Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమా కాలనీ కథలు-1

మా కాలనీ కథలు-1

మా కాలనీలో కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసాలు లేవు కాబట్టి…పూల పుప్పొడులమీద జుమ్ జుమ్మని వాలే తుమ్మెదల ఝుంకారాల్లేవు. వాలే కోయిలలు లేవు. పాడే కోయిలలు రావు. కొమ్మలకు చిలకపచ్చ చిగుళ్లు తొడిగే చిలుకలు రానే రావు. ఒకవేళ వచ్చినా పిలిచి పీట వేయడానికి చెట్టంత ఎదిగిన చెట్లు లేనే లేవు.

కాబట్టి సూర్యుడు తూరుపు తెర చీల్చుకుని
“దినకర మయూఖతంత్రుల పైన,
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన…
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ, విశ్వ కావ్యమునకిది భాష్యముగా…”
అనుకోవడానికి వీల్లేకుండా మా కాలనీలో ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో అందరినీ వీధి కుక్కలే మేలుకొలుపుతాయి.

తొలిసంజ కెంజాయల్లో కొమ్మల్లో పక్షుల కిలకిలలతో జగతి మేలుకుంటున్నట్లు కవులు కలలు కనవచ్చు కానీ…మా నిజజీవితంలో శునక సుప్రభాతలే పదివేలు.

అయినా తొలి వేకువలో కొమ్మల్లో పక్షులే లోకాన్ని నిద్రలేపాలని; చూరు మీద కోడే మనల్ను నిద్ర లేపాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసి పెట్టి లేదు. “మీ కోడి కూయకపోతే తెల్లారదా?” అని మా వీధి కుక్కలు చొరవగా తెలుగు సామెతను భౌ భౌ భాషలోకి చక్కగా అన్వయించుకున్నాయి.

రాత్రిళ్లు అర్థం కాని కొరియా, జపాన్ లాంటి భాషల సినిమాలను ఓ టీ టీ ల్లో మార్చి మార్చి ఇంగ్లీషు టైటిల్స్ చదువుతూ ఎంతో కష్టపడి అర్థం చేసుకుని …ఒక తపస్సులా కన్నార్పకుండా చూసి…సరిగ్గా రాత్రి రెండు గంటలకు పడుకుంటామా? సరిగ్గా మూడు గంటలకు తీవ్రశ్రుతిలో శునకరాగాలు మొదలవుతాయి.

కాకి పిల్ల కాకికి ముద్దు. కుక్క భాష కుక్కకు ముద్దు. అది శునక హృదయ వేదనో, వాదనో, లేక అధికార- ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం లాంటిదో, లేక ఇదేదీ కాని ఒక ఉన్మత్తతో అర్థం కాదు. మూడు నుండి అయిదు గంటల వరకు నిరంతరాయంగా మొరిగి…మొరిగి…కాలనీ అంతా తిట్టుకుంటూ, అశుభ శునక శకునంతో రోజూ నిద్రలేస్తున్నామని విసుక్కుంటూ అందరూ మేల్కొన్నారు అని నిర్ధారణ అయ్యాక కుక్కలు మౌనం వహిస్తాయి. అప్పటికి కాలనీకి శాంతి రహిస్తుంది.

కుక్కలు ఎందుకిలా అరుస్తున్నాయి? పగలంతా నోరు మూసుకుని…రాత్రిళ్లే…అది కూడా అర్ధరాత్రి దాటినతరువాతే ఎందుకిలా భూనభోంతరాళాలు దద్దరిల్లేలా మొరుగుతున్నాయి? అది వాటి సాధారణ చర్చా? లేక ఏదయినా సిద్ధాంతం మీద శునక రాద్ధాంతమా? సరిహద్దు తగాదానా?
అన్నది తెలియక కాలనీ పగలంతా రాత్రి నిద్ర కోల్పోయిన దిగులుతో లోలోపల రగిలిపోతూ ఉంటుంది.

కేవలం నిద్రాభంగంతో తృప్తిపడని మరి కొన్ని కుక్కలు కాలనీలో దారినపోయే వారి పిక్కలు కొరికి తమ ఉనికిని చాటుకుంటూ ఉంటాయి. కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి కదా! అంటూ మనుషుల డాక్టర్ సూదులు పొడుస్తూ…గుండెను కూడా గాయం చేస్తూ ఉంటాడు.

మా కాలనీ కుక్కలను గ్రామ సింహాలు అనడానికి భాషోత్పత్తి శాస్త్రం ఒప్పుకున్నా…మా అనుభవ భావోత్పత్తి శాస్త్రం మాత్రం ఒప్పుకోదు. అసలు అడవి సింహాలైనా ఈ గ్రామ సింహాల ముందు తోక జాడించడానికి వీల్లేనంత భయంకరంగా ఉంటాయి కాబట్టి...బతుకుమీద తీపి ఉన్న మా కాలనీ వాటి జోలికి వెళ్లకుండా బతుకు జీవుడా! అనుకుని వాటినుండి తప్పించుకుని బతికేస్తూ ఉంటుంది.

అలాగని మా కాలనీలో కుక్కలదే రాజ్యం అని అనుకోకండి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయనుకునే మనుషులు కూడా ఉంటారు- బిక్కు బిక్కుమంటూ!
కుక్కల దెబ్బకు చస్తూ…బతుకుతూ! కుక్కలనుండి తప్పించుకోలేక బతుకుతూ…చస్తూ!!

మా కాలనీ కుక్కలకే అది మేలుకొలుపు!
ప్రతి ఉషోదయాన మాకది చెడుకొలుపు!!

రేపు:-
“మురికిలో మా మునక”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్