Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపొత్తంటే పొత్తేనా?

పొత్తంటే పొత్తేనా?

Alliance- Self reliance:

విలేఖరి:-
సార్! చెప్పండి…రాత్రి ఇసుక వేస్తే రాలినంత జనం సాక్షిగా…పొత్తులమీద మీకు క్లారిటీ వచ్చిందన్నారు కదా!…ఏమిటా క్లారిటీ?

పార్టీ అధినేత:-
చిన్నప్పుడు నేను అమ్మ పొత్తిళ్లలోనే పెరిగాను. ఆనాడే నాకు పొత్తులన్నీ పొత్తిళ్లతోనే మొదలవుతాయని అర్థమయ్యింది. కానీ…అప్పుడు మాటలు రాకపోవడం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు మాటలు తన్నుకుని వస్తున్నాయి కాబట్టి…చెప్పగలుగుతున్నాను.

వి:-
అప్పుడు మీకు రాని మాటలే…ఇపుడు వచ్చిన మాటలకన్నా నయమేమో! మేమడుగుతున్నది ఎన్నికల పొత్తుల గురించి

పా. అ:-
పాల పళ్లు ఊడి…అసలు పళ్లు రాగానే నేను మొదట కొరికినది…తిన్నది…తిని అరిగించుకున్నది…మొక్కజొన్న పొత్తే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. నేను పుట్టగానే పొత్తు పట్టుకున్నాను. కాబట్టి పొత్తు పెట్టుకుంటూనే ఉంటాను. అందుకే ప్రతీకాత్మకంగా ఎప్పుడూ నా కుడి చేతిలో మొక్కజొన్న పొత్తు…ఎడమ చేతిలో పొత్తం(పుస్తకం)...నా చొక్కాకు బొత్తం…నా జేబులో విత్తం(డబ్బు) ఉంటాయి. తెలుగులో ‘త’కు త వత్తు వచ్చిన త్త సహిత పదాలంటే నాకు ఎనలేని ఇత్తం(“ఇష్టం” అని చదువుకోగలరు).

వి:-
మొక్కజొన్న పొత్తుతో, కాగితం పొత్తంతో, చొక్కా బొత్తంతో, జేబులో విత్తంతో మీరు ఎలా ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటున్నారో వివరిస్తారా?

పా. అ:-
మొక్కజొన్న బలమయిన ఆహారం. ప్రత్యర్థుల ముందు నేను బలంగా నిలబడడానికి మొక్కజొన్న పొత్తే కీలకం. పొత్తంతో ప్రత్యర్థులను చిత్తు చేసి చెత్త బుట్టలో పడేయగలను. పాడు శరీరాన్ని పట్టి ఉంచే చొక్కా ఒంటిమీద నిలబడాలంటే బొత్తం చాలా ప్రధానం. నా బండిలో ఇంధనం నింపాలంటే జేబులో విత్తమే ఇంధనం.

వి:-
సార్! మీరు ప్రాసలో కొట్టుకుపోతున్నట్లున్నారు. లోకల్ గా ఎవరయినా మంచి డాక్టర్ కు చూపించుకోండి. అన్నప్రాసన రోజు మీకు అన్నం మరచి ఒట్టి ప్రాసలే పెట్టినట్లున్నారు…ఓర్నాయనోయ్ నాక్కూడా ప్రాసంగికంగా ప్రాసలే వస్తున్నాయి. మీకంటే ముందు నేనే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సివచ్చేలా ఉంది…

పా. అ:-
మాదగ్గరికి వస్తే ఎవరయినా పొత్తులు ఒత్తులు సుత్తులు కత్తులు అంటూ పరవశించి పాడతారు.

వి:-
మీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏయే విషయాలు ప్రధానంగా ఉండబోతున్నాయి?

పా. అ:-
స్వీట్ కార్న్ సూప్, బేబీ కార్న్ చిల్లీ, కార్న్ ఫ్రయిడ్ రైస్, కార్న్ సమోసా, కార్న్ చికెన్ సిక్స్టీ ఫైవ్…ఇంకా …

వి:-
సార్ హోటల్లో వెయిటర్లా మెనూ చెప్తున్నారు…నేనడుగుతున్నది ఎన్నికల ప్రణాళిక గురించి…ఓటర్లకు హామీల గురించి…

పా. అ:-
ఈ ఎన్నికల్లో “పొత్తులు” తప్ప ఇంకేమీ ఇవ్వదలుచుకోలేదు.

వి:-
……

కరెంటు షాక్ తగిలిన కాకుల్లా విలేఖరులందరూ గిల గిల తన్నుకుని..నోట్లో నురగలు కక్కుకుంటూ…కళ్లు తేలేసి…స్పృహదప్పి పడిపోగా…పార్టీ అధినేత జుబ్బా జేబులో నుండి మొక్కజొన్న పొత్తును తీసి నములుతూ వెళ్ళిపోయాడు!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్