Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసాంబారులో ముంచుకుని ఇడ్లీ తిని చూడు షారుఖ్ !

సాంబారులో ముంచుకుని ఇడ్లీ తిని చూడు షారుఖ్ !

షారుఖ్ ఖాన్ జగమెరిగిన నటుడు. ముఖేష్ అంబానీ భూగోళం పట్టనంత సంపన్నుడు. అలాంటి సంపన్నుడి కొడుకు పెళ్లి ముందు వేడుక (ప్రీ వెడ్ సెలెబ్రేషన్- ఇంగ్లీష్ మాటకు తెలుగులో వాడుకమాట లేదు- కాబట్టి పుట్టించాలి) మూడు రోజులపాటు గుజరాత్ తీరప్రాంతం జామ్ నగర్లో ధూమ్ ధామ్ గా జరిగింది. ఆ వేడుకలో షారుఖ్ ఖాన్ మన తెలుగు హీరో రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ ఇడ్లీ సాంబార్! చరణ్! వేర్ ఆర్ యూ? అంటూ త్వరగా వేదికమీదికి రావాలని అన్నాడు. తరువాత అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తో కలిసి…రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు.

ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను ఇడ్లీ సాంబార్! అని పిలవడాన్ని వ్యతిరేకిస్తూ…నిరసనగా అక్కడి నుండి బయటికి వచ్చేశానని రామ్ చరణ్ మేకప్ వుమన్ జీబా హసన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ సాంబారు ద్రవం ఇడ్లీలో పడి ఉపద్రవమైన సంగతి లోకానికి తెలిసింది.

ఉద్దేశపూర్వకంగా రామ్ చరణ్ ను, దక్షిణాదిని కించపరచాలని షారుఖ్ అన్నట్లుగా ఆ వీడియోలో లేదు. వాతావరణాన్ని సరదా మాటలతో ఉత్సాహపరచడానికే షారుఖ్ “ఇడ్లీ- సాంబార్ చరణ్!” అన్నట్లు అనిపిస్తోంది. ఆ లింక్ ఇది:-

ఆ మాట కొన్ని రాష్ట్రాలను అవమానపరుస్తుందని ఆయనకు తెలిసి ఉండదు. కనీసం సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమయ్యాక అయినా వివరణ ఇచ్చి…వ్యాఖ్య పట్ల విచారం వ్యక్తం చేసి…క్షమాపణ చెప్పి ఉంటే…హుందాగా ఉండేది.

అయినా-
ఇప్పుడు ఇడ్లీ- సాంబారు దక్షిణాది సొంతం ఎంతమాత్రం కానే కాదు. దేశం యావదాస్తి. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని అత్యంత ఆరోగ్యకరమైన ఇడ్లీని సాంబారులో ముంచుకుని, చట్నీలో అద్దుకుని, కారప్పొడి చల్లుకుని, నేతిని చిలకరించి షారుఖ్ ఇంకా తిన్నట్లు లేడు. తిని ఉంటే ఇడ్లీ సహిత సాంబారు మనోభావాలను ఇలా అవమానించి ఉండేవాడు కాదు. వేడి వేడి పొగలుగక్కే ఇడ్లీలను అరటి ఆకు మీద వేసుకుని…సాంబారులో ముంచి తేల్చి…ఒక్కసారి తిని వుంటే షారుఖ్ ఇలా అని ఉండేవాడు కాదు. జ్వరమొచ్చి పత్యం ఉన్నప్పుడు రెండు ఇడ్లీలను చక్కెరలో అద్దుకుని తిని ఉంటే షారుఖ్ ఇలా అని ఉండడు. తన పిల్లలకు స్కూల్ బాక్సులో ఎప్పుడయినా నాలుగు ఇడ్లీలు పెట్టి పంపి ఉంటే షారుఖ్ ఇలా అని ఉండడు.

రామ్ చరణ్ కు ఎలా ఉందో కానీ…
ఇడ్లీ- సాంబారు మీదే ఆధారపడి…తిని…బతుకుతున్న దక్షిణాది రగిలిపోతోంది. నాలుగు రకాల టిఫిన్లు తినబోయినా…ముందు ఓం ప్రథమంగా తినాల్సిన ఇడ్లీని;
టిఫినుగా, భోజనంగా ఎలా అయినా తినగలిగిన ఇడ్లీని;
ఆయిల్ బాధ లేని ఆరోగ్యకరమైన ఇడ్లీని…
షారుఖ్ ఇంతగా అవమానిస్తాడా?

అలుగుటయే ఎరుంగని ఇడ్లియే అలిగిననాడు…
షారుఖ్ ఖాన్ అరేబియా సముద్రాలన్నీ ఏకమైనా ఏమీ చేయలేవని;
వేడి ఇడ్లీకి- వేడి సాంబారు తోడైన నాడు…
అగ్గికి ఆజ్యం తోడైనట్లు ఎన్ని ఫలాహారాలు ఏకమై వచ్చినా…ఏమీ చేయలేవు అన్న మౌలికమైన సాంబారు సహిత ఇడ్లీ శక్తి సామర్థ్యాల మీద షారుఖ్ కు చెన్నయ్ ఎక్స్ప్రెస్ లో కూర్చోబెట్టి…తక్షణం క్లాసు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. రెండు ఇడ్లీలకు బక్కెట సాంబారు మింగే గొంతులన్నీ ఒక్కటై ఉఫ్ అని ఊదితే…షారుఖ్ ఎక్కడుంటాడో ఒక్కసారి ఊహించుకోవాలి. దేశ స్థూల ఆర్థిక ప్రగతి సూచీలో దేశ స్థూల ఇడ్లీ- సాంబారు వినిమయ వాటా ఎంతో ఒకసారి షారుఖ్ తన అనుభవజ్ఞులైన ఆడిటర్లు, చార్టర్డ్ అకౌంటంట్ లను అడిగి తెలుసుకోవాలి.

అసలే- ఈమధ్య రామ్ చరణ్ తల్లి చేత “అత్తాస్ కిచెన్” అని రామ్ చరణ్ సతీమణి కొత్త వంటల వ్యాపారం పెట్టించింది. ఇది యావత్ సాంబారు సహిత ఇడ్లీ ఆత్మాభిమానం మీద జరిగిన దాడిగా పరిగణించాల్సి వస్తుంది- షారుఖ్!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్