Friday, November 22, 2024

చెడులో చెడు

పూర్వం గురుకులాలు అని ఉండేవి.శాస్త్ర, అస్త్ర, శస్త్ర విద్యలలో పారంగతులైన గురువులు అక్కడ శిష్యులకు అవీ, ఇవీ భోదించేవారు. ఆ తరువాత చెట్టు క్రింద బడులు, వీధి బడులు, సర్కారి పాఠశాలలు, కాన్వెంట్ ల యుగం అయిపోయి

ఇక ఇప్పుడు మన ఆధునిక యుగంలోవిద్యార్ధులలో చైతన్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి మానవ యంత్రాలుగా తయారుచేసే “చైతన్య” పాఠశాలలు, విద్యార్ధులలో పాటు వారి తల్లి తండ్రులవి కూడా నవ నాడులు కృంగదీసే “నారాయణ” పాఠశాలలు, మిడిల్ క్లాసు భారతీయులలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు ఉండే డిమాండ్ అర్ధం చేసుకొని దిగుమతి అయిన పబ్లిక్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఓపెన్ మైండెడ్ స్కూళ్ళు. క్లోజ్ ఎండెడ్ స్కూల్స్..

ఇలా చాలా చాలా స్కూళ్ళు మన పిల్లల ఐక్యు అమాంతంగా పెంచడానికి తీవ్ర కృషి చేస్తున్నాయి.వారు ఎంత కృషి చేసినా మన పిల్లల ఐక్యు పెరగపోతే..అది పిల్లలకు మననుంచి సంక్రమించిన జీన్ల లోపం వల్లనో, లేదా పిల్లలు క్లాసు వర్క్ సరిగా చేసారా, హోం వర్క్ ఏమి చేయాలి, అంతా సిలబస్ ప్రకారం జరుగుతున్నదా.. ఇదంతా చూసుకోలేక పోయిన మన “పేరెంట్ వర్క్” లో ఫెయిల్యూర్ తప్ప.. వారి లోపం ససేమిరా ఉండదు. ఉందని మీరు వాదించినా మీ కంఠ శోషే తప్ప వాళ్ళు అంగీకరించరు.ఇంకా ఈ మధ్య హాస్పిటల్స్ లో ఆపరేషన్ కు ముందు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు రోగి ప్రాణాలు పోతే మా పూచి లేదు అని ముందే రోగి బంధువులతో సంతకం పెట్టించు కొంటున్నట్లు, ఈ స్కూల్ యాజమాన్యాలు కూడా మీ పిల్లల చదువులకు- మార్కులకు మా పూచి లేదు అనే సంతకం కూడా ముందే పెట్టించుకొంటున్నారట.

ఇక మన పిల్లల ఐక్యు పెంచడానికి వీరు చేసి కృషి, స్థాయి, మన అస్తుల విలువకు విలోమానుపాతంలో ఉంటుంది. ఆంటే వీరి కృషి స్థాయి పెరుగుతూ ఉంటే, మన ఆస్తుల విలువ తగ్గుతూ ఉంటుంది..ఒకవేళ కొంపదీసి వాళ్ళ కృషి అదేపనిగా పెంచుతున్నప్పుడు, దానితో పోటీపడలేక ముందే నీ ఆస్తుల విలువ జీరోకి చేరి మనం చతికిల పడ్డామా.. గోవింద! గోవింద! గంతకు తగ్గ బొంత వేదుక్కొక, ఈ స్కూల్ అవరసరమా అనే చీత్కారాలు, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకొంటే ఎట్లా.. అనే ఈసడింపులు ఈ కాలపు తల్లితండ్రులకి తప్పదు.

సరే విద్యాబుద్ధులు నేర్పించడానికి మనం ఇన్ని కష్టాలు పడుతుంటే.. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నడపబడుతున్న “జైలు స్కూళ్ల లో” నేర్పే పాఠాలు మాత్రం బాగా తలకెక్కుతున్నట్లున్నాయి. ఎదో చిన్నచిన్న దొంగతనాలు చేసి జైలు కెళ్ళుతున్న చిల్లర దొంగలు అక్కడ నిష్ణాతులైన దొంగలు చెప్పే పాఠాలతో రాటుదేలి బయటకు వస్తున్నారు. మామూలు స్కూళ్ళలో కేవలం శాస్త్రాన్ని సిద్దాంతంగానే భోధిస్తూ ఉంటారు..దీనితో పాటు ఉపాధ్యాయులకు కూడా బొత్తిగా “ప్రాక్టికల్ జ్ఞానం” కొరవడి.. పాఠాన్ని అనుభవైకవేద్యం చేయలేపోతున్నారనేది సత్య సన్నిహితం.

కాని “జైలు స్కూళ్ళలో” “మోసం చెయ్యి-దోచుకో- దొరకకు- దర్జాగా బ్రతుకు” అన్న ఒకే ఒక కామన్ సిద్ధాంతానికి రకరకాల అనుభవాలను కష్టపడి సంపాదించి “గజదొంగలుగా” “దొంగలకు దొంగలుగా” పేరుగాంచిన వారుంటారు. ఎన్నో దొంగతనాలు, లూఠీలు అత్యంత చాకచక్యంగా, దొరకకుండా చేసి కూడా అప్పుడప్పుడు ఖర్మ కాలి దొరికి జైలు లో ప్రభుత్వ రాజభోగాలు అనుభవిస్తూ, జైలులో ఉండే కొద్ది కాలం కూడా అలా రెస్ట్ తీసుకోకుండా..
సాటి దొంగలకు తమకు వచ్చిన విద్యలు, మెళకువలు, కిటుకులు, వివరించి చెప్పి వారిని ఈ విద్యలలో నిష్ణాతులను చేస్తున్నారు. చూడండి వీరి త్యాగం.
రేపు తమకు వృత్తిలో పోటీ అవుతారేమో అన్న స్వార్ధం కూడా లేదు.
తమ కిటుకులతో తమ శిష్యులు దేశాన్ని దోచేస్తుంటే.. వీరికి కలిగే శిష్యోత్సాహం ముందు పుత్రోత్సాహం దిగదిడుపే.
ఇక ఈ చిన్న దొంగలకు లాడ్జింగ్-బోర్డింగ్ ఫ్రీ,
హైలీ ఏక్స్ పీరియన్స్ డ్ ఫాకల్టీ తో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్ లు.. అది పూర్తి ప్రభుత్వ ఖర్చుతో.
కాలం కలసి రావడం అంటే ఇదేనేమో!

అయితే పాపం నానా కష్టాలు పడి బ్యాంక్ లకు కన్నాలు వేసి దొరికిన కాస్తో, కూస్తో దోచుకొందామనే వీరి తెలివితేటలను, దర్జాగా బెంజ్ కారులో బ్యాంక్ ల ముందు దిగి, డైరెక్ట్ గా బ్యాంక్ మానేజర్ ను కలసి లోన్ పేరుతో వేల కోట్లు అప్పనంగా “అప్పుగా” తీసుకొని తీర్చమన్నప్పుడు చేతులు దులుపుకొని విదేశాలకు చేక్కేసే “పరిశ్రమ” వేత్తల తెలివితేటలతో పోల్చలేమనుకోండి.

మొన్నటికి మొన్న మన తెలుగు అకాడెమీ ఫిక్సెడ్ డిపాజిట్ లకు కన్నం వేసిన “చుండూరు వెంకట కోటి సాయి కుమార్” “చెన్నై జైలు ఎడ్యుకేటెడ్” అట. ఎదో చిన్న స్కాంలో పట్టుబడి జైలుకు వెళ్లి అక్కడ తమ సీనియర్ ల అనుభవాల పాఠాలతో రాటుదేలి.. దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ ఫిక్సెడ్ డిపాజిట్లను బ్యాంక్ అధికారులతో కలిసి స్వాహా చేస్తూ గత పదేళ్లుగా దర్జాగా కాలం గడుపుతున్నాడట. ఆయన ఖర్మ బాగోకో, లేదా ప్రజల పుణ్యం పుచ్చో మొన్నామధ్య పట్టుపడ్డాడు.

ఇది “చెన్నై జైలు పాఠశాల” విజయగాథ.
రాజమండ్రి, వరంగల్, చంచల్ గూడలలో వీటన్నిటిని తలదన్నే అండమాన్, తీహార్..
ఒక్కో జైలులో ఇలాంటివే ఎన్నో విజయ గాధలు ఉండి ఉంటాయి!

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read:

తెలుగు అకాడెమీలో దొంగలు పడ్డారు

Also Read:

కాబోయే అయ్యవార్ల హై టెక్ కాపీయింగ్

Also Read:

సరికొత్త ప్రాంతీయ తత్వం

RELATED ARTICLES

Most Popular

న్యూస్