Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిందు పర్వం - పసందు సర్వం

విందు పర్వం – పసందు సర్వం

అమ్మ చేతి వంట కమ్మనైన దంట అని అనుకొనే రోజులు పోయి, ఆ అమ్మ కూడా సరదాగా బయట తిందామని బయలుదేరితే…

ఇంటి భోజనం ఇంటిల్లిపాదికి ఆరోగ్యమన్న ఇల్లాలు…ఈ వారం మనాలీకా, ముస్సోరీకా అని అలవోకగా చిరునవ్వుతో అడిగితే…

అప్పుడెప్పుడో అల్లసాని పెద్దన కాలంలో కాళ్ళకి లేపనం పూసుకొని మనసుకి నచ్చిన ప్రాంతానికి పోయే ప్రవరాఖ్యుడిలా ఏ లేపనాలూ లేకుండా పిల్లలూ… పెంచుకున్న పిల్లులతో సహా ఏ హిమాలయాల చెంత విడిదికో.. ఏ గోవాలో ఉన్న అతిధి గృహానీకో డబ్బు రెక్కలు కట్టుకొని ఆకాశమార్గాన వాలిపోతే …

వారాంత విందులు, సరదాల సందులు అని పాడుకుంటూ ఓ రెండు మూడు రోజులు కుటుంబమంతా ఖుషీ ఖుషీగా కదిలితే…

ఉన్నది ఒకటే బ్రతుకు – దానిని సరిగా బతుకు అనుకొంటూ….

అంతులేని సంపద- మాకు నచ్చిన వంట వండదా?.. అని ఎక్కడెక్కడ ఏ భోజనాలు బాగుంటాయో? ఏ పరిసరాలు రమ్మంటాయో? కనుక్కుంటూ వెళ్ళిపోవడం నేటి కలవారి సమాజంలో వస్తున్న సరికొత్త ట్రెండ్… మొన్న టైమ్స్ వారి వార్తా విశేషాల్లో… మారుతున్న మనుషుల అభిరుచులు చూస్తుంటే సాక్షాత్తూ దేవతలే కళ్ళప్పగించి…నాలుక ఆ నలుడుని తలచి…ఔరా! మనం చేసిన ఈ బొమ్మల సౌభాగ్యమేమి? భూమిపై ఈ విందుల వైభోగమేమి? అనుకోకపోరు.

నిజమే , దేవతలకేముంది…?
అదే నందనవనం…
అదే సురాపానం…
తరతరాల నుండీ రంగూ రుచీ మారని అమృతం తప్ప. భూమ్మీద వండినట్లు ఒక వంటనే అరవై రకాలుగా వండడం తెలుసా..?

పచ్చికూరగాయలతో షెఫ్ లు అలంకరించిన కన్నుల వెన్నెల పందిళ్లు తెలుసా?

రంగు రంగుల బార్బెక్యూ వంటలతో వేలాడే తోరణాలు తెలుసా?

ఎంతసేపూ హంస విహారమూ, నంది వాహనమూ , శేష శయనమూ తప్ప, ఓ వారం అలలపై ఆడుతూ హాయిగా సాగుతూ ఆనందించారా? ఇంకో మాసం మంచులో నానుతూ, వెచ్చని మంటల దగ్గర కబురులు చెప్పారా?

ఇవన్నీ చెయ్యాలంటే రోజుకు తలా ఓ లక్ష నుండి మూడు లక్షలు… ఓ చిన్న కుటుంబానికి ప్యాకేజీ రూపంలో అయితే 10 నుండి 15 లక్షల ఖర్చు. అయితే అయ్యింది. చెక్ పుస్తకాలు వద్దనడం లేదు. ఏటీమ్ లు కాదనడం లేదు.

ఆమధ్య గోవాలో ఓ ఆసామి పదిహేను గదుల విల్లాలో వారికి అవసరమైనవి తొమ్మిది గదులే అయినా వారి ప్రైవసీకి భంగం కలగొద్దని ప్రైస్ మొత్తం ఫ్రెస్టీజ్ గా కట్టాడంట!

ఇంకో కుటుంబం ఓ రెండు రోజుల ఆనందానికి చార్టర్ విమానం ఎక్కిందట! ఇవన్నీ ఎవరు చేయగలరు? ఇలా ఎవరు బతకగలరు? ఏనాడైనా ఓ వీకెండ్ పార్టీకి పోయారా? భుజకీర్తులూ, తల కిరీటాలూ తప్ప , నైకీ బూట్లు తొడిగి, వ్యాన్ హోసన్ బ్యాగులు పట్టి, రే బాన్ చూపుల్తో ఆడీ కారులో ఆడుతూ సాగారా?

ఆ రంభా ఊర్వశిల నాట్యం తప్ప , ఊ కొట్టించే, ఊపు తెప్పించే డాన్సులు చూసారా..?

ఏదో రోజు ఈ భువన వైభోగాలు చూసి, చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిలా వీరంతా కిందకి దిగడం ఖాయం..

వారి చేతి ఉంగరాల్ని కావాలనే కులూ మనాలీ లోయల్లో మళ్లీ దొరకనంత దూరంగా విసిరేయడం ఖాయం.. ఆ అమరపురి ద్వారాలు పున్నమి నాటికి పూర్తిగా మూసుకుంటాయని తెలిసినా, యుగ యుగాలూ ఇక్కడే ఉంటామనడం ఖాయం. ఇది తెలిసిన దేవేంద్రుడు వారు చేసినదే నిజమని చెప్పే వాదనే న్యాయం…
కాకపోతే, సరస్వతీ దేవితో బొత్తిగా పరిచయం లేకపోయినా , లక్ష్మీ దేవి చూపు పడే మార్గం తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానం…

అది లేనినాడు , సాక్షాత్తూ దేవతలకైనా ఈ భువిపై బతుకు కాస్త భారం!

-కిలపర్తి త్రినాధ్
9440886844
(భారత వాయుసేన మాజీ ఉద్యోగి. ప్రస్తుతం విజయనగరంలో బ్యాంక్ ఉద్యోగి. రచన ప్రవృత్తి)

RELATED ARTICLES

Most Popular

న్యూస్