Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెనుగొండలక్ష్మి-5

పెనుగొండలక్ష్మి-5

Historic Fort:

చరిత్రకు కట్టిన కోట:
అదిగో! అది మా పెనుగొండ కోట. శత్రువుల రక్తప్రవాహాలను వేనవేలసార్లు చప్పరించి…దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన కోట. ఇప్పుడిలా రోదిస్తోంది.

ఇది-
ఆంధ్రుల వీర్యాగ్ని మంటలేకుండానే రాజుకున్న చోటు;
మహామంత్రి తిమ్మరుసు మంత్రాంగంతో పులకించిన చోటు;
బహమనీ సుల్తానుల తలపొగరును అణచిన విశాలభూమి;
తెలుగుతల్లి చేయెత్తి పిలిచిన రంగస్థలం.

పెనుగొండ గోడలకు చెవులు ఆనిస్తే…వినిపించే కథలెన్నో!
ఒకప్పుడు ఆకాశమంత ఎత్తు ఎదిగి రాళ్లను కూడా పేరు పెట్టి పిలిచే కోటలో ఇప్పుడు నీరవ నిశీధి నిండి ఉంది.

కొన్ని శతాబ్దాలపాటు అప్రతిహతంగా వెలిగిన పెనుగొండ జ్యోతి కాంతుల్లో చిరు చీమలకు కూడా ఆంధ్రగర్వ స్వాభిమానం మెండుగా ఉండేది. దయాశాంతులు పుష్కలంగా ఉండేవి.

ఆ కోటను చూస్తేనే శత్రువుల చేతుల్లో కత్తులు జారిపోయేవి.

రాయల రాజ్యలక్ష్మి నేలకు దిగిన స్వర్గంలా ఒక వెలుగు వెలిగింది. పెనుగాలులకు దుమ్ముకొట్టుకుపోయిన కోటలలో ఇప్పుడు గుడ్లగూబలు మాత్రమే కాపురముంటున్నాయి.

హిందువుల మీద కత్తులు ఎత్తిపట్టి వచ్చిన ఖానులు పెనుగొండ కోటను చూసి దిక్కులకొకరు పారిపోయారు. ఈ కోట బురుజులు ఎన్నెన్ని దాడులను చూశాయో!

పెనుగొండ సైనిక దళాల్లో ఎన్ని వేలమంది తమ కత్తులను ఈ కోట రాతి గోడలకు నూరి పదును పెట్టుకున్నారో? ఆ అపురూప దృశ్యాలను చూసి సహించని కాలం తన కంటి మంటతో ఆ వైభవాన్ని బూడిద చేసేసింది.

నూనూగు మీసాల నూత్న ప్రాయంలో ఎందరు ఇక్కడ శత్రువుల వెంటపడి తరిమారో!

నీ కోటను కాపాడ్డానికి రాయల వంశంలో ఎందరు ప్రాణాలొడ్డారో! వారి ధీరత్వాన్ని కీర్తిస్తూ నువ్ నులివెచ్చని పద్యాలు పాడాలి కదా! గతవైభవ దీప్తులను కనీసం తలచుకోకపోతే ఎలా?

పెనుగొండ యుద్ధక్షేత్రాలు:
కంటిచూపుతోనే ఆజ్ఞలిచ్చి…శత్రువుల ప్రాణాలను తోడేసే భీకర యుద్ధభూమి- పెనుగొండ. సవాలు చేసి తొడగొట్టి వచ్చిన రాజుల రక్తం తాగిన నేల. కళ్ళురిమి చూస్తేనే శత్రువులు మాడి మసైన చోటు.

చీమ చిటుక్కుమనడానికి కూడా వణికిపోయేంతగా ప్రకృతిని వశంలో పెట్టుకున్న నేల. గాలి కదలాలన్నా, ఎండుటాకు చప్పుడు చేయాలన్నా రాజాజ్ఞ కోసం వేచి చూసేవి.

కళల్లో తేలే రాజులు కత్తులేమి పట్టుకుంటారు? అనుకునేరు. రాజు చేతితో ఒక కత్తి తిప్పితే వెయ్యి కత్తులుగా విచ్చుకుని గుచ్చుకునేవి.

పెనుగొండ రాజ్యాన్ని రక్షించడానికి ఎందరు తమ రక్తాన్ని ధారపోశారో! వారి పేర్లయినా కాలం గుర్తు పెట్టుకుందా? అలాంటి మహానీయులను స్మరించుకోవడం మన కర్తవ్యం కదా!

రాళ్లు కూడా కరిగి కన్నీరయ్యే కథలివి. ఎన్నెన్ని అపురూపఘట్టాలు ఈ మట్టిపొరల్లో ఇంకిపోయాయో! ఎన్నెన్ని త్యాగాలకు ఈ రాతిగోడలు సాక్ష్యంగా నిలిచాయో!

అంతటి పవిత్ర పరాక్రమం ఎందుకు కనుమరుగయ్యిందని నిన్ను నిందించలేను పెనుగొండ తల్లీ! అంతటి నీ పరాక్రమానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను తల్లీ!

ఒళ్లు గగుర్పొడిచే, నిలువెల్లా పులకింతలు పుట్టే ఆ కథలను మళ్లీ మళ్లీ తలచుకుని పొంగిపోతాను తల్లీ!

రేపు – పెనుగొండలక్ష్మి-6
“రాజవీధులు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్