ప్రయత్నాలు, నూతన ఆలోచనలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలకు అనుకూలం. వివాదాలను పరిష్కరించుకుంటారు.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబ వ్యవహారాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. శుభ, పుణ్య కార్యాలను నిర్వహిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన గోచరిస్తోంది. తండ్రి ఇతర పెద్దల ఆశీస్సులను పొందుతారు. సంతానం పురోభివృద్ధి గురించిన వేదన సంవత్సారంతంలో తొలగిపోతుంది. మేనమామ, తాతగార్లతో గొడవలకు ఆస్కారముంది. మాటతీరును మార్చుకోండి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. సంయమనం పాటించండి.
ఉద్యోగ, వ్యాపారాలు:
ఉద్యోగులకు అత్యంత యోగదాయకమైన సంవత్సరమిది. శని ప్రభావం వల్ల కార్యాలయాల్లో అన్నీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పోటీదారులను దారిలోకి తెచ్చుంటారు. మీపైని వ్యతిరేకతలు తొలగిపోతాయి. గురు ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చోటుచేసుకునే వీలుంది. పనిఒత్తిడి అధికమవుతుంది. అయిష్టమైన పనులు చేయడం, ఇష్టంలేని ప్రాంతానికి వెళ్లాల్సి రావడం మానసిక వేదనను కలిగిస్తుంది. ఓపిక పడితే త్వరగానే సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. డిసెంబర్ నెలలోపు పెట్టుబడులకు రెట్టింపు లాభాలు అందుతాయి.
ఆర్థిక లావాదేవీలు:
ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు అవసరమా కాదా అన్న అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఇష్టారాజ్యంగా ఖర్చులు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఇంటి నిర్మాణం, వాహన కొనుగోలు వంటి నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలను పాటించడం మేలు. ఖర్చులు ఎంతగా ఉన్నా.. అవసరానికి తగినంత డబ్బు మాత్రమ సమకూరుతూ ఉంటుంది.
ఆరోగ్యం :
ఈరాశి వారికి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తి కారణంగా, ఎటువంటి అనారోగ్యాన్ని అయినా తట్టుకుని.. త్వరగా నయం చేసుకోగలుగుతారు. డిసెంబర్ తర్వాత వైద్యులను తరచూ సంప్రదించాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం తగదు. వేళకు ఆహారం, నడక, యోగా వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి.
పరిహారం:
తులారాశి వారు పరాభావ సంవత్సరంలో ఆర్గళాస్తోత్ర పారాయణం, లక్ష్మీనారాయణుల ఆరాధన, దక్షిణామూర్తి పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నవగ్రహారాధన, శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ కూడా మేలు చేస్తాయి.
*****
వృశ్చికం
ఆదాయం : 11 వ్యయం : 5
రాజపూజ్యం: 2 అవమానం : 6
గోచార గ్రహ స్థితి
- గురుడు 1-6-2026 వరకు 8వ భావంలో తామ్రమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 9వ భావంలో రజతమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు 10వ భావంలో లోహమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 9వ భావంలో తామ్రమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 5వ భావంలో రజతమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 4వ ఇంట, కేతువు 10వ రాశిలో తామ్రమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 3వ భావంలో, కేతువు 9వ భావంలో లోహమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు సంవత్సరమంతా పాపి. శని, రాహు, కేతువులు ఏడాదంతా శుభులు
గురు గ్రహ గోచార ఫలితంగా, ప్రతి కార్యాన్నీ పట్టుదలతో సాధించాల్సి వుంటుంది. ఆరోగ్య సమస్యలు, బంధుమిత్రులతో విరోధాలు, స్వయం కృతాపరాధాలు గోచరిస్తున్నాయి. అన్ని వ్యవహారాల్లోనూ అప్రమత్తంగా, కర్తవ్యదీక్షతో నడచుకుంటే మేలిమి ఫలితాలు అందుతాయి.
కుటుంబ స్థితిగతులు:
ఉగాది తర్వాత ఓ మూడు నెలల పాటు కుటుంబ వ్యవహారాల్లో ఒడుదుడుకులుగా అనిపించినా.. ఆ తర్వాత ఏడాదంతా ఆనందం వెల్లివిరుస్తుంది. తండ్రి అండదండలు, గురువుల ఆశీస్సులతో కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. తీర్థయాత్రలకు ఆస్కారముంది. సంతానం విద్య, ఉద్యోగాదుల విషయంలో కలత చెందుతారు. సంతానం ఆశించే వారికి కాస్త ప్రతికూలతే కనిపిస్తోంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్థిరాస్తికి సంబంధించి దాయాదులతో గొడవలు పెరగకుండా సంయమనంతో వ్యవహరించాలి.
ఉద్యోగ, వ్యాపారాలు:
ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. జూన్ నెలవరకు పరిస్థితి కాస్త ప్రతికూలంగా ఉంటుంది. పనుల్లో తీవ్రమైన జాప్యం, ఒత్తిడి, అధికారులతో గొడవలు వంటివి చోటు చేసుకుంటాయి. జూన్ 2వ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో పట్టింది బంగారంలా సాగుతుంది. అధికారులు ప్రసన్నమవుతారు. నిలిచిపోయిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలతో కూడిన బదిలీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారులు సంవత్సరం ప్రారంభంలో నూతన పెట్టుబడులు, అగ్రిమెంట్లకు సంబంధించిన చక్కటి ప్రణాళికలు రూపొందించుకుని.. జూన్ తర్వాత అమలు చేస్తే చక్కటి లాభాలను పొందుతారు.
ఆర్థిక లావాదేవీలు:
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. పొదుపు చర్యల వల్ల ధనాన్ని నిల్వ చేసుకోగలుగుతారు. వడ్డీవ్యాపారాలు జూన్ నెల వరకు ఒడుదుడుకులుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాల్లోని వారికి అమితమైన లాభాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆర్థిక చిక్కులన్నీ తొలగిపోయే సూచనలున్నాయి. ప్రతి రూపాయినీ వివేచనతో ఖర్చు చేయడం మంచిది.
ఆరోగ్యం:
వర్షారంభంలో స్వల్ప చికాకులు తలెత్తినా ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. గోచార గురు ప్రభావం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. చక్కటి జీవనశైలి, మంచి అలవాట్లతో సాగితే ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి ఏ లోటూ ఉండదు.
పరిహారం:
వృశ్చిక రాశి వారు.. ఈ పరాభవ సంవత్సరంలో గురువారాలు గురు సన్నిధిలో గడపడం శ్రేయస్కరం. శనికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనెతో దీపారాధన వల్ల మేలు జరుగుతుంది. లలితా సహస్ర నామ పారాయణ, అర్గళాస్తోత్ర పారాయణ కూడా శుభఫలితాలనిస్తాయి.
*****
ధనుస్సు
ఆదాయం : 14 వ్యయం : 11
రాజపూజ్యం: 5 అవమానం : 6
గోచార గ్రహ స్థితి:
- గురుడు 1-6-2026 వరకు 7వ భావంలో సువర్ణమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 8వ భావంలో సువర్ణమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు 9వ భావంలో తామ్రమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 8వ భావంలో రజతమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 4వ భావంలో (అర్ధాష్టమం) లోహమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 3వ ఇంట, కేతువు 9వ రాశిలో రజతమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 2వ భావంలో, కేతువు 8వ భావంలో సువర్ణమూర్తులు.
- వేధ గోచారం వల్ల సంవత్సరమంతా గురు-శనులు పాపులు. రాహు, కేతువులు శుభులు.
ధనుస్సు రాశివారికి పరాభవ సంవత్సరం కాస్త ప్రతికూలంగా ఉందనే చెప్పాలి. ప్రయత్నించిన కార్యాలకు ఆటంకాలు, అనూహ్య వృథా ఖర్చులు, కొత్త రుణాలకు ప్రయత్నాలు, బంధువుల్లో చులకన కావడం, అనారోగ్య సమస్యల వంటి చికాకులు ఉంటాయి. ప్రతి పనిలోనూ సంయమనం అవసరం.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబంలో సమస్యలు తలెత్తే పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు తలెత్తుతాయి. మీ నోటిదురుసు లేదా అనాలోచిత కఠిన వాక్కుల వల్ల బంధువులతో బద్ధ వైరం గోచరిస్తోంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తే సూచన ఉంది. తల్లి ఆరోగ్యం కలత పెడుతుంది. కుటుంబ సంబంధ విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఓర్పు చాలా అవసరం.
ఉద్యోగ, వ్యాపారాలు:
అర్ధాష్టమ శని ప్రభావానికి అష్టమ గురువు తోడవడంతో వృత్తి, ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి ఎదురవుతుంది. అకారణ విరోధాలు, నిందలు, అవమానాలు గోచరిస్తున్నాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. అక్టోబర్ 31 తర్వాత పరిస్థితులు కాస్త మెరుగవుతాయి. పాత చికాకులు తొలగిపోయి.. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలను, గౌరవాన్ని పొందుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయాన్ని వాయిదా వేసుకుంటే మంచిది. వ్యాపార విస్తరణ, కొత్త అగ్రిమెంట్లకు అనుకూలంగా లేదు.
ఆర్థిక లావాదేవీలు:
గురు, శని గ్రహాలో గోచార రీత్యా విపరీతమైన ఖర్చులు వచ్చిపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, గృహ మరమ్మతులు, స్థిరాస్తి వ్యవహారాల్లో ఖర్చులుంటాయి. అక్టోబర్ వరకు ఆర్థిక స్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ దాకా పరిస్థితులు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఈ సంవత్సరం ధనాన్ని నిల్వ చేసే పరిస్థితి ఉండదు.
ఆరోగ్యం :
ఇంతకాలం దృఢంగా ఉన్న ఆరోగ్యం.. ఈ సంవత్సరం కాస్త ఇబ్బంది పెట్టే వీలుంది. అర్ధాష్టమ శని, అష్టమ గురు గ్రహాల గోచారం వల్ల ఛాతీ, జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యులను సంప్రదించండి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం ద్వారా శారీరక శ్రమను అలవరచుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.
పరిహారం:
ధనుస్సు రాశివారు, పరాభవ సంవత్సరంలో శనికి సంబంధించిన పరిహారాలను ఎక్కువగా చేసుకోవాలి. శనివారాలు శనికి నువ్వుల నూనెతో అభిషేకం, దీపారాధన చేయడం ఉత్తమం. సాయిబాబా, దత్తాత్రేయ, దక్షిణామూర్తి వంటి గురు క్షేత్ర సందర్శన, గురుచరిత్ర పారాయణ వంటి పరిహారాలను పాటించాలి. శ్రీచక్ర సహిత దుర్గామాతకు కుంకుమార్చన కూడా మేలు చేస్తుంది.
*****
మకరం
ఆదాయం : 2 వ్యయం : 8
రాజపూజ్యం: 1 అవమానం : 2
గోచార గ్రహ స్థితి:
- గురుడు 1-6-2026 వరకు 6వ భావంలో రజతమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 7వ భావంలో లోహమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు 8వ భావంలో సువర్ణమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 7వ భావంలో లోహమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 3వ భావంలో తామ్రమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 2వ ఇంట, కేతువు 8వ రాశిలో సువర్ణ మూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు జన్మరాశిలో, కేతువు 7వ భావంలో తామ్రమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు 31-10-2026 నుంచి 24-1-2027 వరకు శుభుడు. శని, 17-5-2026 నుంచి 9-10-2026 వరకు పాపి. 5-12-2026 వరకు రాహువు పాపి. కేతువు సంవత్సరమంతా పాపి.
మకరరాశి వారికి పరాభవ సంవత్సరంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్థంలో అభీష్టం నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు శుభవర్తమానం అందుతుంది. ద్వితీయార్థంలో ప్రతికూలతలుంటాయి. పోలీసు కేసులు, కోర్టు చికాకులు వచ్చే వీలుంది. భాగస్వాములతో సఖ్యత చెడిపోయే వీలుంది.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జూన్ నెల నుంచి ఆనందమయంగా సాగుతుంది. కుటుంబంలోని అవివాహితులకు పెళ్లి యోగం ఉంది. సోదర వర్గం సహకారం లభిస్తుంది. డిసెంబర్ తర్వాత కుటుంబ విషయాల్లో కొన్ని ఒడుదుడుకులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత చెడే సూచన ఉంది. వాగ్వాదాలు మంచిది కాదు. పరస్పర చర్చలు, అపార్థాలు లేని సంప్రదింపులే మేలు.
ఉద్యోగ, వ్యాపారాలు:
ముఖ్యమైన వర్తమానం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి అత్యం శుభ ఫలితాలు లభిస్తాయి. చికాకులు సద్దుమణుగుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. వ్యాపారులు చక్కటి లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు, నూతన అగ్రిమెంట్లకు బాగా అనుకూల కాలమిది. అక్టోబర్ తర్వాత జనవరి వరకు చిన్నపాటి చికాకులు ఎదురవుతాయి. అయితే.. మీ చాకచక్యంతో వాటిని పరిష్కరించుకుంటారు.
ఆర్థిక లావాదేవీలు:
ఆర్థిక వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కలవరపరుస్తాయి. కుటుంబ అవసరాలకు స్థాయికి మించిన ఖర్చు చేయడం వల్ల అప్పులపాలయ్యే సూచన ఉంది. ఈ సంవత్సరం పొదుపు మంత్రం ఏమాత్రం ఫలించదు. అవసరానికి తగిన డబ్బు ఏదో రూపంలో సమకూరుతుంది. వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే శుభ ఫలితాలను అందుకుంటారు.
ఆరోగ్యం :
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. రోగనిరోధక శక్తి, ఆరోగ్య సంబంధ శుభ వర్తమానం ఉత్తేజాన్నిస్తుంది. మానసిక ఆందోళనను అదుపు చేసుకోవాలి. దృష్టి సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. తగిన ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తే మంచిది.
పరిహారం:
మకర రాశి వారు పరాభవ సంవత్సరంలో గాయత్రి అమ్మవారికి కుంకుమార్చన, సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, గురువారాలు దత్తాత్రేయ స్వామికి ఆరాధన వంటి పరిహారాలను పాటించడం మంచిది. శనివారాలు నువ్వుల నూనెతో శనికి అభిషేకం, రుద్రాభిషేకం, శివ పంచాక్షరి మంత్ర జపం మేలు చేస్తాయి.
*****
కుంభం
ఆదాయం : 2 వ్యయం : 8
రాజపూజ్యం: 4 అవమానం : 2
గోచార గ్రహ స్థితి
- గురుడు 1-6-2026 వరకు 5వ భావంలో లోహమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 6వ భావంలో సువర్ణమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు 7వ భావంలో రజతమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 6వ భావంలో తామ్రమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా 2వ భావంలో రజతమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు జన్మరాశిలో, కేతువు 7వ రాశిలో లోహ మూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 12వ భావంలో, కేతువు 6వ భావంలో రజతమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు 2-6-2026 నుంచి శుభుడు. శని 17-5-202 నుంచి 9-10-2026 వరకు తిరిగి 2-2-2027 నుంచి సంవత్సరం చివరిదాకా పాపి. రాహువు 2-8-2026 నుంచి పాపి. కేతువు 5-12-2026 నుంచి పాపి.
కుంభ రాశివారికి పరాభవ సంవత్సరంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. ఓసారి ఉత్సాహంగా, మరోసారి కంగారుగా ఉంటుంది. చేపట్టిన కార్యాలు సఫలమయ్యేందుకు పట్టుదలగా ప్రయత్నించాలి. అనూహ్య ఖర్చులుంటాయి. గృహమార్పు, ఉద్యోగ మార్పు, స్థలమార్పు గోచరిస్తోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఓపిక చాలా అవసరం. కఠినమైన వాక్కుల వల్ల సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటతీరుతో మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశముంది. బంధువులతో విరోధానికి ఆస్కారముంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చడం, గొడవలకు దిగడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో విభేదాలు చికాకు పెడతాయి.
ఉద్యోగ, వ్యాపారాలు:
మే నెలాఖరు వరకు ఉద్యోగులకు మేలిమి కాలం. ప్రమోషన్లు, రివార్డులకు అనుకూలంగా ఉంటుంది. జూన్ నెల నుంచి ఆఫీసులో పోటీదారులు, శత్రువుల బెడద పెరుగుతుంది. మీపై జరిగే కుట్రలను గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలి. వ్యాపారులు భాగస్వామ్య వ్యవహారాల్లో ఆచితూచి నడచుకోవాలి. ఎదుటివారిని గుడ్డిగా నమ్మకండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు.
ఆర్థిక లావాదేవీలు:
ఆర్థికలావాదేవీలు ఆశించిన స్థాయిలో సాగవు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరినా అనవసర ఖర్చుల వల్ల పొదుపు చేయలేక పోతారు. ఇతరులకు అందించే రుణాల వసూలు కష్టమవుతుంది. పూచీకత్తుగా ఉండి ఎవరికి రుణాలు ఇప్పించకండి. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.
ఆరోగ్యం :
కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలను తీసుకోవాలి. మానసిక శాంతి లోపిస్తుంది. నిద్రలేమి చికాకు పెడుతుంది. ఈఎన్టీ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆహార నియమాలను క్రమశిక్షణతో పాటించండి. వ్యాయమం, యోగా వంటివి మేలు చేస్తాయి.
పరిహారం:
కుంభ రాశివారు, ప్రస్తుత పరాభవ సంవత్సరంలో శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం మేలిమి ఫలితాలనిస్తుంది. ఏలినాటి శని దోషంతో పాటు ఇతర గ్రహాల కారణంగా తలెత్తే చికాకులను తొలగించుకోవడానికి, మానసిక ప్రశాంతతకు మంగళ, శుక్రవారాల్లో అమ్మవారిని దర్శించి కుంకుమార్చన చేయించడం మంచిది. వీలైనప్పుడల్లా గురుక్షేత్ర సందర్శన మేలు చేస్తుంది. కనకధారా స్తవం పారాయణ కూడా మేలు చేస్తుంది.
*****
మీనం
ఆదాయం : 14 వ్యయం : 11
రాజపూజ్యం: 7 అవమానం : 2
గోచార గ్రహ స్థితి:
గురుడు 1-6-2026 వరకు 4వ భావంలో తామ్రమూర్తి. 2-6-2026 నుంచి 31-10-2026 వరకు 5వ భావంలో తామ్రమూర్తి. 1-11-2026 నుంచి 24-1-2027 వరకు 6వ భావంలో లోహమూర్తి. 25-1-2027 నుంచి సంవత్సరం చివరి వరకు 5వ భావంలో తామ్రమూర్తి.
- శని ఈ సంవత్సరమంతా జన్మరాశిలో సువర్ణమూర్తి.
- రాహువు, 5-12-2026 వరకు 12వ భావంలో, కేతువు 6వ రాశిలో సువర్ణమూర్తులు. ఆ తర్వాత సంవత్సరం చివరి దాకా రాహువు 11వ భావంలో, కేతువు 5వ భావంలో లోహమూర్తులు.
- వేధ గోచారం వల్ల గురుడు 18-6-2026 నుంచి 18-8-2026 వరకు శుభుడు. శని-కేతువులు సంవత్సరమంతా శుభులు. రాహువు 2-8-2026 నుంచి శుభుడు.
మీన రాశి వారికి పరాభవ సంవత్సరం.. పట్టింది బంగారంలా సాగుతుంది. చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని అభివృద్ధి బాటన సాగుతారు. ప్రణాళికాబద్ధమైన జీవనం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కష్టతరము.. మీకు నష్టం కలిగించే వ్యవహారాలకు దూరంగా ఉంటూ.. అనుకూల, లబ్దిని చేకూర్చే వ్యవహారాల్లో తలదూర్చుతూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. రుణాలు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కుటుంబ స్థితిగతులు:
కుటుంబ జీవనం ప్రశాంతంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో సంయమనంతో వ్యవహరించడం మేలు. చికాకులను తగ్గించుకోవాలి. జూన్-అక్టోబర్ మధ్య కాలంలో సంతాన సంబంధ శుభ వార్తలను వింటారు. మేధస్సుకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. అవివాహిత కుటుంబ సభ్యులకు వివాహం జరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నించే దంపతులు శుభవార్తను వింటారు.
ఉద్యోగ, వ్యాపారాలు:
ఏలినాటి శని ప్రభావం ఉన్నా.. ఈ రాశివారికి శని సువర్ణమూర్తి అయి శుభుడైనందు వల్ల దుష్ఫరిణామాల తీవ్రత బాగా తక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో కష్టానికి తగ్గ గుర్తింపు ఉండదు. సహోద్యోగులు సమస్యగా మారతారు. ఉన్నతాధికారులకు మీపై చాడీలు చెప్పి.. మీకు దక్కాల్సిన అవకాశాలను చెడగొట్టే వీలుంది. జూన్ 2వ తేదీ తర్వాత గురు గోచార రీత్యా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారులకు జూన్-అక్టోబర్ నెలల్లో పెట్టుబడులు, అగ్రిమెంట్లకు అనుకూలం. వ్యాపారులు లాభాలను పొందుతారు.
ఆర్థిక లావాదేవీలు:
ఏలినాటి శని నడుస్తున్నా, మీనరాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ అవసరాలకు విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. స్థిరాస్తి వ్యాపారులు, షేర్ మార్కెట్ రంగంలోని వారికి చక్కటి లాభాలు అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. అనూహ్య ధనలాభం ఉంది. కొంత మొత్తాన్ని పొదుపు చేయగలుగుతారు. వీలైన మేర వృథా ఖర్చులను అదుపు చేయండి.
ఆరోగ్యం :
ఆరోగ్యం గురించిన శ్రద్ధ అవసరం. కీళ్ల సమస్యలుంటాయి. నిద్రలేమి వేధిస్తుంది. మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలున్న వారు అతి జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన ప్రతి సందర్భంలో వైద్యులను సంప్రదించడం అవసరం. అలాగే, రోజూ క్రమం తప్పకుండా నడక, వ్యాయామం, యోగా వంటివి చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతతనూ పొందుతారు.
పరిహారం:
మీనరాశి వారు, ప్రస్తుత పరాభవ సంవత్సరంలో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శనిస్తోత్రం, శని వజ్ర పంజర కవచం, లక్ష్మీనృసింహ కరావాలంబం, అర్గలాస్తోత్రం.. వంటి పారాయణ వల్ల శుభ ఫలితాలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ ఆరాధన కూడా మేలు చేస్తుంది.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]

