Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసమాధానం వెతికిన ప్రశ్న

సమాధానం వెతికిన ప్రశ్న

RIP Kathi Mahesh : Actor-Filmmaker-Critic

ప్రశ్నించడం ఎప్పుడూ సమస్యే.
ఇదింతే అనుకుంటే గొడవే లేదు.
ఇదిలా ఎందుకుంది?
అని ప్రశ్నించడంతోనే సమస్య.
ఆ ప్రశ్నతో కొత్త సమాధానాలొస్తాయి.
ఆ సమాధానాలనుంచి మరికొన్ని ప్రశ్నలూ మొలకెత్తుతాయి.
ప్రశ్నతో ఇదే గొడవ.
కుదురుగా వుండనివ్వదు.
మనసు, మెదడు స్థిమిత పడనివ్వదు.
ఏదో బాగానే వున్నాం కదా..
అందరూ అదేనమ్ముతున్నాం కదా..
మనందరి కళ్లకూ అలాగే కనపడుతోంది కదా..
దాన్ని ప్రశ్నించడమెందుకు?
తేనె తుట్టె కదిలించడం ఎందుకు?

కానీ అందరూ అలా వుండలేరు.
వాళ్ల బుర్ర పనిచేస్తుంది.
ఆలోచన తొలిచేస్తుంది.
అందరూ అంటున్నారని,
ఎక్కువ మంది నమ్ముతున్నారని ..
నమ్మకమేనిజమనీ నిమ్మళంగా వుండలేరు.
వాళ్ళు ప్రశ్నగా మొదలవుతారు..
కొత్త సమాధానాలుగా తలెత్తుతారు.
మరి కొన్నిప్రశ్నలను భావితరాలకు వదుల్తారు.

అందరూ ఒకేలా ప్రశ్నించరు..
కొందరు ప్రశాంతంగా, మర్యాదగా ప్రశ్నిస్తారు.
కొందరు నర్మగర్భంగా కవితాత్మకంగా ప్రశ్నిస్తారు.
కొందరు కుండబద్దలు కొడతారు.
కొందరుఒకసారి ప్రశ్నించి తమ పని అయిపోయిందనుకుంటారు.
కొందరు సమాధానాలొచ్చేవరకు ప్రశ్నిస్తూనేవుంటారు.
ప్రశ్నలతో విసిగించే వాళ్లు కొందరు
ప్రశ్నలతో అశాంతి రగిలించేవాళ్ళు కొందరు
ప్రశ్నలతో కోపాన్ని తెప్పించేవాళ్ళు కొందరు.

కానీ.. సమాజం ప్రశ్నలని సహించదు.
కొన్ని ప్రశ్నలు సమాజానికి శత్రువులు అంటుంది.
కొన్నిటికి దేశద్రోహం ఆపాదిస్తుంది.
కొన్ని సనాతన విలువలకు వ్యతిరేకమంటుంది.
కొన్నిటికి ఆదిమ విజ్ఞానంతో తగువుపెడతుంది.
సమాజం ప్రశ్నని అస్సలు సహించదు
ఒక్కొక్క ప్రశ్నని ఒక్కోలా నోరు మూయిస్తుంది.
కొన్నిటికి అరకొర సమాధానమిచ్చి..చాల్లేమంటుంది..
కొన్ని ప్రశ్నల పుట్టుకలోనే ప్రమాదముందని కుట్రసిద్ధాంతాలు తెస్తుంది.
కొన్నిటిని కొనేస్తుంది.
కొన్నిటిని భయపెడుతుంది.
కొందరిని బంధిస్తుంది.
కొందరిని నిషేధిస్తుంది.
అవసరమైతే కొందరిని చంపేస్తుంది.
అంతేకానీ, సమాజం..ప్రశ్నని మాత్రం సహించదు
ఈ అసహనానికి ప్రభుత్వం నుంచికూడా మద్దతు వుంటే..
ఇక అరాచకానికి హద్దేవుండదు..
ప్రశ్న పుట్టిన గ్రీకురోమన్ చర్చిలే ..
ప్రశ్నలకు సమాధులుగా కూడా మారడం ఒక చరిత్ర.
ప్రశ్నించినందుకే చార్వాకుడు రాక్షసుడు కావడం ఒకపురాణం.
ప్రశ్నించినందుకే మేధావులు టెర్రిస్టులు కావడం ప్రస్తుత వర్తమానం.

కత్తి మహేష్ ని కూడా అందుకే సమాజం సహించలేదు.
ఎప్పుడూ ప్రశ్నలే..
భరించలేని ప్రశ్నలు..
సహించలేని ప్రశ్నలు..
సమాధానాల్లేని ప్రశ్నలు.
ఇదుగో సమాధానం అన్నా శాంతించని ప్రశ్నలు..
అందుకే మెజారిటీ సమాజం అతన్ని అంతగా ద్వేషించింది.
ఒకానొక దశలో బహిష్కరించింది.
బంధించింది.
ఈ ద్వేషం అతను చనిపోవడంతో ఆగలేదు.
సంతోషంతో కొందరు..
వెటకారంతో ఇంకొందరు..
కసి తీరా మరికొందరు..

ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడై అతని మరణాన్ని స్వాగతిస్తూనే వున్నారు.
ఇవాళ్టి సోషల్ మీడియానే ఈ అసాంఘిక ఆనందానికి వేదిక.
శక్తి లేకనా…
ధైర్యం లేకనా…

ఒక వ్యక్తి మీద ఇంతింత ద్వేషాన్ని మోస్తున్న వీళ్లు
ఇంకా హంతకులుగా ఎందుకు మారలేదో? ఆశ్చర్యమే!

కె. శివప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్