Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమేనేజ్మెంట్ పాఠంగా రామాయణం!

మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం!

పిబరే రామరసం-3

మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం, భారతం, భగవద్గీతలను చెప్పడం ఇప్పుడొక ఫ్యాషన్. అలా చెబుతున్నవారికి ఈ ఇతిహాసాలు, పురాణాలు ఒక ఉపాధిగా అయినా పనికివస్తున్నందుకు సంతోషించాలి.

ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా పదానికి చాలా లోతయిన అర్థం ఉంది. దేన్నయినా మేనేజ్ చేయడం అన్నప్పుడు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది. ఆ మేనేజ్ క్రియా విశేషణమయినప్పుడు మేనేజ్మెంట్ అన్న భావార్థక పదం పుడుతుంది. మేనేజ్మెంట్ కు తెలుగు మాట నిర్వహణ. నిర్వాకం వెలగబెట్టినట్లు వెటకారమయ్యింది కానీ- మేనేజ్ చేయడం అన్న మాటలో ఉన్న నెగటివ్ మీనింగ్ నిర్వహణలో లేదు. రాదు. అయినా మన చర్చ వ్యాకరణం గురించి కాదు. మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం గురించి.

నిగ్రహం మేనేజ్మెంట్:-

సాయంత్రం దశరథుడు పిలిచి- రామా! పొద్దున్నే నీకు పట్టాభిషేకం. వశిష్ఠుడిని డీటైల్స్ అడిగి రాత్రికి ఉపవాసం ఉండి, పొద్దున్నే తయారై తెల్లటి పట్టుబట్టలు కట్టుకుని రా నాయనా! అన్నాడు. రాముడు సరేనన్నాడు. తెల్లవారకముందే దశరథుడి మంత్రుల్లో ముఖ్యుడు సుమంత్రుడు వెళ్లి నాన్న రమ్మంటున్నారు అని పిలిచాడు. తీరా వస్తే కైకేయి మందిరంలో దశరథుడు స్పృహదప్పి పడి ఉన్నాడు. ఏమమ్మా! ఏమయ్యింది? అని అడిగాడు రాముడు. ఏముంది నాయనా! భరతుడికి పట్టాభిషేకం- నీకు పద్నాలుగేళ్లు అరణ్యవాసం. ఆ మాట చెప్పలేక సతమతమవుతున్నాడు- అని చెప్పింది. అయ్యో తల్లీ! నువ్ చెబితే ఒకటి. నాన్న చెబితే ఒకటా? అలాగే వెళతాను తల్లీ! అన్నాడు. నిన్న సాయంత్రం పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో- అది లేదన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏం తమాషాగా ఉందా? నాన్నను గృహనిర్బంధం చేసి- నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను- నా కత్తికి ఈరోజు ఎవరు అడ్డొస్తారో చూస్తా- అని లక్ష్మణుడు కత్తి తీస్తే- నాయనా! ఇదంతా దైవ ఘటన అని రాముడు నిగ్రహించాడు.

కలిమి లేముల మేనేజ్మెంట్:-

రాముడు అంతఃపురంలో తిరుగుతుంటే కర్టన్ బట్టల అంచులకున్న ముత్యాలు ఎక్కడ తగులుతాయోనని ద్వారపాలకులు పక్కకు తొలగించేవారు. రోల్స్ రాయిస్, బెంట్లీలు సిగ్గుతో తలదించుకోవాల్సిన రథాలు రాముడికోసం నిత్యం సిద్ధం. హంసతూలికా తల్పాలు. వశిష్ఠాది సకల శాస్త్ర పారంగతుల ప్రత్యేక కోచింగ్. ఐ ఐ టీ, జె ఈ ఈ అన్నిట్లో హండ్రెడ్ పర్సెంటైల్. అందానికి అందం. విద్యలకు విద్యలు. సంపదకు సంపద. కాబోయే మహారాజుగా అధికారానికి అధికారం. కానీ నారచీరలు కట్టుకుని, జుట్టుకు మర్రిపాలు పూసుకుని, జడలు కట్టుకుని, పలుగు పార, తట్టలు పట్టుకుని అడవుల్లో కందమూలాలు తవ్వుకుని, తిని పద్నాలుగేళ్లు గడిపాడు. రాళ్లల్లో ముళ్లల్లో పాదచారిగా తిరిగాడు. నదుల్లో నీళ్లను దోసిటపట్టి తాగాడు. చిటికేస్తే వందమంది సేవకులు పోటీలు పడి పనులు చేసి పెట్టే చోటునుండి- లక్ష్మణుడు పైకెక్కి కుటీరం నిర్మిస్తుంటే రాముడు గడ్డిమోపులు అందించాడు. కొండా కోనల్లో ఎండనక వాననక తిరిగాడు. ఎముకలు కొరికే చలిలో నదిలో దిగి స్నానాలు చేశాడు. ఎక్కడ అయోధ్య? ఎక్కడ లంక? మూడు వేల కిలో మీటర్లు నడుస్తూనే ఉన్నాడు. పగవాడికి కూడా రాముడి కష్టం రాకూడదు.

మ్యాన్ పవర్ మేనేజ్మెంట్:-

గుహుడి సాయంతో గంగ దాటాడు. భరద్వాజుడి సాయంతో కుటీరానికి చోటు ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మణుడి సాయంతో అడవిలో గుడిసె కట్టుకున్నాడు. జటాయువు చెబితే సీతాపహరణ విషయం తెలుసుకున్నాడు. కబంధుడు చెబితే శబరిని కలిశాడు. శబరి చెబితే బాట పట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. హనుమ చెబితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. కోతి మూక సాయం తీసుకున్నాడు. సంపాతి సాయం చేసింది. అగస్త్యుడు చెబితే ఆదిత్య హృదయం చదివి రావణుడిని గెలిచాడు. ఒక పక్షి, ఒక కోతి, ఒక ఎలుగుబంటి, ఒక ముసలి, ఒక రుషి…ఎవరు చెప్పినా విన్నాడు. వాళ్ళందరి సాయం తీసుకున్నాడు. అందరి శక్తులను కలుపుకున్నాడు. రాముడిని మించిన మ్యాన్ పవర్ మేనేజర్, రిసోర్స్ మేనేజర్ ఎవరయినా ఉంటారా?

ఎమోషనల్ మేనేజ్మెంట్:-

రాజ్యం పోయింది. భార్యను ఎవరో అపహరించారు. పరివారం లేదు. అసలే అడవులు. ఆపై వర్షాకాలం. రాతిగుహల్లో నాలుగు నెలలు రామ లక్ష్మణులు ఖాళీగా కూర్చున్నారు. పగలు పక్షులు, ఈగలు. రాత్రిళ్లు దోమలు. గడ్డి మీద, చేతులు దిండుగా పెట్టుకుని పడుకోవాలి. ఎలాంటివాడికి ఎలాంటి కష్టాలు? ఎన్ని చోట్ల గుండెను రాయి చేసుకోవాల్సివచ్చిందో? రాముడు సుఖపడింది ఎప్పుడు?

ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్:-

వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర రాముడు నేర్చుకున్న చదువుసంధ్యలు పోల్చడానికి ఇప్పటిదాకా ప్రమాణాలే లేవు. అతిబల మాహాబల విద్యలు. సకల అస్త్ర శస్త్రాల ప్రయోగాలు, ఉపసంహారాలు. సకల ధర్మ, అర్థ, తర్క, వ్యాకరణ, మీమాంస శాస్త్రాలు. యుద్ధ విద్యలు. పరిపాలన విద్యలు. పదహారేళ్లకే రాముడి షెల్ఫ్ లో పట్టనన్ని డిగ్రీలు. కానీ మన నారాయణ చైతన్యంలా ఒకటి ఒకటి ఒకటి అని చెవిలో ఒకటే రొదలా ఎప్పుడూ ఊదలేదు.

టాలెంట్ మేనేజ్మెంట్:-

హనుమకు రాజు సుగ్రీవుడు. కానీ రాముడు హనుమను దేవుడిని చేశాడు. తనకంటే గొప్ప పూజార్హమయిన స్థానమిచ్చాడు. టాలెంట్ సెర్చింగ్, టాలెంట్ మేనేజ్మెంట్ లో రాముడు అందెవేసిన చేయి. ఆ హనుమ వినయం ముందు వినయమే చిన్నబోవాలి. మీరు శ్రీరామ జయరామ జయ జయ రామ! అనండి- మీ పనులు నేను చేసి పెడతాను అన్నాడు హనుమ. రామకీర్తన జరిగే ప్రతిచోట చేతులు జోడించి, శిరస్సు వంచి ఉంటానని ప్రతిజ్ఞ చేసిన వినయసముద్రం హనుమ.

ఇలా చెబుతూపొతే రామాయణమంతా మేనేజ్మెంట్ పాఠమే. పూజిస్తే పుణ్యమొస్తుంది. పాటిస్తే ఫలం దక్కుతుంది. రామాయణం ఏది కావాలంటే అది ఇస్తుంది. మనం ఏమడుగుతున్నాం? ఎలా చూస్తున్నామన్నదే ప్రధానం.
దృష్టిని బట్టే సృష్టి.

రేపు- పిబరే రామరసం- 4
“రామ బాణం”

-పమిడికాల్వ మధుసుదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్