చరిత్ర అంటే కేవలం రాజుల జైత్రయాత్రలు కాదు. రాజ్యాల సరిహద్దులు కాలక్రమంలో మారిపోతాయి. కానీ మనిషి వేసిన అడుగుజాడలు మాత్రం కాలం గుండె మీద చెరగని గుర్తులుగా మిగిలి ఉంటాయి. రాయి మౌనంగా ఉన్నంత సేపు అది శిలే. అదే రాయి తన గతాన్ని గుర్తుచేసుకుంటే అది చరిత్ర చెక్కిన శిల్పమవుతుంది. ఆ శిల్పంలో మనిషి ఉంటాడు; అతడికి సంబంధించి సమస్తమూ ఉంటుంది. అటువంటి శిల్పాల అంతరంగాన్ని తవ్వితీసిన అద్భుతమైన ప్రయత్నమే ఈ పుస్తకం.

ధరణికోట – నిశ్శబ్ద విశ్వవిద్యాలయం
ధరణికోట అంటే కేవలం ఒక మట్టి దిబ్బ పేరు కాదు. రెండు వేల ఏళ్ల క్రితం ప్రపంచానికి నాగరికత పాఠాలు నేర్పిన ఒక నిశ్శబ్ద విశ్వవిద్యాలయమది. శతాబ్దాల పాటు మట్టిలో నిద్రపోయిన అమరావతి స్థూప శిల్పాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రపంచ కళాజగత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ అవి అప్పుడే పుట్టిన కళ కాదు. గోదావరి అలలమీదుగా బావరి ద్వారా బౌద్ధ పరిమళం తెలుగు నేలకి చేరిన క్షణంనుంచే ఈ కళ పుష్పించింది. బుద్ధుడు జీవించి ఉన్న కాలంలోనే తెలుగు నేల బౌద్ధాన్ని విశాలహృదయంతో అక్కున చేర్చుకుందనడానికి ఈ శిల్పాలే సజీవ సాక్ష్యాలు.
నాగార్జునకొండ – మట్టిలో దాగిన మహాచైత్యం
నాగార్జునకొండలో మట్టిలో కలిసిపోయిన మహాచైత్యం బయటపడటానికి శతాబ్దాలు పట్టింది. కాలం కప్పిన తెరను తొలగించుకున్న తర్వాతే ఆ శిల్పాలు మళ్లీ పలికాయి. అప్పుడు గాంధార, మధుర శైలుల కంటే అమరావతి శైలి ఎందుకు ప్రత్యేకమో మనకు తెలిసింది. అది కేవలం శిల్ప శైలి కాదు, అది మనిషిని చూసే దృష్టి. అందుకే అమరావతి శిల్పాలు మౌనంగా ఉన్నా మాట్లాడుతూనే ఉంటాయి.

ప్రపంచ కళకు ఊపిరి పోసిన అమరావతి శైలి
అజంతా గుహల గోడలపై కనిపించే జీవం, ఎల్లోరా శిల్పాల్లో దాగిన లయ, చైనా–టిబెట్ దేశాల బౌద్ధ కళలో కనిపించే ఊపిరి-
వీటన్నిటికీ మూలం మన ధరణికోట శిల్పులే.
ఇది ప్రాంతీయ గర్వం కాదు. ఇది చరిత్ర రాసిన అక్షర సత్యం. అమరావతి శైలి సౌందర్యాన్ని మాత్రమే కాదు, కరుణను, మానవత్వాన్ని కూడా చెక్కింది.
శిల్పాల్లో కనిపించే మనిషి
ఈ పుస్తకంలో మనకు కేవలం రాళ్లు కనిపించవు. సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్తుంటే కంటక్ గుర్రం కళ్లలో కన్నీటి చుక్క కనిపిస్తుంది. ఆనాటి పల్లెటూరి మనిషి కరుణ కనిపిస్తుంది. బుద్ధుడు దేవుడిగా కాదు, మనిషిగా నిలబడి ఉన్న రూపం ఈ శిల్పాల గుండెల్లో ఉంది. అందుకే ఇది ఆరాధన కోసం కాక అర్థం చేసుకోవడానికి పుట్టిన కళ.

పరిశోధనగా మారిన తపస్సు
మనకు దొరకని ముప్పైకి పైగా శిల్పాలు, అరుదైన డ్రాయింగ్స్, ఫోటోలు, మ్యాపులను ఒకచోట చేర్చడం అంటే చిన్న పని కాదు- ఒక తపస్సు. ఈ పుస్తకం శిల్పాలను చూపించడమే కాదు, వాటి వెనుక దాగిన గాథలను నిశ్శబ్దంగా చెబుతుంది.
పుస్తకం కాదు – ఒక ప్రయాణం
ఈ పుస్తకాన్ని చదవడమంటే పేజీలు తిప్పడం కాదు- ధరణికోట వీధుల్లో నడవడం; నాగార్జునకొండ నిశ్శబ్దంలో నిలబడి శిలల వెనుక దాగిన మనిషిని పలకరించడం.
పున్నా కృష్ణమూర్తి తెలుగు జర్నలిజం, ఫొటోగ్రఫీ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి. దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. వార్తా సేకరణ, విశ్లేషణలో తనదైన ముద్ర వేశారు. కేవలం వార్తలకే పరిమితం కాకుండా, సమాజంలోని వివిధ అంశాలపై లోతైన విశ్లేషణలతో వ్యాసాలు, పుస్తకాలు రచించారు. సామాజిక స్పృహ కలిగిన రచయితగా ఆయనకు పేరుంది. క్లిష్టమైన విషయాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాయడం ఆయన ప్రత్యేకత.

- “ధరణికోట- నాగార్జునకొండ శిల్పసంపదల సచిత్ర వ్యాస సంకలనం”
- రచయిత, ప్రచురణకర్త- పున్నా కృష్ణ మూర్తి
- 125 పేజీలు
- వెల- రూ. 1500/-
- ప్రతులకు- 7680950863
-పమిడికాల్వ మధుసూదన్
9989090018

