Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసెల్ఫీ పిచ్చి ఇంత డేంజరా?

సెల్ఫీ పిచ్చి ఇంత డేంజరా?

సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని పెట్టి ఉంటే స్వీచి వీచుల వీధుల్లో నిత్యం స్వైర విహారం చేసేవారికి ఎలా ఉన్నా భాషా ప్రేమికులకు మరింత ముద్దొచ్చేది.

అందం మాటకు అర్థం చెప్పడం కష్టం. మనం తప్ప ప్రపంచంలో మిగతా అందరూ అందవిహీనంగా ఉన్నారనుకోవడం ఒక భావన. మనం తప్ప ప్రపంచంలో మిగిలినవారందరూ అందంగానే ఉన్నారనుకోవడం మరో భావన. రెండూ ప్రమాదమే.

కెమెరాలతో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా రావడానికి ముందు వరకు ఫోటోలు, వీడియోలు తీసుకోవడమంటే పెద్ద యజ్ఞం. ఫోటోగ్రాఫర్ లేవమంటే లేచేవాళ్లం. కూర్చోమంటే కూర్చునేవాళ్లం. చిన్ డౌన్ అంటే ఎత్తిన తలను సిగ్గుతో దించుకునే వాళ్లం. స్మైల్ అంటేనే ఏడుపు మానేసి నవ్వే వాళ్లం.

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారూ ఇప్పుడు కెమెరామ్యానే కాబట్టి ఫొటోగ్రాఫర్ల జాతి అంతరించిపోతోంది. ఫోటోలు షేర్ చేసుకోవడమే తప్ప…ప్రింట్లు వేసుకుంటే పాతరాతి యుగం గుహలనుండి అప్పుడే బయటికి వచ్చినట్లు అనుకుంటారు కాబట్టి…ఎవరూ ఫోటో ప్రింట్లు అడగడం లేదు.

మన చేతిలో సెల్ ఫోన్ కెమెరా ఉంది. రతీమన్మథులు అసూయపడేంత అందం మన మొహాల్లోనే ఉంది. దాంతో ప్రతి సందర్భం దానికదిగా ప్రత్యేకమయినదే. ఫోటోలు, వీడియోలు తీసుకుని ప్రపంచానికి చూపాల్సిందే. ఒకరు మన ఫోటోలు తీయడం ఓల్డ్ ఫ్యాషన్. మన ఫోటోలు, వీడియోలు మనం తీసుకోవడమే ఆధునిక సంస్కృతి. మర్యాద.

హిమాలయం శిఖరాన్ని ఎడమకాలితో తొక్కిన అనితరసాధ్యమయిన అలౌకిక సందర్భమే ఫోటో తీసుకోవడానికి తగినది అనుకోవడంలో చాలా పిసినారితనం ఉంది. రాష్ట్రపతి చేతులమీదుగా సన్మానం పొందుతున్న ఫోటోనే ప్రపంచానికి చూపదగ్గది అనుకోవడంలో కూడా సంకుచితత్వం ఉంది.

నిద్ర లేవగానే-
బాత్ రూమ్ కు వెళుతూ నేను
కాలకృత్యాకృత్యాల్లో నేను
స్టవ్ వెలిగిస్తూ నేను
టీ తాగుతూ నేను
ఈగలు తోలుతూ నేను
కునుకు తీస్తూ నేను
ట్రాఫిక్ లో ఇరుక్కుని నేను
మా టీచర్ తో తన్నులు తింటూ నేను
కాలుజారి కాలి ఎముక విరిగి నేను
నోరు జారి ఉద్యోగం పోగొట్టుకున్న నేను
మా తాత శవం పక్కన నేను
కాశీగంగ ఒడ్డున పిండం పెడుతూ నేను…
ఇలా ఈ నేను ఎన్ని సందర్భాల్లో ఫోటో, వీడియో తీసుకుని లోకానికి వెంటనే షేర్ చేయాలో నేనుకే తెలియదు. షేర్ చేశాక లైకులు, కామెంట్లు రాకపోతే ఒక బాధ. నెగటివ్ కామెంట్లు వస్తే మరో బాధ.

సెల్ఫ్ పిటీ కన్నా సెల్ఫీల పిచ్చి మరింత ప్రమాదకరం. చివరికి రాష్ట్రపతి కనిపించినా…అరెరే! ఒక సెల్ఫీ తీసుకోలేకపోయామే అని కొన్ని రోజుల తరబడి నిద్రాహారాలు మాని కుమిలిపోతాం. సెల్ఫీ లకు వీలుగా తిరుమల వెంకన్న ముందు సెల్ ఫోన్ అనుమతిస్తే టి టి డి సొమ్మేమి పోతుందని కొన్ని కోట్ల సార్లు తిట్టుకుంటాం. ఆసుపత్రి ఐ సి యూ సెల్ఫీలు ఇప్పుడు పెద్ద అభ్యంతరకరమయినవి కానే కాదు.

120 కిలో మీటర్ల వేగంతో పట్టాలపై దూసుకెళ్లే రైలుతో సెల్ఫీ దిగుతూ పట్టాలపైనే పైకి పోయినా సెల్ఫీలు ఆగవు.
500 కిలో మీటర్ల వేగంతో రన్ వే పై పైకి లేచే విమానంతో సెల్ఫీ దిగుతూ ప్రాణం కూడా అనంతవాయువుల్లోకి వెళ్లిపోతున్నా సెల్ఫీలు ఆగవు.
50 మీటర్ల ఎత్తులో తీరాన్ని కబళించడానికి మీద పడే సునామీ అలల్లో మునిగి నీటిలో మునిగిపోతున్నా సెల్ఫీలు ఆగవు. సెల్ఫీ మోజులో తగులుతున్న సెల్ఫ్ గోల్ గాయాలు మానవు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్