నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మన జీవనశైలిలో ఒక భాగమైపోయింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు దాహం వేస్తే వెంటనే ప్లాస్టిక్ బాటిల్ కొనడం మనకు అలవాటు. అయితే, మనం చేసే ఈ చిన్న పొరపాటు మన ప్రాణాల మీదకు తెస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా ఎండలో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఎండలో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీరు విషతుల్యంగా మారుతుందని, ఇది నేరుగా మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎండలో ఉంచిన బాటిల్ ఎందుకు ప్రమాదకరం?
ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేయడానికి వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ బాటిళ్లను ఎండలో లేదా కారులో వదిలేసినప్పుడు, సూర్యరశ్మిలోని వేడికి ప్లాస్టిక్ కరిగి ‘మైక్రోప్లాస్టిక్ కణాలు’ (Microplastics)నీటిలో కలుస్తాయి.
- మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం: మనం ఆ నీటిని తాగినప్పుడు, ఆ సూక్ష్మ కణాలు రక్తంలో కలిసి నేరుగా ఊపిరితిత్తులకు చేరుతాయి.
- లంగ్ క్యాన్సర్: ఈ కణాలు ఊపిరితిత్తులలో పేరుకుపోయి కాలక్రమేణా కణజాలాన్ని దెబ్బతీస్తాయి, ఇది లంగ్ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
ప్రాణాంతకంగా ఊపిరితిత్తుల వ్యాధులు:-
భారతదేశంలో ప్రస్తుతం మరణాలకు ప్రధాన కారణాల్లో ఊపిరితిత్తుల వ్యాధులు రెండో స్థానంలో ఉండటం కలచివేసే నిజం. పెరుగుతున్న వాయు కాలుష్యం, ధూమపానం, మనం తెలియకుండా తీసుకునే ఇటువంటి మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది.
ఐఐటీ హైదరాబాద్‌లో కొత్త ప్రయోగాలు:-
ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారికి ఒక తీపి కబురు కూడా ఉంది. జర్మనీకి చెందిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ లంగ్ హెల్త్’భాగస్వామ్యంతో ఐఐటీ హైదరాబాద్‌లో ప్రత్యేక ‘రీసెర్చ్ సెంటర్’ ప్రారంభమైంది.
- మూలకణాలతో కొత్త ఊపిరితిత్తులు: ఇక్కడ శాస్త్రవేత్తలు మూలకణాల (Stem Cells) ద్వారా కృత్రిమ ఊపిరితిత్తులను సృష్టించే దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.
- రాబోయే ఐదేళ్లలో మార్పు: మరో ఐదేళ్లలో ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి చిట్కాలు:-
వైద్యులు సూచించిన ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి:
- ప్లాస్టిక్ బాటిల్స్ మానేయండి: సాధ్యమైనంత వరకు స్టీల్ లేదా గాజు బాటిల్స్ ఉపయోగించండి. ఎండలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ నీటిని అస్సలు తాగకండి.
- శ్వాస వ్యాయామాలు: ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయండి.
- పరిశుభ్రమైన గాలి: మీ ఇళ్లలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోండి. వీలైతే ఇండోర్ ప్లాంట్స్ పెంచండి.
- కాలుష్యానికి దూరంగా: రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించడం అలవాటు చేసుకోండి.

