Friday, September 20, 2024

రామాయణం-14

Ramarajyam: “రామరాజ్యం” గురించి వాల్మీకి పూసగుచ్చినట్లు చెప్పాడు. యుగయుగాలుగా ఆదర్శమైన పాలనకు రామరాజ్యమే గీటురాయి. ఆ రామరాజ్య వైభోగం ఎలా ఉంటుందో అయోధ్య జనం ముందుగానే ఊహించుకుని…పొంగిపోయి…పాడుకున్న పాట ఇది:-

పల్లవి:-
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా!
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా!
//రామన్న రాముడు//

చరణం-1
నెల మూడు వానలు కురిసేనురా!
బంగారు పంటలు పండేనురా!
కష్టజీవుల వెతలు తీరేనురా!
బీదా సాదా బ్రతుకు మారేనురా!
//రామన్న రాముడు//

చరణం-2
రామయ్య వంటి కొడుకు రావాలనే…
సీతమ్మ వంటి బిడ్డ కావాలనే…
ఇల్లు వాకిలి పరువు నిలపాలనే…
చల్లంగ నూరేళ్ళు వెలగాలనే…
//రామన్న రాముడు//

చరణం-3
పేదతనము భూమి మీద ఉండబోదురా!
భేదాలకికమీద తావులేదురా!
దొంగ తోడుబోతు బాధ తొలగిపోవురా
రామరాజ్యమాయె మనకు లోటులేదురా!
//రామన్న రాముడు//

చరణం-4
న్యాయమ్ము పాలించి నడుపువాడురా!
ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా!
మునులందరినీ గాచు మొనగాడురా!
ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా!
//రామన్న రాముడు//

రచన- సముద్రాల సీనియర్
సంగీతం- ఘంటసాల
గానం- కెరాణి, పి.సుశీల
చిత్రం- లవకుశ(1963)

రామరాజ్యంలో నెలకు మూడు వానలు కురిసి…బంగారు పంటలు పండాయి. కష్టజీవుల వెతలు తీరి…బీదసాదల బతుకుల్లో వెలుగులు నిండాయి.

రాముడిలాంటి కొడుకు, సీతమ్మలాంటి కూతురు కావాలని…ప్రతి ఇల్లూ కోరుకుంది. ప్రతివారూ పరువు ప్రతిష్ఠలతో చల్లగా నిండు నూరేళ్లు బతికారు.

రామరాజ్యంలో పేదతనం లేనేలేదు. ఉన్నవారు- లేనివారు అన్న తేడా లేదు. దొంగల బాధ లేదు. ఎవరికీ ఎలాంటి లోటు లేదు.

రామరాజ్యంలో న్యాయం, ధర్మం దారి తప్పవు. మునులను రక్షించడం ఒక విధి. అలాంటి రామరాజ్యానికి చెయ్యెత్తి మొక్కుదాం. అలాంటి రాముడికి ముందుగా మొక్కుదాం.

అలాంటి రామరాజ్యం రావాలని కోరుకుందాం.

(అయోధ్యలో రాముడి ఆలయం ప్రారంభోత్సవం (2024 జనవరి 22) సందర్భంగా రాస్తున్న ధారావాహిక దీనితో సమాప్తం)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్