Sridhar Impact On Telugu Cartoon Journalism Is A History Forever :
‘Cartoonist Sreedhar left Eenadu’ ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ ఈనాడు ఈనాడును వదిలేశాడా? లేక ఈనాటికి ఇక నీ సేవలు చాలులే అని ఈనాడే వదిలేసిందా? అన్నది ప్రస్తుతం చర్చ. ఈనాడులో శ్రీధర్ నలభై ఏళ్లు అప్రతిహతంగా పని చేయడం దానికదిగా ఒక విశేషమే. ఈనాడు విజయంలో కార్టూనిస్ట్ శ్రీధర్ కు ఎంత వాటా ఇవ్వాలో శ్రీధర్ బుగ్గ మీద ఆప్యాయంగా ముద్దు పెట్టిన ఈనాడు అధినేత రామోజీరావు చిత్రమే చెబుతుంది. ఈనాడులో పని చేసిన, ఇప్పటికీ చేస్తున్న మహామహుల్లో ఇంకెవరికయినా ఇలా అనురాగంతో, అభిమానంతో, పులకింతతో బుగ్గ మీద పెద్దాయన ముద్దు పెట్టిన ముచ్చటయిన ఫోటో ఉందో లేదో తెలియదు.
తెలుగు మీడియా చరిత్రలో కార్టూనిస్ట్ శ్రీధర్ కు తప్పనిసరిగా ఒక అధ్యాయం ఉంటుంది. ఉండాలి కూడా.
ఈనాడుకు రాజీనామా చేశాను అన్న శ్రీధర్ ఫేస్ బుక్ ప్రకటన చూసి…మూడు పత్రికల్లో పనిచేసే పేరున్న ముగ్గురు కార్టూనిస్టులకు ఫోన్ చేసి ఆయన కార్టూన్ల గొప్పతనం గురించి వ్యాసం రాసివ్వాలని అడిగా. ఆయనతో ముప్పయ్ ఏళ్లు కలిసి పనిచేసిన జర్నలిస్టులను అడిగా. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో రాయలేకపోయారు. రాయడం ఇష్టం లేక కాదు. రాస్తే వారు పనిచేసే పత్రికలు ఏమనుకుంటాయో అన్నది ఒక అడ్డు. ఈనాడు ఏమనుకుంటుందో అన్నది ఈనాడు మాజీ ఉద్యోగులకు ఒక డెలికసి.
అయితే వారందరూ చెప్పిన అభిప్రాయాలను కలిపితే సారమిది.
1. ఎన్ టీ ఆర్ తో ఈనాడు ఎంత పాపులర్ అయ్యిందో…శ్రీధర్ కార్టూన్ లతో కూడా ఈనాడు అంతే పాపులర్ అయ్యింది.
2. సామాన్యుల కోణంలో చిన్న ఐడియాతో గొప్ప కార్టూన్లు వేస్తాడు.
3. ఈనాడు సండే మ్యాగజైన్ రాగానే పాఠకులు మొదట చూసేది శ్రీధర్ కార్టూన్ పేజీనే.
4. మనిషి మౌనం. కానీ అతని కార్టూన్లు మౌనం కాదు.
5. సారా ఉద్యమం లాంటి సందర్భాల్లో యాజమాన్య విధానాల పరిమితుల్లోనే గొప్ప కార్టూన్లు వేశాడు.
6. తనకంటూ ఒక సొంత ముద్రను ఏర్పరుచుకున్నాడు.
7. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయి కార్టూనిస్ట్ మోహన్ వర్గం మీద దుమ్మెత్తి పోయడంలో భాగమయ్యాడు.
8. లోలోపలి మనిషిగా ఉండిపోవడానికి ఇష్టపడే శ్రీధర్ ఇలా డిజిటల్ కత్తి దూసి మోహన్ వర్గాన్ని ఖండ ఖండాలుగా కోస్తుండడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
9. శ్రీధర్ ధోరణి వల్ల ప్రస్తుతం తెలుగు కార్టూన్ సమాజం రెండుగా చీలిపోయి ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల…రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ముకు తీవ్రమయిన కరువొచ్చింది.
10. ఇంకేవో వ్యక్తిగత విషయాలు. అవి ఇక్కడ అనవసరం.
“పబ్లిక్ లోకి వస్తే ఏమయినా అంటాం” అన్నది శ్రీ శ్రీ ప్రమాణ వాక్కు. అలా శ్రీధర్ పబ్లిగ్గా స్పందించేసరికి ఆయన వ్యతిరేకులు కూడా పబ్లిగ్గానే విరుచుకుపడుతున్నారు.
ఇంతకూ శ్రీధర్ ఈనాడును తనకు తానే వదిలేశాడా?
లేక ఈనాడు తన సహజ ధోరణిలో పొమ్మనలేక పొగబెడితే బయటికి వచ్చేశాడా?
ఎవరు ఎవరిని వదిలించుకున్నారు?
రామోజీరావు చెప్పరు. శ్రీధర్ చెప్పలేడు. కాలమే చెప్పాలి.
ఈనాడు అనంతర జీవితం శ్రీధర్ కు సుఖ శాంతులు, ఆయురారోగ్యాలు కలిగించుగాక.
(ఇందులో వాడిన కొన్ని ఫోటోలు పాతికేళ్ల ఈనాడు ప్రత్యేక సంచికలోవి)
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : పొట్టి తెలుగు