Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమణిపూర్ విషాద చారికలు

మణిపూర్ విషాద చారికలు

Pathetic: టీ వీ లో తెలుగు న్యూస్ ఛానెల్స్ అన్నీ వరదల్లో పీకల్లోతు మునిగి ఉన్నాయి. ఇంగ్లీషు న్యూస్ ఛానెల్స్ మారుస్తుంటే- ఇండియా టుడేలో రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ఒక ఇంటర్వ్యూ ‘క్రయ్ ఫర్ మణిపూర్’ మరికాసేపట్లో ప్రసారమవుతుందని ప్రోమో వచ్చింది. ఛానెల్ మార్చకుండా కూర్చుని చూశాను. దాదాపు 25 నిముషాల ఆ ఇంటర్యూలో నిజంగానే రాజ్ దీప్ సర్దేశాయ్ కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. ఇంటర్వ్యూ చూస్తూ…ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ…తట్టుకోలేక కాసేపు పక్కకు వెళ్లి కన్నీళ్లు తుడుచుకుని వచ్చి మళ్లీ కూర్చున్నాను. గుండెలను మెలిపెట్టే ఇంటర్వ్యూ అది.

రాజ్ దీప్ రాజకీయ అభిప్రాయాల సంగతి ఇక్కడ అనవసరం. కానీ ఈ ఇంటర్వ్యూను నిర్వహించిన పద్ధతిని ఎవరయినా మెచ్చుకోవాలి. గుండె తరుక్కుపోయే ఒక విషాదాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడానికి ఎంత సున్నితంగా, ఎంత సంయమనంతో, ఎంత గంభీరంగా, ఎంత సహానుభూతితో వ్యవహరించాడు అన్నది మాత్రం జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన విషయం.

మణిపూర్ లో అధికార బి జె పి ఎమ్మెల్యే వంగ్ జాగిన్ వాల్టే పై హత్యా ప్రయత్నం జరిగింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతినిధి వాల్టే. ఈ దాడిలో ఆయన డ్రైవర్ చనిపోయాడు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ముఖ్యమంత్రిని కలిసి బయటికి వచ్చిన వాల్టేను విచక్షణా రహితంగా కొట్టారు. కొట్టి…ఈడ్చుకెళ్లి ఒక కమ్యూనిటీ హాల్లో కుర్చీకి కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చారు. చేతులు విరిచేశారు. కళ్లల్లో పొడిచారు. సి ఎం ఇంటికి కాస్త దూరంలోనే ఇదంతా జరిగింది. పోలీసులు ఏమీ చేయలేకపోయారు. వాల్టే చనిపోయాడనుకుని వెళ్లిపోయారు. స్పృహలేని ఆయన్ను మెరుగయిన వైద్యం కోసం ఢిల్లీ అపోలో ఆసుపత్రికి తరలించారు. కొద్దిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు కానీ…ఇదివరకటిలా మాట్లాడగలడా? నడవగలడా? సాధారణ జీవితం గడపగలడా? అన్నది సందేహమే.

మొదట ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఆయన్ను రాజ్ దీప్ కలిసి ధైర్యం చెప్పాడు. తరువాత వారు తాత్కాలికంగా ఉంటున్న ఇంట్లో వాల్టే భార్య, కొడుకును ఇంటర్వ్యూ చేశాడు. వాల్టేను కలిసినప్పటి నుండి ఇంటర్వ్యూ చివరి వరకు రాజ్ దీప్ మాటలు గుండె లోతుల్లో నుండి వచ్చినట్లు విడిగా చెప్పాల్సిన పనిలేదు.

కొన్ని సందర్భాల్లో మాట, హావభావాలు, ఎత్తుగడ, ముగింపు, మాటరాని మౌనం, కంట తడి, గుండె తడి…అన్నీ ముఖ్యమే. కారణం ఏదయినా కావచ్చు. తప్పొప్పులు ఏవయినా జరిగి ఉండవచ్చు. ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకున్న ప్రజలు పట్టపగలు నడిబజారులో చంపబోయిన సందర్భం. చావు అంచులదాకా వెళ్లి మాట పడిపోయి, కాళ్లు చేతులు అచేతనమయిన ప్రజాస్వామ్యంలో దేశప్రజలు ఏమి తెలుసుకోవాలో? ఎందుకు తెలుసుకోవాలో? తెలుసుకుని ఏమి చేయాలో? చెప్పిన ఇంటర్వ్యూ లో ఒక భాగం లింక్ ఇది.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్