Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచింత చచ్చినా... పులుపు చావదు

చింత చచ్చినా… పులుపు చావదు

Dynasty & Dispute: రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. రాచరికం పోయి మన చేత, మనకోసం, మన వలన, మన యొక్క, మనకున్, మనమే ఎన్నుకునే ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. “ప్రజలే ప్రభువులు- పాలకులు మన సేవకులు” లాంటి వింటే ఒళ్లు పులకించిపోయే ఎన్నెన్నో ప్రజాస్వామిక సర్వసమానత్వ భావనల కొటేషన్లతో ప్రజాస్వామ్య భవనాన్ని మనసుల్లో ప్రతిష్ఠించుకున్నాం. బయట అలాంటి భావనలకు అనుగుణంగానే పార్లమెంటు భవనాలను నిర్మించుకున్నాం. గట్టిగా పదికాలాలు నిలబడాలని పార్లమెంటులో అడుగడుగునా, చుట్టూ స్తంభాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్తంభాల మీద, మధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రతీకాత్మకంగా, ప్రత్యక్షంగా పదిలంగా ఉందని ధైర్యంగా ఉన్నాం.

“ఉన్నది మనకు ఓటు-
బతుకు తెరువుకే లోటు”

“పేరుకు ప్రజలది రాజ్యం-
పెత్తందార్లదే భోజ్యం”

అని అంత్యప్రాసలతో కవులు ఎంతగా పెదవి విరిచి కవితాగానం చేసినా…
ఈ ప్రజాస్వామ్యానికి మించిన గొప్ప ప్రత్యామ్నాయం లేదు. రాదు. లోపాలను సవరించుకుంటూ ప్రజాస్వామ్య భారతం వేసిన అడుగులు, ఇంతదాకా చేసిన ప్రయాణం చిన్నది కాదు. మనతోపాటి పుట్టిన పాకిస్థాన్ ప్రజాస్వామ్యం ఎలా అఘోరిస్తోందో చెప్పాల్సిన పనిలేదు.

ఎంతగా ప్రజాస్వామ్యం పాదుకుని, బలపడినా…
మన అంతరాంతరాల్లో రాజులమీద వల్లమాలిన అభిమానం గూడుకట్టుకుని ఉంటుంది. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆ నిగూఢ అభిమానం తీగసాగి, పూలు పూచి, కాయలు కాచి, పండ్లు పండి బండ్లకెత్తుకోవాల్సినంతగా బయటపడుతూ ఉంటుంది.

ఈ విషయంలో గ్రేట్ బ్రిటన్ మరీ దారుణం. అక్కడ ఉన్నది ఎన్నికయిన ప్రభుత్వమే. కానీ యునైటెడ్ కింగ్డమ్ పేరుకు తగ్గట్టు ఇంకా కింగ్ డం- రాచరికం అలాగే ఉంది. రాణి- రాజుల ముందు బ్రిటన్ మోకాళ్ళ మీద కూర్చునే ఉచిత ప్రాథమిక నిర్బంధ నిర్నిరోధ మర్యాదల ప్రదర్శనలతో పోలిస్తే…భారత్ కోట్ల రెట్లు నయం.

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఆ మధ్య హైదరాబాద్ ఎనిమిదో నిజాం మనవడు విదేశంలో కన్నుమూశారు. (కొన్ని సందార్భాల్లో “డు” ఏకవచనం సరయినదా? “రు” బహువచనమే వాడాలా? అని పాటలు కూడా రాసే ఒక జర్నలిస్ట్ మిత్రుడు లోతయిన ప్రశ్న వేశాడు. ఆ సంగతి తరువాత ఎప్పుడయినా చర్చించుకుందాం).
తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిజాం వారసుడి అంత్యక్రియలను నిర్వహించింది.

Nizam Dynasty

భారతదేశం మొత్తానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ ను దేశంలో కలపని నిజాం వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఏమిటి? అని సహజంగానే ప్రశ్నించాల్సిన వాళ్లు ప్రశ్నించారు. ఇప్పటికీ హైదరాబాద్ విలీనమా? విమోచనమా? తెలియక భాషాశాస్త్రవేత్తలు, పద వ్యుత్పత్తి వ్యాకరణ పండితులు, రాజకీయనాయకులు, సమాజ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు తలలు బాదుకుంటున్నారు.

ఇలాంటి వేళ ఒక పత్రికలో నిజాం వారసుడికి సంబంధించిన ఒక లీగల్ నోటీసు భలే విచిత్రంగా అనిపించింది. అది కూడా చిక్కటి తెలుగులో ఉంది.

“ఎనిమిదో నిజాం వారసుడిగా ఎవరు పడితే వారు చెప్పుకుంటున్నారు. నిజాం ఆచారాల ప్రకారం పెద్ద కొడుకే నిజాం సంస్థానానికి అధిపతి అవుతాడు” అంటూ ఎస్టేట్ ఆఫ్ ది నిజాం కార్యాలయం, చౌమహల్లా ప్యాలెస్, హైదరాబాద్ తరఫున ఒక న్యాయవాది ఇచ్చిన నోటీసు ఇది. అందులో ఉన్న నాలుగుపేరాల్లో కనీసం అయిదు చోట్ల “రాజవంశం ప్రతినిధి” అని ఉంది. ఈ న్యాయవాది ఉద్దేశం నిజాం వంశ నిజమయిన ప్రతినిధి, వారసుడు లేదా నిజాం సంస్థాన ఉత్తరాధికారి అయి ఉంటుంది. పదే పదే రాజవంశం అంటూ…నిజాము మనవడిని సామాన్య ప్రజలయిన మనమింకా రాజుగానే గుర్తించి నెత్తిన పెట్టుకోవాలని కోరుకుంటున్నట్లుగా ఉంది ధ్వని.

“More loyal than king-
రాజును మించిన విధేయుడు
లేదా
రాజును మించిన రాజభక్తి”

సామెతలు గుర్తొస్తున్నాయా?

ఏయ్!
ఎవర్రా అక్కడ?
అబిడ్స్ రోడ్లు ఖాళీ చేయండి…
హిజ్ హైనెస్…హై హిల్స్ చెప్పులేసుకుని…జూబ్లీ హిల్స్ నుండీ…బంజారా హిల్స్ మీదుగా ఎనిమిదో నిజాం ముని మనవడి ముని ముని మనవడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ…వడి వడిగా వస్తున్నాడు…
పక్కకు తప్పుకోండి యువర్ లోనెస్!

Nizam Dynasty

స్టేట్
ఎస్టేట్
రియలెస్టేట్
అన్నిట్లో స్టేటే ఉంది. ఇప్పుడీ ప్రకటనలో నిజాం ఎస్టేట్ ను ఎలా అర్థం చేసుకోవాలో! ఏమో!

“ఓ నిజాము పిశాచమా!”
అన్న తెలంగాణ కోటిరాతనాల వీణ దాశరథి ఎక్కడున్నాడో…పిలవండి!
ఆయనయితే తీగలు తెంచి అగ్నిలో వేసి ఖచ్చితంగా అర్థ తాత్పర్యాలు చెబుతాడు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

గవర్నర్ కు అక్షరాభ్యాసం

Also Read :

ఈ ఆకలి తీరనిది

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్