Friday, September 20, 2024

పెన్నేటి పాట-8

Drought-Dignity: రంగన్న నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని…రెడ్డిగారింటికి వెళ్లాలి. కడవ భుజాన పెట్టుకుని ఊరబావికి వెళ్లి…కడవలో తెచ్చి…తొట్టెల్లో పోయాలి. పాతాళం అడుగున నీళ్లు మిగిలిన ఆ మెట్ల బావిలోకి దిగి…ఎక్కడమే ప్రాణాలతో చెలగాటం. అలాంటిది భుజాన నిండు కడవ పెట్టుకుని పైకి ఎక్కడమంటే రోజూ సాహసమే. లేనివారి ఇంట్లో ఒక కడవ నీళ్లు రోజుకు సరిపోతాయి. కలవారి ఇంట్లో ఇన్ని తొట్టెల్లో నీరు సాయంత్రానికి ఎలా ఖాళీ అయిపోతాయో రంగన్నకు అంతుబట్టదు.

“మా రంగన్న ఉండగా మాకు నీటికి కరువే లేదు” అన్న మాటలే తప్ప వారిచ్చే మూటలు ఏమీ ఉండవు. పని అంతా చేయించుకుని ఒక లోటాడు మజ్జిగ పోస్తారు. రంగన్నకు అదే అమృతం. కలవారు తినే కూరలు రంగన్నకు కలలో కూడా దొరకవు. మిరపకాయే పప్పు. మిరపకాయే కూర. ముద్దలోకి నంజుడు మిరపకాయ తప్ప ఇంకేమీ ఉండదు.

కలవారి ఇంట్లో ఒక పక్క వడ్లు దంచుతూనే ఉంటారు. ఒక పక్క ధాన్యం ఆరబోస్తూ ఉంటారు. ఒకపక్క మూటలు కట్టి పేరుస్తూనే ఉంటారు. సాయంత్రమయ్యేసరికి రెడ్డివారింట్లో లాంతర్లు తుడిచి…అన్నీ వెలిగించి కొక్కేలకు తగిలించడం రంగన్న పని. మిద్దెమీద మంచాలు వేసి…మనిషి ఎత్తు పరుపులు వేసి…దోమతెరలు కట్టాలి.

ఈ ఇంట్లో ఉన్నంతసేపు ఎటు చూసినా కంటి ముందు వైభోగాలే. ఈ ఇల్లు దాటితే అన్నీ కష్టాలే. కన్నీళ్లే. ఈ ఊరి సిరిసంపదలను మొత్తం మింగి ఉబ్బినట్లుంది ఈ ఇల్లు. ఈ ఇంటి పిల్లి కూడా ఊరి పెద్ద రైతును బెదిరిస్తుంది.

ఇక్కడ తేన్పులే కానీ…నిట్టూర్పులు వినపడవు. ఇక్కడ రూకల గలగలలే కానీ…బాధల విలవిలలు వినపడవు. ఈ ఇంట్లో లక్ష్మీ సరస్వతులు నాట్యమాడుతుంటారు. ఒక్క మానవత్వం తప్ప ఈ ఇంట్లో లేనిది లేదు.

ఈ ఇంటి యజమాని గొప్పగా చదువుకున్నవాడు. రామాయణ, భారత, భాగవతాలు కూడా చదువుతూ ఉంటాడు. ఈ ఇంటి ఇల్లాలి కంట్లో ప్రశాంతత పూచి…పరిమళిస్తూ ఉంటుంది. ఈ ఇంటి యజమాని కొడుకు ఇంగ్లాండులో ప్రజాస్వామ్యం మీద పరిశోధన చేసి…పట్టా పుచ్చుకుని…మొన్ననే వచ్చాడు. ఈ ఇంటి యజమాని కూతురు సామాజిక శాస్త్రాల్లో ఎన్నెన్నో డిగ్రీలు చేసింది.

ఈ ఇంట్లో ఎక్కడ చూసినా చిత్రాలు, శిల్పాలు. ప్రపంచం నలుమూలలనుండి ఏరి కోరి తెచ్చుకున్న అరుదైన వస్తువులు. ఈ ఇంట్లో ఎక్కడా మలినమన్నదే ఉండదు. అన్నీ చక్కగా అమర్చినట్లు ఉంటాయి. అన్నీ తళతళలాడుతూ ఉంటాయి. ఆత్మ ఒక్కటి లోపిస్తుంది తప్ప ఇక్కడ లేనిది లేదు.

ఊళ్లో మూడొందల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు ఈ ఇంటి అరుగు నిర్మించడానికే అయ్యింది. కోటికొక్కరిది ఈ రాయలసీమ. సంపన్నులు మరింత సంపన్నులుగా; లేనివారు మరింత లేనివారుగా మిగిలే రాయలసీమ ఇది.

ఈ ఇంట్లో ఇంతింత సంపదలున్నా…చదువు సంధ్యలున్నా…ప్రాపంచిక జ్ఞానం ఉన్నా…చిటికె వేస్తే పనులు చేసే బలగం ఉన్నా…ఒక్కరికి కూడా మనశ్శాంతి ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో లోకం. పరస్పరం ప్రేమాభిమానాలు కరువు.

రేపు- పెన్నేటి పాట-9
“పేదలను పట్టించుకోని పెద్దలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్