Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎన్నికల సిత్రాలు

ఎన్నికల సిత్రాలు

Election Strategies: ఒక్కోసారి విడి విడిగా ఉన్న కొన్ని వార్తలను కలుపుకుంటే పాలకు పాలు, నీళ్లకు నీళ్లలా విషయాలు అర్థమైపోతాయి. ఆ వార్తల వెనుక దాగిన అంతరార్థాలు కూడా తెలుస్తాయి.

ముఖ విలువ
ఇంగ్లీషులో ఫేస్ వ్యాల్యూను తెలుగులో ముఖ విలువ అంటున్నాం. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముఖ విలువ ప్రియాంక. ఆమెను కొందరు ప్రియాంక గాంధీ అంటున్నారు. కొందరు ప్రియాంక వాధ్రా అంటున్నారు. కల్వకుంట్ల కవిత, నందమూరి సుహాసినిలా ఏది అడ్వాంటేజ్ అయితే దాన్ని వాడుకోవడంలో తప్పు పట్టాల్సిన పని లేదు. దాదాపు రెండు మూడేళ్ళుగా ప్రియాంక యూ పి కార్యక్షేత్రంలో శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. “లడకి హు…లడ్ సక్తీ హు- సబలను నేను…పోరాడగలను” అన్న నినాదంతో ఆమె యు పి ఎన్నికలను తన భుజస్కంధాల మీదే వేసుకున్నారు.

ఇటీవల జాతీయ మీడియాకు ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు హుందాగా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోవడం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో అభిప్రాయ భేదాలు..ఇలా అన్ని విషయాల మీద దాటవేయకుండా…నీళ్లు నమలకుండా సమాధానాలిస్తున్నారు. గతంలో అఖిలేష్ యాదవ్ తో పొత్తు యు పి కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసిందన్నారు. ఆ మాట అంటూనే వెంటనే ఎన్నికల అనంతరం అవసరమయితే అఖిలేష్ తో పొత్తు ఉంటుందన్నారు. దాంతో గెలవలేని యుద్ధానికి దిగినట్లు ముందుగానే అంగీకరించినట్లు అయ్యింది.

చీలిక పాచిక
Parties Exihibiting Strategies

ప్రతిపక్షాల ఓట్ల చీలిక ఎప్పుడయినా అధికార పక్షానికి కలిసి వస్తుంది. ఉదాహరణకు యు పి లో అఖిలేష్ బలం పుంజుకుని, కాంగ్రెస్ కూడా గణనీయంగా పెరిగిందని అనుకుందాం. మాయావతి పార్టీ ప్రభావం కూడా ఎంతో కొంత ఉండనే ఉంటుంది. ఎస్ పి, కాంగ్రెస్, బి ఎస్ పి ల్లో ఏ రెండు పార్టీలు బలం పుంజుకున్నా బి జె పి కి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. కాగల కార్యం ప్రతిపక్ష గంధర్వులు తీర్చినట్లే.

దీనికి తోడు మతం ప్రస్తావనతో 80 -20 శాతాల మధ్య యుద్ధం అంటూ అగ్నికి ఆజ్యం పోసే ఎన్నికల విద్యలు ఎలాగూ ఉండనే ఉన్నాయి.

ప్రతిపక్షాలకు ఇవన్నీ తెలియక కాదు. కానీ…ఏమీ చేయలేరు. ఓట్ల చీలిక సూత్రాలు అందరికీ అర్థమవుతూనే ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణాలో బి జె పి, కాంగ్రెస్ రెండూ సమానంగా ఎదిగితే టి ఆర్ ఎస్ సేఫ్ జోన్లోనే ఉంటుంది. కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేయడం వల్లే బి జె పి అనూహ్యంగా పుంజుకుని పక్కలో బల్లెమయ్యిందని కె సి ఆర్ చాలా ఆలస్యంగా గ్రహించారు.

పొత్తుల కత్తులు

బి జె పి తో పొత్తు వల్ల పాతికేళ్లు నష్టపోయామని మహారాష్ట్ర సి ఎం ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు బాధ పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో టి డి పి నీడలో బి జె పి ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం. రేప్పొద్దున పవన్ కళ్యాణ్- బి జె పి లేదా పవన్- బి జె పి- టి డి పి కాంబినేషనే పునరావృతం కావచ్చు. ఇంకో పాతికేళ్ల తరువాత ఉద్ధవ్ ఠాక్రే చెప్పినట్లు…యాభై ఏళ్లుగా పొత్తులవల్ల ఎదగలేకపోయాం అని బి జె పి నిజాయితీగా చెప్పుకోవాల్సి రావచ్చు.

ఐ టీ, ఈ డి, సి బి ఐ సాయం
కర్ణాటక, యు పి, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ…ఎక్కడయినా ఎన్నికలు మొదలుకాగానే సెలెక్టివ్ గా ఐ టీ, ఈ డి, సి బి ఐ దాడులు జరుగుతూ ఉంటాయి. అరెస్టులు బై ప్రాడక్ట్. అరవింద్ కేజ్రీవాల్ కు ఈ విషయం మీద లోతయిన అవగాహన ఉంది. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ అనూహ్యంగా ముందు వరుసలో ఉంది. తమ ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో ఒక మంత్రిని త్వరలో అరెస్ట్ చేస్తారంటూ…జరగబోయేదాన్ని ఆయన ముందే పసిగట్టి చెప్పినట్లున్నారు.

ఎన్నికల్లో ఎలా గెలిచామన్నది కాదు ముఖ్యం. ఎలాగయినా గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యం.

పేరుకు ప్రజలది రాజ్యం!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : చమురూ లేదు…ఒత్తీ లేదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్