నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో అడుగుకో గుడి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినట్లున్నాయి. శ్రీశైలం ఆనకట్ట కడుతున్నప్పుడు దాదాపు 90 గ్రామాలను ఎత్తు ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ఒకటి, రెండు ఆలయాలను కూడా తరలించారు.
అలా కేంద్రప్రభుత్వ పురావస్తు శాఖ, రాష్ట్ర దేవాదాయ శాఖ కలిసి పునర్నిర్మించిన లలితా సోమేశ్వరస్వామి ఆలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఎంతగా నీరొచ్చినా ఇబ్బందిలేని ఎత్తులో కట్టారు. కాకపోతే అవే స్తంభాలు, అవే గోడల రాళ్లు, అవే విగ్రహాలు, అదే నిర్మాణ ప్రణాళికతో అలాగే కట్టారు. కాబట్టి వందల ఏళ్లకిందటి ఆలయం రూపు అలాగే ఉంది. దేశంలోని ప్రఖ్యాత 15 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఆయా పేర్లతో కొలువై ఉన్నాయి. ఏడో శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన ఆలయమిది. ఈ దేవుడిపేరుతోనే ఇక్కడ సోమశిల ఊరు ఏర్పడింది. భక్తులు కృష్ణ నీటితో జ్యోతిర్లింగాలను అభిషేకించడం ఇక్కడ ఆనవాయితీ.
సోమశిల ఊరి మొదట్లో పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయముంది. పాడుబడ్డ ఆలయాన్ని కొంత సరిచేసి నిత్య పూజలకు వీలుగా మలచినట్లున్నారు.
సింగోటం నరసింహుడు
కొల్లాపూర్ నుండి వనపర్తి వెళ్ళే దారిలో సింగోటం నరసింహస్వామి ఆలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. పక్కనే సింగోటం జలాశయం. గుడి ముందు ఆ నీరు కాలువలద్వారా పొలాలకు ప్రవహిస్తుంటే…నరసింహస్వామి కాళ్ళు కడిగి…పొంగి ప్రవహిస్తున్నట్లు అందమైన దృశ్యం ఆవిష్కారమవుతోంది. గుడి గోపురంపై పడమట వాలే సూర్యుడు, రోజంతా ఆకాశయానం చేసి…అలసి సాయంత్రానికి గుడి ముందు చెట్ల కొమ్మలకు చేరుతున్న పక్షులు, పక్షుల కువకువలకు తోడు దూకే నీటి గలగలలతో ప్రకృతి పాడే పరవశగీతం వింటూ సింగోటం నరసింహుడికి ప్రదక్షిణ చేసుకుని రాత్రికి సోమశిల చేరుకున్నాము.
నీటిలో మునుగుతూ…తేలుతూ సంగమేశ్వరుడు
సోమశిల ఊరికి దక్షిణాన రెండు కొండలు. మధ్యలో కృష్ణమ్మ. ఎడమవైపు కొండ వెనుక సంగమేశ్వరాలయం. సోమశిల ఊళ్ళోనుండి సంగమేశ్వరం కనిపించదు. బోటులో వెళ్ళాలి. అయితే సంగమేశ్వరం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. కాబట్టి తెలంగాణ బోట్లను సరిహద్దు గీత దగ్గర ఆపేస్తున్నారు. ఇలా జరుగుతుందని తెలిస్తే ఏడు నదులు కలిసే సంగమస్థలిలో కాకుండా సంగమేశ్వరుడు సరిగ్గా నీటిమీద రాసుకున్న సరిహద్దు గీతమిదే నిలుచుని ఉండేవాడు. అన్ని అహంకారాలు, అజ్ఞానాలు సంగమేశ్వరుడి చెంత వదిలేస్తే…ఆయన మనకేది కావాలో అది ఇస్తాడు. అలా ఎక్కడిస్తాడోనని ముల్లోకాల సరిహద్దులెరుగని ఆయన చుట్టూ సరిహద్దుల గీతలు గీచి…మన గట్ల పంచాయతీలనే ఆయనకూ అంటగట్టాము.
భక్తుడు భగవంతుడివైపు ఒకడుగు వేస్తే…భగవంతుడు భక్తుడివైపు వందడుగులు వేస్తాడు అంటుంది భక్తిశాస్త్రం. ఇక్కడ తెలంగాణవైపు భక్తులు వెయ్యి అడుగులు వేసినా…సంగమేశ్వర భగవంతుడు ఒక్కడుగు కూడా వేయకుండా రెండు రాష్ట్రాల టూరిజం శాఖలు గట్టిగా బందోబస్తు చేసినట్లున్నాయి.
సంగమేశ్వరాలయానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. పురాణ ప్రాశస్త్యముంది. ఏడు నదుల సంగమ తీర్థమిది. శ్రీశైలం డ్యామ్ నిండేకొద్దీ ఆలయం మునిగిపోతూ ఉంటుంది. సంవత్సరంలో వేసవిలో మూడు లేదా నాలుగు నెలలుమాత్రమే బయటికి కనిపిస్తుంది.
హైదరాబాద్ నుండి సోమశిలకు మూడున్నర గంటల ప్రయాణం. ప్రభుత్వ పర్యాటక శాఖ హరితతో పాటు అనేక ప్రయివేటు రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. స్థానికులు కూడా వారిళ్ళమీద రూములు కట్టించి…ఏ సీ లు పెట్టి అద్దెలకిస్తున్నారు. ఒకరోజుకు వెయ్యి రూపాయనుండి ఎనిమిది వేలవరకు రకరకాల రూములు అందుబాటులో ఉన్నాయి. కృష్ణాలో విహారానికి పెద్ద బోట్లు, నలుగురైదుగురు మాత్రమే వెళ్ళగలిగిన స్పీడ్ బోట్లు ఉన్నాయి. బోట్లలో మనిషికి రెండొందలదాకా తీసుకుని అరగంట తెలంగాణ జలాల్లో మాత్రమే తిప్పి దింపుతున్నారు. శని, ఆదివారాలు పర్యాటకుల తాకిడి ఎక్కువ. శ్రీశైలం జలాశయం నిండినప్పుడు సోమశిల అందమే అందం. ఆ బ్యాక్ వాటర్ సోమశిల హోటళ్ళ బాల్కనీలదాకా వస్తుంది. ఆ దృశ్యం చూడాలనుకున్నవారు జులై- డిసెంబరు మధ్య వెళ్ళడం మంచిది.
కృష్ణా తరంగాలు-1
“సోమశిల అందాలు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు