Sri Chaitanya believe in Rohit’s leadership qualities.. శ్రీ చైతన్య విద్యా సంస్థ సమయానుకూలంగా మొదలు పెట్టిన ఆన్ లైన్ తరగతుల డిజిటల్ విద్యా వ్యాపారానికి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసడర్. దానిపేరు “ఇన్ఫినిటీ లెర్న్”. శ్రీ చైతన్య ఇప్పుడొక పేరు కాదు. ఒక బ్రాండ్. ఒక చదువుల పెను పరిశ్రమ. ఒక విప్లవం. ఒక వేలం వెర్రి. ఒక అది. ఒక ఇది. చెప్పడానికి వీల్లేని ఒక ఎన్నెన్నో. అదంతే.
పత్రికలకు, టీవీలకు వారి కోట్లకు కోట్ల ప్రకటనలే ప్రాణ చైతన్యం కాబట్టి వారి గురించి ఏదయినా బ్రహ్మానందం… భజగోవిందమే. చైతన్య పదం స్థానంలో నారాయణ అన్న నామవాచకం పెట్టుకుంటే మిగతాదంతా సేమ్ టు సేమ్. నిజానికి నారాయణ చైతన్యం కొంతకాలం ద్వంద్వ సమాసంగా కలిసి పనిచేసి…ద్వంద్వాతీతమయిన దేనికోసమో విడిపోయాయి.
రోహిత్ శర్మలో కెరీర్ పట్ల శ్రద్ధ, ముందు చూపు, నేర్చుకోవాలన్న తపన, జట్టును విజయతీరాలకు నడిపే నాయకత్వ లక్షణాలు ఉన్నాయట. అవి చైతన్య విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని చైతన్య ఓనరమ్మ చెప్పినమాట.
కెరీర్ శ్రద్ధ
నిజమే.
కెరీర్ మీద శ్రద్ధలేక…చైతన్యలో చేరక కొన్ని కోట్ల మంది కెరీర్ తెగిన గాలిపటంలా…చుక్కాని లేని నావలా…తాడు లేని బొంగరంలా అగమ్యగోచరంగా ఉంది!
ముందు చూపు
నిజమే.
ముందు చూపుతో చైతన్యలో చేరడం వల్ల ఇక ఎవరికీ వెనుక చూపు, పక్క చూపు అవసరం లేకుండా…చూపు చక్కగా ఉంది!
తపన
నిజమే.
తపించిపోవడం భావార్థకంలో తపన, తపస్సు అవుతుంది. చైతన్యలో తల్లిదండ్రులది తపన. పిల్లలది తపస్సు!
నాయకత్వ లక్షణం
నిజమే.
చైతన్య అందించిన ఒకటి ఒకటి ఒకటి;
రెండు రెండు రెండు;
మూడు ముప్పయ్ లు;
నాలుగు నలభైలు;
అయిదు యాభైలు;
ఆరు అరవైలు…
శ్రీనివాస రామానుజన్ దిగివచ్చినా చెప్పలేని ఇన్ఫినిటీ నంబర్లు!
ఇన్ఫినిటీ లెర్నింగ్
నిజమే.
చైతన్యం ఒక ఇన్ఫినిటీ- అనంతం. కానీ ర్యాంకులు మాత్రం ఫినిటి- పరిమితం. ఈ ఫినిటి పరిమిత ర్యాంకుల కోసం ఇన్ఫినిటీ అపరిమితంగా పోటీ పడడమే ఇన్ఫినిటీ లెర్న్. చక్కగా అర్థవంతమయిన పేరు పెట్టారు!
చదువు ఒక చదరంగం
నిజమే.
రోహిత్ శర్మ ఏమి చదువుకున్నాడో మనకు తెలియదు. కానీ చైతన్య చదువుకు ఆయన బ్రాండ్ అంబాసడర్ అయ్యాడు. బహుశా చైతన్యకు చదువొక ఆట అయి ఉంటుంది. కాలేజీలు గ్రౌండులు. విద్యార్థులు ప్లేయర్లు. రుబ్బుడు రోలు బట్టీ చదువులు నెట్ ప్రాక్టీసులు. పరీక్షలు టెస్ట్ మ్యాచ్ లు. అడ్వాన్స్ లు, నీట్ లు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లు. ర్యాంకులు స్కోర్లు. ఆత్మహత్యలు డకౌట్లు!
షారుఖ్ పాఠం
నిజమే.
బైజూస్ ఆన్ లైన్ పాఠాలకు షారుఖ్ బ్రాండ్ అంబాసడర్. దేశంలో పిల్లల చదువులకు బైజూస్ ఆన్ లైన్ పాఠాలు చెప్పే షారుఖ్ తన కొడుకుకు ఏ పాఠాలు చెప్పాడో మనకు తెలియదు. ఆ అబ్బాయి అరేబియా నీళ్ల మీద తేలే నౌక మీద గంజాయి పాఠం చదువుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం చెబుతోంది. బైజూస్ పాఠం చదివి షారుఖ్ కొడుకు నౌకా పాఠానికి వెళ్లాడా? చదవకుండా వెళ్లాడా? నౌక మీద ఆ పాఠంతో పాటు బైజూస్ పాఠం కూడా వింటున్నాడా? అన్నది సి సి టీ వీ కెమెరాలు చెబితే తప్ప మనకు తెలియదు.
ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి!
-పమిడికాల్వ మధుసూదన్