Wednesday, March 18, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనేతాజీ నిత్యజ్వాల

నేతాజీ నిత్యజ్వాల

భారత  స్వతంత్ర సంగ్రామ చరిత్రలో కొన్ని పేర్లు వింటేనే నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ పేర్లలో అగ్రగామిగా నిలిచే వ్యక్తి ‘నేతాజీ’ సుభాష్ చంద్రబోస్. అహింసతో పాటు ఆయుధమే ఆంగ్లేయులను తరిమికొట్టే అసలైన మార్గమని నమ్మి, ప్రపంచ దేశాలను చుట్టి వచ్చి, భారత సైన్యాన్ని నిర్మించిన మహావీరుడు ఆయన. ఈరోజు ఆయన 129వ జయంతి సందర్భంగా, ఆ యుగపురుషుడి ప్రస్థానాన్ని ఒకసారి స్మరించుకుందాం.

మేధావి నుంచి విప్లవకారుడి వరకు

నేతాజీ సామాన్య కుటుంబంలో పుట్టినా, అసామాన్య మేధావి. బ్రిటీష్ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే I.C.S (Indian Civil Service) పరీక్షలో ఉత్తీర్ణుడైనప్పటికీ, బానిసత్వంలో ఉండి తెల్లదొరల కింద పనిచేయడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు. “దేశ విముక్తి కంటే మరేదీ ముఖ్యం కాదు” అని చాటిచెప్పిన ఆయన త్యాగం నేటి యువతకు ఒక గొప్ప పాఠం.

ది గ్రేట్ ఎస్కేప్: చరిత్ర అబ్బురపడిన మారువేషం

1941లో బ్రిటీష్ వారు తనను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు, నేతాజీ ప్రదర్శించిన సాహసం వర్ణనాతీతం. ఒక పఠాన్ (జియావుద్దీన్) లా మారువేషం వేసుకుని, అర్ధరాత్రి వేళ శత్రువుల కళ్లుగప్పి కోల్‌కతా నుండి పెషావర్, అక్కడి నుండి కాబూల్ మీదుగా మాస్కో, చివరకు జర్మనీ చేరుకోవడం చరిత్రలోనే ఒక అద్భుతం. దేశం కోసం ఆయన సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణం భారత స్వాతంత్ర్య పోరాట దిశనే మార్చేసింది.

సముద్ర గర్భంలో సాహస యాత్ర

నేతాజీ సాహసానికి మరో నిదర్శనం ఆయన చేసిన సబ్‌మెరైన్ ప్రయాణం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో, జర్మనీ నుండి జపాన్‌కు వెళ్లడానికి ఆయన ఎంచుకున్న మార్గం అత్యంత ప్రమాదకరమైనది. అట్లాంటిక్- హిందూ మహాసముద్రాల్లో శత్రుదేశాల నౌకలు నిఘా వేసి ఉన్నా, ప్రాణాలకు తెగించి ఒక జర్మన్ సబ్‌మెరైన్ (U-180) నుండి సముద్రం మధ్యలో జపాన్ సబ్‌మెరైన్ (I-29) లోకి మారడం నేతాజీ అకుంఠిత దీక్షకు నిదర్శనం.

ఆజాద్ హింద్ ఫౌజ్…మహిళా శక్తి

“నాకు రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అన్న పిలుపుతో లక్షలాది మంది యువకులను సైనికులుగా మార్చారు నేతాజీ. కేవలం పురుషులనే కాకుండా, ఆసియాలోనే మొదటిసారిగా ‘ఝాన్సీ రాణి రెజిమెంట్’ పేరుతో మహిళా సైన్యాన్ని స్థాపించి, స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. కెప్టెన్ లక్ష్మి సెహగల్ నాయకత్వంలో ఈ సైన్యం బ్రిటీష్ గుండెల్లో నిద్రపోయింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఆశయం. అండమాన్ నికోబార్ దీవులలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆ దీవులకు ‘షహీద్’, ‘స్వరాజ్’ అని నామకరణం చేసిన తొలి ధీశాలి. నేడు ఆయన 129వ జయంతిని మనం ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటున్నామంటే, అది ఆ మహావీరుడి ధైర్యానికి మనం ఇచ్చే నిజమైన నివాళి. ఆయన చూపిన బాటలో నడుస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వడమే నేతాజీకి మనం ఇచ్చే గొప్ప గౌరవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular