Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనగరాల్లో కొత్త పోకడ

నగరాల్లో కొత్త పోకడ

Myself:  మా చిన్నతనంలో కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు బట్టలు కొనడం పెద్ద పని. మా అమ్మగారికి శిస్తు డబ్బులు వచ్చేవి. సంక్రాంతి ముందర పిల్లల్ని తీసుకుని బజారుకెళ్లి డ్రెస్సులు కొనేవారు. కొనడం అయ్యాక విజయవాడ బీసెంట్ రోడ్డులో ఉన్న మోడరన్ కేఫ్ లో టిఫిన్ తినడం ఇంకో మధురానుభూతి. దానికోసం ఏడాదంతా ఎదురుచూసేవాళ్ళం. ఇదంతా కొన్ని దశాబ్దాల కిందటి మాట. ఈ రోజుల్లో అలా ఎక్కడన్నా కుటుంబం మొత్తం బజారుకెళ్ళడం చూశారా? చాలా తక్కువ. ఇంటిల్లిపాదీ షాపింగ్ కి వెళ్లడమనే ఆలోచన మారిపోయింది. కానీ ఇంట్లో అందరూ విడివిడిగా ఎప్పుడు పడితే అప్పుడు కొంటున్నారు.

చాలా సుఖం:
నిఖిల ఒక్కతే షాపింగ్ కి వెళ్తుంది. చెప్పులు, బట్టలు, బాగ్స్ … ఇలా తనకిష్టమైనవి బాగా చూసి కొనుక్కుంటుంది. ఆర్థికంగా స్థిరపడటంతో తనకు ఇలా అలవాటైపోయింది. చదువు, ఉద్యోగం ఇచ్చిన ధైర్యం కన్నా ఒక్కతే షాపింగ్ చెయ్యడం తనకి ఎంతో స్థైర్యాన్నిచ్చింది అంటుందీ హైదరాబాదీ అమ్మాయి. ముఖ్యంగా ఎంచుకొనే స్వేచ్ఛ నలుగురిలో ఉన్నప్పుడు మన ఇష్టాన్ని స్పష్టంగా చెప్పడానికి సహాయపడుతుందని నిఖిల అభిప్రాయం. మనపైన ఇతరుల ఇష్టాలు రుద్దే అవకాశం కూడా ఉండదట. షాపింగ్ కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లడం వల్ల కొత్తవారిని కలవచ్చని, కొత్త విషయాలు తెలుస్తాయని అంటుంది. మన బడ్జెట్ దాటకుండా కూడా ఉంటామట. ఆన్లైన్ షాపింగ్ లో కూడా చాలా ఉపయోగాలున్నా మనుషులను కలిసే అవకాశం ఉండదుకదా అని నిఖిల అభిప్రాయం.

ఆ ఒక్కరి కోసం
భారత్ లాంటి దేశంలో నిజానికి వ్యక్తిగత ఇష్టాలకు పెద్దగా అవకాశం ఉండదు. గుంపులో గోవిందయ్యలాగా ఉండేవారే ఎక్కువ. నలుగురూ నడిచే దారే అందరూ ఎంచుకుంటారు. ఇది అందరూ అనుకునేమాట. ఫాషన్ కీ ఇదే వర్తిస్తుంది. కానీ ప్రముఖ బ్రాండ్స్ షాపర్స్ స్టాప్, ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ నిపుణులు చెప్తున్నది వేరేగాఉంది. వినియోగదారుల అభిరుచులు మారిపోయాయని, ఇటీవలి కాలంలో నగరాల్లో ఒంటరిగా షాపింగ్ కు వచ్చేవారు పెరిగారని, అందుకు తగ్గట్టే ఉత్పత్తులు తీసుకొస్తున్నామని వీరు చెప్తున్నారు. దేశమంతా ఈ మార్పు ఉన్నా ఎక్కువగా నగరాల్లోనే కనిపిస్తోందని వీరంటున్నారు. అందుకే నేమో ఎక్కడెక్కడి విదేశీ బ్రాండ్ దుస్తులవారందరూ భారతదేశంలో వాలిపోతున్నారు.

ఎందుకీ మార్పు?
గతంలో కన్నా కుటుంబంపై ఆధారపడటం తగ్గింది. చిన్నవయసులోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో వ్యక్తిగతంగా ప్రత్యేక ఇష్టాలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ కారణంగా తమకి ఏమి కావాలన్నదానిపైన స్పష్టమైన అభిప్రాయం వస్తోంది. అలా అని ఇంట్లో ఉండేవాళ్ళూ తక్కువేం కాదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు, జేబులో డబ్బు లేకపోయినా పర్వాలేదు. అలా షికారుగా వెళ్లి షాపింగ్ చేసి వస్తున్నారు. ఆ పక్క స్టార్ బక్స్ లో కాఫీ. మధురానుభూతి సంగతి అడక్కండి మరి. కాఫీ పైన క్రీములో వెతుక్కోవాలి!

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్