Sunday, March 8, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాజు కాని రాజు: రేచర్ల రుద్రుడు

రాజు కాని రాజు: రేచర్ల రుద్రుడు

రాజును చంపి, యువరాజును శత్రువులు బంధించినప్పుడు, ఆ రాజుపేరుతో రాజ్యపాలన చేసి… శత్రువులపై గెలిచి… బందీగా ఉన్న యువరాజును విడిపించి… గౌరవంగా కిరీటాన్ని యువరాజుకు మళ్ళీ అప్పగించిన కథ ఎప్పుడైనా విన్నారా?

ఒక తీవ్రమైన సంక్షోభంలో అందరూ నీరుగారిపోయి చేతులుముడుచుకుని కూర్చుంటారు. కానీ యోధుడు భూమ్యాకాశాలను ఒకటి చేస్తాడు. కాలానికి ఎదురీదుతాడు. అలా తన ఖడ్గమనే కలంతో అనితరసాధ్యమైన కాకతీయ కాలాన్ని రచించిన సేనాని, అపురూపమైన రామప్ప ఆలయాన్ని కట్టించిన కళాప్రేమికుడు రేచర్ల రుద్రుడి చరిత్ర తెలుసుకోకపోతే మనం తెలుగువాళ్ళం అని చెప్పుకునే హక్కు కోల్పోతాం.

సింహాసనం కోసం కన్న తండ్రిని బందీని చేసినవారిని చూసాం. తండ్రిని పొడిచి చంపి…కిరీటం నెత్తిన పెట్టుకున్నవారిని చూశాము. అన్నదమ్ములను క్రూరంగా అడ్డుతొలగించిన వారిని చూశాము. కానీ ఇలాంటి కథ ఎప్పుడూ విని ఉండరు మీరు. అదేమిటో తెలుసుకోవడానికి చరిత్రలో 800 ఏళ్ళు వెనక్కు కాకతీయ తోరణంగుండా వెళదాం పదండి.

రేచర్ల వంశం – కాకతీయుల వెన్నుదన్ను

10వ శతాబ్దం నుంచే రేచర్ల వంశీయులు కాకతీయులకు నమ్మకమైన సేనానులుగా ఉన్నారు.

  • రేచర్ల బమ్మ (బ్రహ్మ): 996–1052 మధ్య పాలించిన మొదటి బేతరాజు కాలంలో రేచర్ల బమ్మ సేనాధిపతిగా సేవలందించాడు. ఇతడే రేచర్ల వంశానికి మూలపురుషుడు.
  • ముచ్చ, కాటయ – తొలి సైనిక సేవలు: తర్వాతి తరాల్లో మొదటి ప్రోలరాజు, రెండో బేతరాజుల కాలంలో ముచ్చ, కాటయ లాంటి రేచర్ల వంశీయులు సైనిక బాధ్యతలు నిర్వహించారు. ఇలా తరతరాలుగా రేచర్ల వంశం కాకతీయ రాజ్యానికి సైనిక బలంగా నిలిచింది.

స్వతంత్ర కాకతీయ రాజ్యం – రేచర్ల పాత్ర

12వ శతాబ్దానికి వచ్చేసరికి కాకతీయులు స్వతంత్ర రాజ్యంగా ఎదగడం ప్రారంభించారు.

  • కాశ చమూపతి: 1116–1157 మధ్య రెండో ప్రోలరాజు సేనానిగా పనిచేసిన కాశ చమూపతి మంతెన గుండరాజును ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతడే రేచర్ల రుద్రుడికి తాత.
  • రెండో కాటయ రెడ్డి: 1158–1195 మధ్య రుద్రదేవుని కాలంలో రాజ్య విస్తరణ యుద్ధాల్లో రెండో కాటయ రెడ్డి ముఖ్యమైన సేనాధిపతిగా ఉన్నాడు. ఈ నేపథ్యంతోనే రేచర్ల రుద్రుడు చరిత్రలోకి ప్రవేశించాడు.

కాకతీయులకు సంక్షోభం

1195లో కాకతీయ రాజు రుద్రదేవుడు యుద్ధంలో మరణించాడు. 1199లో మహాదేవుడు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయాడు. యువరాజు గణపతిదేవుడు శత్రురాజుల చేతిలో బందీగా ఉన్నాడు. ఇది కాకతీయ చరిత్రలో అత్యంత సంక్షోభ కాలం.

* రాజు లేడు
* వారసుడు చెరలో ఉన్నాడు
* సామంతుల తిరుగుబాట్లు
సాధారణంగా ఇలాంటి సమయంలో రాజ్యాలు కూలిపోతాయి. కానీ కాకతీయ రాజ్యం నిలిచింది.

రాజు కాని రాజ్యాధికారి – రేచర్ల రుద్రుడు

ఈ సంక్షోభ సమయంలో రాజ్య భారం మోసిన వ్యక్తి రేచర్ల రుద్రుడు. అతడు రాజు కాదు. కానీ గణపతిదేవుడు చెరలో ఉన్నంతకాలం ఆయన పేరుమీదే రాజ్యపాలన సాగించాడు.

  • సేనాధిపత్యం అతడి చేతిలో ఉంది, పరిపాలనా నియంత్రణ కూడా అతడిదే.
  • అయినా… సింహాసనంపై కన్నువేయలేదు. సింహాసనంపై మోజు లేనేలేదు.
  • తిరుగుబాటు చేసిన సామంతులను కఠినంగా అణచాడు. శత్రు దాడులను తిప్పికొట్టి రాజ్యం సరిహద్దులను కాపాడాడు.

ఒక శాసనం ప్రకారం, రాజ్యానికి ముప్పుగా మారి, తిరుగుబాటు చేసిన సామంతుడిని చంపి… అతడి తలను జెండా కర్రకు వేలాడదీసి తిరుగుబాటుదారుల వెన్నులో వణుకు పుట్టించినట్లు ఉంది. అందుకే శాసనాల్లో రుద్రుడిని “కాకతీయ రాజ్యభార ధౌరేయుడు”, “కాకతీయ రాజ్యస్థాపనాచార్య” అని పేర్కొన్నారు.

అధికారం ఉన్నా త్యాగం

1199లో గణపతిదేవుడు చెర నుండి విడుదలయ్యాడు. అప్పటికే సేన మొత్తం రుద్రుడి ఆధీనంలో ఉంది. రాజ్యాధికారం అతడి చేతుల్లోనే ఉంది. అయినా అతడు రాజు కావాలనుకోలేదు. గణపతిదేవుడిని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఇది రాజకీయ చతురత కాదు.. రేచర్ల రుద్రుడి విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.

చారిత్రక కట్టడాలు – వారసత్వం

రేచర్ల వంశీయుల్లో మూడు తరలవారు వరుసగా కట్టించిన గుడిగోపురాలు ఇప్పటికీ నిలిచి వెలుగుతున్నాయి.

  • రుద్రుడి తండ్రి కాటయసేనాని కటాక్షపూర్ గ్రామంలో కట్టించిన ఆలయాలున్నాయి.
  • రామప్ప ఆలయంతోపాటు రుద్రుడు కట్టించిన మరికొన్ని ఆలయాలు పాలంపేట చుట్టుపక్కల ఉన్నాయి.
  • రుద్రుడి కొడుకు గణపతిరెడ్డి నిర్మించిన ఆలయాలు గణ్ పూర్లో ఉన్నాయి.

రామప్పగుడిలో శిలాశాసనానికి ఏకంగా ఒక మంటపమే కట్టించారు. భారతదేశంలో ఇంకెక్కడా ఇలా శాసనానికి ప్రత్యేకంగా మంటపం లేదు. అంటే ఈ చరిత్ర భావితరాలు తెలుసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా గొడిశాల రాజరాజేశ్వరీదేవి ఆలయప్రాంగణంలో ఉన్న శిలాశాసనంలో రేచర్ల రుద్రుడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు దొరికాయి.

రామప్ప దేవాలయం – శిల్పకళ వైభవం

రాజ్యం స్థిరపడిన తరువాత రేచర్ల రుద్రుడు సాంస్కృతిక నిర్మాణాలపై దృష్టి పెట్టాడు. 1213లో ప్రస్తుత ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఒక శైవ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దానిపేరు మొదట్లో రుద్రేశ్వర దేవాలయం. ఇప్పుడది రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.

రామప్ప దేవాలయం ప్రత్యేకతలు:

ఈ దేవాలయం రాజు పేరు మీద లేదు. సేనాని పేరు మీద లేదు. దీన్ని తీర్చిదిద్దిన శిల్పాచార్యుడు రామప్ప పేరుతోనే ఈ ఆలయానికి గుర్తింపు వచ్చింది. భారతీయ దేవాలయ చరిత్రల్లో ఇది చాలా అరుదైన విషయం.

నిర్మాణంలో సాంకేతికత:

  • ఇసుక పునాది: ఈ ఆలయాన్ని ఇసుక పునాదిపై నిర్మించారు. భూమి లోతుల్లో సన్నని ఇసుక పొర వేసి భూకంపాలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
  • తేలియాడే ఇటుకలు: విమాన గోపురంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలేంత తేలికైనవి. అంటే గోపురం బరువు ఎక్కువ లేకుండా ఆలయం పదికాలాలపాటు నిలిచి ఉండేలా చాలా దూరదృష్టితో అలోచించి అందుకు అనువైన ప్రణాళికతో నిర్మించారు.

  • మిశ్రమం: ప్రత్యేకమైన మట్టి, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టులాంటి పదార్థాలతో గోపురానికి వాడిన ఇటుకలను తయారు చేశారు.

శిల్పకళా వైభవం:

నంది మండపం, రంగ మండపం, స్తంభాలపై చెక్కిన మదనిక శిల్పాలు.. ఇవి కాకతీయ శిల్పకళా ప్రతిభకు అద్భుతమైన ఉదాహరణలు.

కాలానికి ఎదురీది నిలిచిన ఆలయం

దండయాత్రలు జరిగాయి, భూకంపాలు వచ్చాయి, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో వచ్చాయి. అయినా రామప్ప దేవాలయం అలాగే నిలిచి ఉంది. ఇప్పుడిది మనందరికీ గర్వకారణమైన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం.

రేచర్ల రుద్రుడు రాజు కాలేదు. కానీ రాజ్యాన్ని కాపాడాడు. రామప్ప దేవాలయం కేవలం ఆలయం కాదు. ఇది కాకతీయుల పాలనా స్థిరత్వానికి, శిల్పకళా ప్రతిభకు, తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. ఇది సింహాసనం కన్నా విశ్వాసం గొప్పదని చెప్పే రేచర్ల రుద్రుడి కథ. ఆ యోధుడు నిర్మించిన అపురూపమైన రామప్ప ఆలయం కథ.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular