Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసరికొత్త ఊర్జ తెలుగు!

సరికొత్త ఊర్జ తెలుగు!

రాముడు అడవికి వెళుతుంటే తల్లి కౌసల్య విశల్యకరణి(ఎముకలు విరిగితే వెంటనే వాటంతటవే అతుక్కోవడానికి చదివే మంత్రం) లాంటి ఎన్నెన్నో రక్షా మంత్రాలు చదివి…నాయనా నీకు పంచభూతాలు, రుతువులు, సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, రోజులు, పూటలు, ఘడియలు, విఘడియలు అన్నీ రక్ష కలిగించుగాక అంటుంది. పద్నాలుగేళ్లు లోకాభిరాముడిని చూడకుండా ఎలా ఉండగలనో అని తల్లిమనసు తల్లడిల్లిపోతుంది. ఆయనంటే అవతారపురుషుడు. ఆయన్ను ఘడియ ఘడియకు రక్షించడానికి ముందే ప్రకృతిని అలా మలచి సృష్టి జరిగి ఉంటుంది. అలా లేకపోయినా తనను తాను రక్షించుకునే ధైర్య వీర్య బల సంపద ఉండనే ఉంది.

మనకు అలా కాదు కదా!
రోజూ ఉదయాన్నే పేపర్లో, టీ వీ ల్లో, రేడియోల్లో ప్రకటనలు చూసి, చదివి, విని ముక్కలయ్యే మన గుండెలను తిరిగి అతికించడానికి మన అమ్మలకు కౌసల్యాదేవిలా విశల్యకరణి మంత్రాలు రావు కదా!

ఇనుప గుగ్గిళ్ళతో మన శరీరాలకు తగిన ఐరన్ ఇవ్వడానికి తయారు చేసిన అయోజనిత అయోమయ ప్రకటనలను చదివి మనం స్పృహదప్పి పడిపోతే…కరెంటు షాకు తగిలిన కాకిలా విలవిలలాడుతుంటే అప్పటికప్పుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్ని తెచ్చి…మనల్ను బతికించే హనుమంతుళ్లు మన గుమ్మాల్లో ఉండరు కదా!

మన చెవుల్లో ప్రకటనల సీసం పేరుకుపోయి మనం పుట్టు చెవిటివాళ్లం అయిపోతే…ప్రకటనలు చూసి మన కళ్లు పుట్టు గుడ్డివాళ్లం అయిపోతే…ప్రకటనలు చదివి అర్థం చేసుకోలేక మనం పుట్టు మూగవాళ్లమై ఎర్రగడ్డలకు పరుగులు పెడుతుంటే…యుద్ధసీమ నడిమధ్యలో రాముడికి ఆదిత్యహృదయం చెప్పి భుజం తట్టినట్లు మనల్ను కాపాడ్డానికి అగస్త్యులు లేరు కదా!

భారత ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ ప్రభుత్వ సంస్థ- ఇండియన్ ఆయిల్ తెలుగులో ఇచ్చిన మొదటి పేజీ రంగుల ప్రకటన మొదట చదవండి.
తరువాత దానికి మూలమైన ఇంగ్లిష్ ప్రకటన చదవండి.

ఇప్పుడు మీకు విశల్యకరణి, సంజీవని, సావర్ణికరణి, యాంటీ డిప్రెషన్, నిద్రలేమి, ఇన్ డైజెషన్ మంత్రాలు, తాయెత్తులు, మందులు, స్లీపింగ్ టాబ్లెట్స్, మెంటల్ తెరపీలు అవసరమో! లేదో! మీకు మీరే తేల్చుకోండి.

ఇండియన్ ఆయిల్ వారి మోడీ తెలుగు ప్రకటన చూడక, చదవకపోయి ఉంటే- అది కేవలం మీ పూర్వజన్మ పుణ్యఫలం. చూసినా, చదివినా పట్టించుకోకపోయి ఉంటే- ఆ అలవాటు మీ ఆరోగ్య రహస్యం.
చదివినా అర్థం కానిది మనకెందుకు అని వదిలేసి ఉంటే- అది మీ లౌక్యం.
చదివి అర్థం కాక తల గోడకేసి కొట్టుకుంటే-
అది ఇండియన్ ఆయిల్ వారి సదుద్దేశం.
ఇంగ్లిషులో బాగున్నది తెలుగులో కడుపులో దేవినట్లు అనిపిస్తే-
అది మనమీద యాడ్ ఏజెన్సీ/అనువాదకుల/అనువాద యంత్రాల పగ, ప్రతీకారం; మన ఏలినాటి శని ప్రభావం.

అన్నట్లు-
1 . మీ ఊళ్లో కానీ, మీ ఇంట్లో కానీ ఎవరైనా “ఊర్జాదాతలు”న్నారా? ఉంటే కొంచెం “ఊర్జా” పొట్లం కట్టి పంపుతారా?
2 . మీరిచ్చే “ఊర్జాకు” తగిన ప్రతిఫలానికి మన ప్రధాని మోడీ గ్యారెంటీ.
3 . మీకింకా నమ్మకం కుదరకపోతే…కావాలంటే మోడీ “ఉపక్రమం” బాండు పేపర్ ఇస్తాం. తీసుకుంటారా?
4 . నిజం. నమ్మండి. మా “ఆదాయింపు” 85 వేల కోట్లిప్పుడు.
5 . “మా బ్లెండింగ్ యత్నాల ఫలితాలు” చూశారుగా!
6 . “ఎంపికైన” పెట్రోల్ బంకుల దగ్గర “కార్బన్ డై ఆక్సయిడ్ ఉద్గమనం” కంచంలో వేడి వేడిగా వడ్డించాము. ఎప్పుడు తిన్నారో పాపం. ఎండన పడి వచ్చారు…కొంచెం తిని పోదురూ…!

(ఊర్జా అంటే శక్తి, ఇంధనం… శక్తి దాత, శక్తి ప్రదాత; ఇంధనదాత, ఇంధన ప్రదాత అంటే అయిపోయేదిగా…)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్