Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచట్టానికి-న్యాయానికి జరిగిన ఈ సమరంలో...

చట్టానికి-న్యాయానికి జరిగిన ఈ సమరంలో…

ఇదొక గంభీరమైన సమస్య. ఇదొక ధర్మ సందేహ సందర్భం. ఇదొక న్యాయాన్యాయ విచికిత్స. ఇది జస్టిస్ చౌదరి సినిమాలో పెద్ద ఎన్టీఆర్ కోటు వేసుకుని, సిగార్ పైపు నోట్లో పెట్టుకుని “చట్టానికి- న్యాయానికి జరిగిన ఈ సమరంలో…” అని వేటూరి రాతకు, బాలసుబ్రహ్మణ్యం పాటకు అభినయించినట్లు న్యాయదేవత మూగగా అయినా పాడుకోవాల్సిన సందర్భం.

ఎలెక్టోరల్ బాండ్లలో పేర్లేవీ? తేదీలేవీ? అని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం అడిగినా ఎస్ బి ఐ ఇవ్వలేదు. ఈ సందర్భంలో మనం వినాల్సిన చరణం:-

“కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం;
మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..”

ఏంటిది తమాషాగా ఉందా? మేమడిగిందేమిటి? మీరిచ్చిందేమిటి? అని సుప్రీం కోర్టు ఎస్ బి ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవేళ మనం వినదగ్గ మరో చరణం:-

న్యాయమూర్తిగా నేనున్నప్పుడు.. న్యాయస్థానమే నాదయినప్పుడు
నాకు మీరు లేరూ..
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు…
తప్పా! తప్పా! తప్పా! నో..”

ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా జవాబుదారీగా ఉండాల్సిందేనని సుప్రీం కోర్టు కొరడా పట్టుకున్నవేళ నేపథ్యంలో ప్లే చేయాల్సిన చరణం:-

“సత్యం కోసం.. హరిశ్చంద్రుడు సతీసుతులనెడబాసినదీ..
గర్భవతిని సీతమ్మను రాముడు.. కారడవికి పంపించినదీ..
కన్న తల్లినే కాదని కర్ణుడు.. రాజత్యాగము చేసినదీ…
కన్న కొడుకునే కాదని నేనీ కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకోసం? ఆ.. ఎందుకోసం?
దహించినా అది ధర్మం కనుకా.. సహించాలి అది సత్యం కనుకా..
కృశించినా.. నే నశించినా..
అది న్యాయం కనుక..
ఆ న్యాయమే.. నా ధైవం కనుకా”

విశ్వ శ్రేయస్సును కోరుకునేది కావ్యం అని కావ్య లక్షణ శాస్త్రంలో ఒక ప్రమాణం. కొంచెం విస్తృతార్థంలో తీసుకుంటే పాటకైనా ఆ ప్రమాణమే వర్తిస్తుంది. సినిమా సందర్భాన్ని దాటి విశ్వజనీనమైన సత్యాలను ఆవిష్కరించిన గీతాలు కావ్యాలై వెలుగుతున్నాయి. అలాంటి పాట ఇది. పాటలో ప్రతి అక్షరాన్నీ ఎలెక్టోరల్ బాండ్ సన్నివేశానికి అన్వయించుకుని చూడండి.

న్యాయాన్యాలను సమీక్షించిన మీదట, ధర్మాధర్మాలను బేరీజు వేసిన మీదట, ఇరు పక్షాల వాదనలను సావధానంగా విన్న మీదట పాటల పూదోటల సర్వోన్నత న్యాయస్థానంలో ‘గీతా’చార్యుడిగా కూర్చుని వేటూరి ఇచ్చిన తీర్పు ఈ పాట.

నిజమే.
దహించినా…ఎస్ బి ఐ సహించాలి…ఎందుకంటే అది సత్యం కనుక.
కృశించినా…భరించాలి…ఎందుకంటే అది న్యాయం కనుక.
ఎస్ బి ఐ ఉన్నదున్నట్లు అన్నీ బయటపెట్టాలి…ఎందుకంటే ఆ న్యాయమే దైవం కనుక.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్