Family Bond: ఇదేలే తరతరాల చరితం… జ్వలించే జీవితాల గమనం అని ఓ కవిగారన్నట్టు ప్రస్తుతం మధ్యతరగతి చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. పిల్లలే లోకంగా పెంచుతున్న తల్లిదండ్రులు మలి వయసులో నిరాదరణకు గురవుతున్నారు. అమ్మానాన్నల ముక్కు పిండి అన్నీ సాధిస్తున్న పిల్లలు అవసరాలన్నీ తీరాక పోవోయ్ బోడి మల్లయ్యా! అని దూరంగా వెళ్లిపోతున్నారు. అటు ఆస్తులూ కరిగిపోయి ఇటు అభిమానాలూ ఆవిరై నిస్సహాయంగా మిగిలిపోతున్నవారెందరో!
మన అమ్మానాన్నలే… మనం పుట్టి పెరిగిన ఇల్లే. ఆడుకున్న తోబుట్టువులే. కానీ ఇప్పుడెవరూ నచ్చరు. ఒకరంటే ఇంకొకరికి పడదు. ఎవరికి వారే తమని చూసి కుళ్ళుకుంటున్నారని అనుకుంటారు. ఉద్యోగాలు, జీతాలు, కూడబెడుతున్న ఆస్తులు ఎవరికీ తెలీదు. అన్నీ రహస్యాలే. అంతమంది పిల్లలున్నా అమ్మానాన్నలు బిక్కుబిక్కుమంటూ బతకాలి. పిల్లలు పలకరిస్తేనే మాట్లాడాలి. ఒకవేళ ఖర్మ కాలి పిల్లలదగ్గరికెళ్తే పంజరంలో చిలకలా బతకాలి. కొడుకులు, కోడళ్ళు, మనవలు ఎవరూ మాట్లాడరు. పెట్టినప్పుడు తిని మాట్లాడకుండా కూర్చోవాలి. కొంతమంది కొడుకులు ఆస్తులతో పాటు తల్లిదండ్రులనూ పంచుకుంటున్నారు. వారి వీలును బట్టి నెలలవారీగా దగ్గర పెట్టుకుంటున్నారు. ఇది తప్పనికాదు. పిల్లలందరిదగ్గరా ఉండేలా ఎప్పటినుంచో పెద్దలు చేసిన ఏర్పాటే. కానీ అది కాస్తా తప్పనిసరి వ్యవహారంలా తయారయింది.
ఇక జీవిత భాగస్వాములను కోల్పోయిన పెద్దవారి పరిస్థితి మరింత దయనీయం. వారెవరికీ అక్కరలేనివారుగానే ఉంటున్నారు. వాళ్ళు ఇంటికొస్తే ఫ్రీడమ్ తగ్గిపోయిన బాధ. వారికోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యకపోయినా ఏదో అసహనం. నిజానికి పెద్దవాళ్ళు మన సంపద. వారి దగ్గర ఎంతో మంది బంధుమిత్రుల సమాచారం, మన చిన్నప్పటి విశేషాలు, పండుగలు, పిండివంటలు … తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు. కానీ మనకెందుకూ అవి? ఒకప్పుడు నానమ్మ, అమ్మమ్మ తాతయ్యలంటే ఎంతో ప్రేమ ఉండేది. వారు చెప్పే కథలు వింటూ పిల్లలు పడుకునేవారు. టీవీలు, సెల్ ఫోన్లు వచ్చాక ఆ కథలు, పెద్దవాళ్ళు కూడా బోర్ అనేస్తున్నారు. కడుపున పుట్టిన పిల్లలకే అక్కర లేకపోతే వారి పిల్లలకు ఏముంటుంది?
ఇక తోబుట్టువులు. చూడటానికి ప్రేమగానే ఉంటారు. పంతాలు, పట్టింపులు వస్తే తగ్గేదే ల్యా అంటూ బిగదీసుకుపోతున్నారు. ఇంటిలో ఏ సమస్య వచ్చినా కలిసుండాలి. బయటి సమస్యలపై కలసి పోరాడాలి అనే తత్వానికి విరుద్ధంగా ఇంట్లో వారిపైనే ఒంటికాలిమీద లేస్తున్నారు. బాధ్యతలు మాకొద్దంటున్నారు. అసూయ, ద్వేషం పెంచుకుని దూరమవుతున్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలున్న చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి. ఈ జన్మకే తోబుట్టువులు. మరు జన్మలో ఏమవుతామో తెలియదు. అలాంటపుడు ఈ జన్మకు కలసి మెలసి ఉండటమే కదా సార్ధకత!
చుట్టపక్కాలు – వీరి పాత్ర ఒకప్పుడు అనంతం. మంచికీ చెడుకీ ముందుండేవారు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే. ఎవరి బాధ వారిదే. ఎంత దగ్గరివారయినా వెళ్లి ఓదార్చడమనేదే లేదు. మానవసంబంధాలు క్షీణించాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఇవి ఇంతేనా? తరతరానికి మారిపోతాయా? మార్పు మంచిగానే ఉండాలని ఆశపడడం తప్ప ఏమీ చేయలేం.
(ఈ మధ్య విడుదలైన రెండు మంచి సినిమాలు రంగమార్తాండ, బలగం చూశాక కలిగిన ఆలోచనలు )
-కె.శోభ