Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగాడ్ ఫాదర్ మదగజమా!

గాడ్ ఫాదర్ మదగజమా!

Language-Liberty: “నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా!”
మత్తేభ గణాలేవో చెప్పే పద్యమిది.

యాభై ఏళ్ల కిందటివరకు ఛందో వ్యాకరణాలను ఇలా పద్యాల్లో, శ్లోకాల్లోనే నేర్పేవారు. జీవితాంతం గుర్తుండిపోయేవి. కొన్ని వ్యాకరణ సూత్రాల పద్యాలు, శ్లోకాలు కూడా కవితాత్మకంగా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత శబ్ద సౌందర్యంతో ఉండేవి.

యమాతారాజభానసలగం” ఏ ముహూర్తాన పుట్టిందో కానీ…సకల ఛందస్సు ఆ క్షణమే అందులో లయించింది. సులభంగా గణాలను గుర్తు పెట్టుకోవడానికి ఏ మహానుభావుడో కనుక్కొన్న చిట్కాగా దీన్ని విద్యార్థులు స్వీకరించారు. టీచర్లు ఆమోదించారు. మంచిదే.

నందికొండ వాగుల్లోన
నల్లతుమ్మ నీడల్లోన … వేటూరి మ స జ స త త గ…శార్దూలా! అన్నారు. అదొక చమత్కారం.

చంపకమాలా!
నను చంపకే బాలా!
అని రామజోగయ్యశాస్త్రి అన్నారు.
అదొక విరుపు. కవితాత్మక పిలుపు.

ఇప్పుడు అనంత్ శ్రీరామ్ వంతు.
నజ భజ జజర .. నజ భజ జజర .. గజ గజ వణికించే గజరాజడిగోరా” అని గాడ్ ఫాదర్ సినిమాలో అనంత్ చిరంజీవిని మదగజంతో పోలుస్తూ పల్లవిలోనే విలన్లను, మనల్ను గజగజ వణికించారు.

మత్తేభ పద్యానికి గణాలు-
“స భ ర న మ య వ”

“నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్”

“న జ భ జ జ జ ర” గణాలు చంపకమాల పద్యానివి.

అనంత్ శ్రీరామ్ ఇవన్నీ తెలిసే రాశారా? తెలియక రాశారా? అన్న చర్చ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

తెలుగు, సంస్కృత భాషల్లో “మదగజం” పాజిటివా? నెగటివా?
గజరాజు అన్న పదంలో వచ్చిన రెండు “జ” లకు ముందు న జ భ జ భజన వచ్చిందా? నజ గజ గజ వణికి తరువాత ప్రాస భయపడి తనంతట తానుగా గజరాజు అయ్యిందా? అన్నది కూడా తర్కానికి నిలబడదు.

ఈ రోజుల్లో సినిమా పాట నృత్యానికి ఉపకరించే శబ్దమే తప్ప భావాన్ని మోయాల్సిన అర్థవంతమయిన భాష కాదు. పదం కాదు. పదబంధం కాదు. కవితాత్మక అభివ్యక్తి కాదు. అనంతమయిన అర్థాన్ని ప్రతిబింబించే ప్రతీక కాదు.

నిజానికి చచ్చి సమాధిలో నిద్రిస్తున్న
“న జ భ జ జ జ ర” కు ప్రాణం పోసి మదగజం మీద ఊరేగించినందుకు అనంత్ శ్రీరామ్ కు ఈ పాటకే జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు ఇవ్వాలి.

రచనా శిల్పంలో ఏ సందర్భానికి తగినట్లు ఆ పదాలు వాడే “పద యోగ్యతా సంబంధం”, ప్రతీకల అన్వయం, పారిభాషిక పదాలు వాడుతున్నప్పుడు జాగ్రత్త, కనీస స్పృహ లాంటి చాదస్తపు మాటలు ఇక్కడ అసందర్భం.

తెలుగు భాష పుణ్యం కొద్దీ పుట్టిన అంతటి త్యాగయ్య జప తపో బలంతో రచించి…పాడిన సామజవరగమనను సినిమా హీరోయిన్ కాళ్ల కింద పెట్టడంతో పోలిస్తే…అనంత్ శ్రీరామ్ మదగజ వృత్తానికి న జ భ జ జ జ ర గణాలు అతికించడం పెద్ద తప్పే కాదు.

నిజానికి- మదగజాలు అనంత్ శ్రీరామ్ కు కృతజ్ఞతాపూర్వకంగా న జ భ జ పూజ చేయాలి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సిధ్ శ్రీరామ్ సమర్పిత ఇనుప గుగ్గిళ్లు

Also Read :

తెలుగు పాటల తిక్క

RELATED ARTICLES

Most Popular

న్యూస్