Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజంతువులు ఎందుకు మాట్లాడలేవు?

జంతువులు ఎందుకు మాట్లాడలేవు?

మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు?
జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి?
అని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా…కొట్టుకోగా…
తేలిందేమిటయ్యా అంటే-
మనుషుల్లో మాత్రమే “స్వర త్వచం” ఏర్పడిందని. మిగతా ఏ ప్రాణుల్లో స్వర త్వచం ఏర్పడలేదని. స్వర తంత్రులకు కొనసాగింపుగా అదే ప్రాంతంలో రిబ్బన్ లా ఉండే ఒక అవయవ నిర్మాణాన్ని స్వర త్వచం అంటారు.

జపాన్ టోక్యోలో సెంటర్ ఫర్ ఎవల్యూషనరీ ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ లో దీని మీద విస్తృతమయిన అధ్యయనాలు జరిగాయి. నిజానికి మనిషి కూడా 84 లక్షల జీవరాశుల్లో ఒక జంతువే. కేవలం మాట్లాడ్డం వల్ల మనిషి 83,99,999 జీవరాశుల కంటే చాలా భిన్నం, ప్రత్యేకం అయ్యాడు.

మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి దేవత. పెదవి దాటిన మాట వైఖరి-ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు. మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల పదాలు, వాక్యాలు, భావాల భాష పరా పశ్యంతి మధ్యమ దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి శరీర అవయవాల్లో భాష లేదా ధ్వనులు పుట్టి…మారి…బయటికి వినిపించడాన్ని ఇంత శాస్త్రీయంగా దర్శించిన పురాతన సమాజం ప్రపంచంలో బహుశా మనది తప్ప ఇంకేదీ ఉండకపోవచ్చు. మెదడులో ఇదివరకే రికార్డ్ అయి ఉన్న మాటలను భావానికి అనుగుణంగా శబ్దం లేదా మాటగా తీసుకురావడం సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆటోమేటిగ్గా జరిగినట్లు అనిపిస్తుంది కానీ- ఆటోమేటిగ్గా జరగదు. మన ప్రయత్నంతోనే శబ్దం బయటికి వస్తుంది. ఆలోచన మెదడుది. మాటలు అందించేది మెదడు. శబ్దం వినపడేలా చేసేది మన ఊపిరితిత్తుల్లోని గాలి. నాభి దగ్గర పైకి ప్రయాణించే గాలి గొంతులో స్వర తంత్రుల దగ్గర మూర్ఛనలు పోతుంది. ఇక్కడే స్వర త్వచం పాత్ర చాలా కీలకమయినది. ఆపై నోట్లో అనేక భాగాల కదలికలతో ఒక్కో అక్షరం పలుకుతుంది.

మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అ క్షయం- అక్షరం. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి. అలా ఏర్పడిందే లిపి. లిపిలో ఉన్న శబ్దాలను చదువుతున్నప్పుడు ముందు కన్ను చదువుతుంది. తరువాత మెదడు చదువుతుంది. ఆపై నోరు పలుకుతుంది. బాగా నచ్చితే మెదడు రికార్డు చేసుకుంటుంది.

పరిణామ క్రమంలో మనిషి కోతి నుండి పుట్టాడు కాబట్టి జపాన్ పరిశోధనలో 43 రకాల కోతుల స్వర తంత్రులను, స్వర పేటిక నిర్మాణాన్ని, అరిచేప్పుడు గొంతులోపల జరిగే మార్పులను రికార్డు చేసి, అధ్యయనం చేశారు.

మంచిదే.
మనం మాత్రమే ఎలా మాట్లాడగలుగుతున్నామో తెలిసి…మనుషులుగా గర్వపడవచ్చు. పులకించిపోవచ్చు.

ఇన్ని యుగాలుగా జంతువులు కూడా మనతోపాటు పుడుతూనే ఉన్నాయి. వాటి భాష మనకు అర్థం కాకపోవచ్చు కానీ…వాటితో అవి మాట్లాడుకుంటూనే ఉన్నాయి. కాకి పిల్ల కాకికి ముద్దు కాబట్టి కావు కావు అన్న కాకి భాష సాటి కాకులకు కాకి గోల కాకపోవచ్చు. కోయిల పాట గాడిదకు కర్ణ కఠోరంగా ఉండి ఉండవచ్చు. సకిలింపు, ఓండ్రపెట్టడం, కిలకిలలు, కువకువలు, ఘింకారం, భౌ భౌలు, మ్యావ్ మ్యావ్ లు, బుసబుసలు మనకు అర్థం కాకపోయినంతమాత్రాన వాటికొచ్చిన నష్టమేమీ లేదు.

మనం పరమ పవిత్రంగా, ప్రామాణికంగా పరిగణిస్తున్న సప్తస్వరాలు జంతువులు, పక్షుల అరుపుల ఆధారంగా ఏర్పడినవే.

వెనక్కు ద్వాపర, త్రేతా, కృత యుగాల్లోకి వెళితే…కృష్ణుడితో గోవులు మాట్లాడాయి. రాముడితో జటాయువు పక్షి మాట్లాడింది. హనుమ బృందంతో సంపాతి పక్షి మాట్లాడి…సీతమ్మ జాడ చెప్పింది. రాముడి కొలువుకు వచ్చి దెబ్బ తిన్న వీధి కుక్క మాట్లాడి పెద్ద పంచాయతీ పెట్టింది. గరుత్మంతుడు మాట్లాడాడు. శివుడి మెడలో పాము వాసుకి మాట్లాడింది. నారాయణుడి డన్లప్ పరుపు ఆదిశేషుడు మాట్లాడాడు. పార్వతి చేతి చిలుక ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది.

ప్రబంధాల్లో రాయంచలు మాట్లాడి రాయబారాలే చేశాయి. పావురాలు ప్రేమలేఖలు చదివి వినిపించాయి. శకుంతల వెళ్లిపోతుంటే కణ్వుడి ఆశ్రమంలో జింకలు కన్నీళ్లతో గద్గద స్వరంతో మాట్లాడాయి.

యుగ యుగాలుగా జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు మాట్లాడాల్సినదానికంటే ఎక్కువే మాట్లాడినట్లున్నాయి. ఇక చాల్లెమ్మని మాట్లాడ్డం మానేసినట్లున్నాయి.

జంతువులు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయో శాస్త్రీయంగా చెప్పగలిగారు. ఏదో ఒకనాటికి ఆ స్వర త్వచం ఇతర ప్రాణుల్లో కూడా ఏర్పడితే? అన్ని ప్రాణులు మనలాగే మాట్లాడితే?
అప్పుడు- గుర్రం ఎగరావచ్చు. మాట్లాడనూ వచ్చు.

అప్పుడు-
మౌనమే నీ భాష ఓ మూగ మనిషీ!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్