Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమన ఒలింపిక్స్ వేరు

మన ఒలింపిక్స్ వేరు

Games-Politics: 2036 ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించడానికి బిడ్ లో పాల్గొననున్నట్లు క్రీడా మంత్రి ప్రకటించినట్లు ఒక వార్త. సంతోషం.

క్రీడా అసోసియేషన్లు రాజకీయ నాయకుల చేతుల్లో ఆటబొమ్మలై…ఆటలు తప్ప మిగతా పనులకు మాత్రమే ఎలా పనికి వస్తున్నాయో వివరిస్తూ మరొక వార్త. దుఃఖం.

ఓలింపిక్స్ ఆటలకు అంతర్జాతీయ ప్రమాణాలు, విధి విధానాలు, మెడల్స్ గెలవడానికి కఠోర సాధన, ఓడినా కుంగిపోని పట్టుదల, శారీరక బలం, క్రీడా నైపుణ్యం, మెళకువలు ఎన్నో ఉండాలి. అవి మనకు లేక కాదు. మనకు వేరే ఆటలు ప్రాణం కంటే ఎక్కువ.

చదువుల ఆట (Study game):  పుట్టినవారికి చదువులు తప్పవు. అట్టి నిశ్చయమయిన చదువుల గురించి చింతించి ప్రయోజనం ఉండదు. చదువు ఒక చంపుడు పందెం ఆట. ఏటా పదమూడు వేల ఐ ఐ టీ సీట్లకు పదిహేను లక్షల మంది పరుగు పెడితే అది అక్షరాలా మానవ జాతి చరిత్రలోనే మహోన్నత మారథాన్ పరుగు. ఇది అలుపూ సొలుపూ లేని ఆటే అయినా క్రీడా చరిత్రకెక్కని చైతన్యం; నారాయణం. నడక రాకముందే పలక పడుతున్న బాల్యానిది ఒక ఆటే. పలకలేకపోయినా పట్టుబట్టి పలికింపజేస్తున్న బాల్యానిది ఒక ఆటే. ఆటపాటలు మరచి తరగతి గదుల్లో బందీ అయిన బాల్యపు చదువులతో విధి ఆడిన వింత ఆట. చదువుల తల్లి సరస్వతి కూడా అర్థం కాక తలపట్టుకున్న ఆట.

గ్రీన్ కార్డ్ ఆట (Green Card Game):  మనిషిగా పుట్టినవారు అమెరికాలో ఎమ్మెస్ చేస్తేనే చదువుకున్నట్లు. ప్రహ్లాదుడు చెప్పినట్లు చదువులలోని మర్మమెల్లా చదువుకున్నట్లు. అక్కడ రంగుల లోకంలో బతకడానికి విజిటింగ్ వీసా, స్టూడెంట్ వీసా, హెచ్ వన్ బి, వర్క్ వీసా, టెంపొరరి వీసా….చివర గ్రీన్ కార్డ్ శాశ్వత పౌరసత్వ పచ్చటి బతుకు. ఇదంతా లక్షల, కోట్ల ఆట. ప్రవాస స్వప్నాల వెంట పరుగులు తీసే ఆట. కాలు నిలువనివ్వని ఆట.

సినిమాల ఆట (Film Game): సినిమాకు గ్రామీణ వ్యవహారంలో ఆట అనే మాట దశాబ్దాలపాటు వాడుకలో ఉండేది. ఆట మొరటుగా అనిపించి ఫిలిం, సినిమా అయ్యింది. సినిమాలో తెర వెనుక అడుగడుగునా ఆటలే. నిర్మాతను అందరూ ఒక ఆట ఆడుకుంటారు. హీరోకు ఆట రాకపోయినా అందరి ఆటలో కాలు పెడతాడు. దర్శకుడు సంగీతంతో ఆడుకుంటాడు. గాయకులు సాహిత్యంతో ఆడుకుంటారు. సంగీతం మన చెవులతో ఆడుకుంటుంది. సినిమా సైకో ఫ్యాన్స్ జీవితాలతో ఆడుకుంటుంది. తారలు తారాపథాన్ని దాటి యానిమేషన్ అభూతకల్పనల అంతరిక్షంలో ఆడుకుంటాయి. యుద్ధసీమ మధ్యలో కట్టప్పలు చెప్పగా…బాహుబలుల మేధో మథనానికి పదునుపెట్టగా…రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల ఈతచెట్లు ఫెళఫెళమని సహజగుణంతో విరగక ఒద్దికగా రబ్బరులా వంగి విల్లులై మానవబాణాలను సంధించే ఆర్చరీ ఆటలవుతాయి. ఒలింపిక్స్ ను దాటి రెండు వేళ్లతో వదిలిన మూడు బాణాలై ప్రపంచమంతా అన్ని భాషలకు గురి తప్పకుండా తగులుతాయి.

రాజకీయాల ఆట (Political Game): రాజకీయం అక్షరాలా రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక క్రీడ. త్రేతాయుగంలో మరురోజు సూర్యుడు ఉదయిస్తే రాముడికి పట్టాభిషేకం అనగా…అలిగి దశరథుడితో ఆ పట్టాభిషేకాన్ని క్యాన్సిల్ చేయించిన కైకేయి నుండి నిన్నటి యెడియూరప్ప దిగలేక దిగలేక దిగి బసవరాజుకు కుర్చీ ఇచ్చిన ఉదంతం దాకా యుగయుగాలుగా రాజకీయం ఆటే.

టీ వీ ఆట (Television Game):   ఓంకార్ లాంటివారు మాత్రమే టీ వీ ల్లో గేమ్ షోలు చేస్తుంటారు. మిగతావారు చూస్తుంటారు అనుకుంటే పొరపాటు. కృతయుగానికి ముందు బ్రహ్మ మనుషులను సృష్టి చేసినప్పుడు అత్తకు అగ్గిపెట్టబోయిన కోడలి చేతిలో పుల్లకు ఇంకా అగ్గి రాజుకోనేలేదు. ఈలోపు ఎనిమిది కోట్ల ఎపిసోడ్లు ఎలా అయిపోయాయో తెలియకుండా ఇంట్లో అత్తా కోడళ్లు అవే సీరియళ్లను అలాగే కళ్లప్పగించి పవిత్ర భావంతో, ఉత్సాహంతో, ఉద్విగ్నంగా, ఉద్రిక్తంగా చూస్తూ ఉండడం ఒక ఆట. వెకిలి టాస్క్ లతో ఫ్యామిలీ గేమ్ షోలు ఒక ఆట. టీ వీ ల్లో పాటల పోటీలు ఒక ఆట. న్యూస్ ఛానెళ్లది ఎంత చూసినా చూడాల్సింది ఇంకా ఎంతో మిగిలిపోయే ఆట. డిజిటల్ మీడియాది సరిహద్దులు చెరిపిన ఆట.

వర్చువల్ ఆట (Virtual Game):  తల్లి కడుపులో కదిలే పిండం కూడా బయటపడి ఎప్పుడెప్పుడు సెల్ ఫోన్ పట్టుకుందామా? అని తహతహలాడుతూ ఉంటుంది. వీడియో గేమ్స్ ఆడాలని ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. ఎండపొడ తగలకుండా, కాలికి దుమ్ము తగలకుండా ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఆడే వర్చువల్ గేమ్స్ ఒలింపిక్స్ లో ఉంటే మన పిల్లలకే అన్ని మెడల్స్.

కులమతాల ఆట (Caste and Religion Game):  ఇది పబ్లిక్ గా మాట్లాడే ఆట కాదు. అందరికీ తెలిసినా, అందరూ ఆడుతున్నా, ఎవరికీ తెలియనట్లు, ఎవరూ ఆడనట్లు నటించే ఆట. రాజకీయాలకు ప్రాణప్రదమయిన పరమ ప్రామాణికమయిన ఆట.

సరిహద్దుల ఆట (Border Game):  అన్నదమ్ముల పొలం గట్ల పంచాయతీ నుండి రాష్ట్రాలు, దేశాల సరిహద్దుల ఆట జగద్విదితం. తెలియకపోతే తాజాగా కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులకు వెళ్లి ప్రత్యక్షంగా తెలుసుకోండి.

మైండ్ గేమ్ (Mind Game):  అందరికీ మైండ్ ఉంటుంది కానీ…అందరూ మైండ్ గేమ్స్ ఆడలేరు. వంద ఒలింపిక్స్ కట్టగట్టుకుని ఒకేసారి వచ్చినా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఆట- మైండ్ గేమ్.

మనీ గేమ్ (Money Game):  మాల్యాలు, నీరవ్ మోడీల మనీ గేమ్స్ ప్రత్యక్ష ప్రసారాల్లో చూడగలుగుతున్నాం కానీ- ప్రపంచం కన్ను పడకుండా ఎందరో మనీ గేమ్స్ ఆడుతుంటారు. వీరు గోల్ వేస్తారు. బ్యాంకులు దివాలా తీస్తాయి. వీరు బ్యాట్లతో కొడతారు. బ్యాంకులు ఓడిపోతాయి. చివరికి వీరు దాగుడుమూతల ఆటలోకి దిగుతారు. గోచీ గుడ్డ కూడా మిగలక బ్యాంకులు దాక్కోవడానికి దిక్కులకు పరుగెడతాయి. చివరకు మొహం చెల్లక బ్యాంకులు సిగ్గుతో దాక్కుని, దాగుడుమూతల ఆటలో ప్రత్యర్థులను తప్పనిసరిగా గెలిపించాల్సి వస్తుంది.

దొంగాట (Thieves Game):  దొంగాట మాటకు సమాసం ప్రకారం రెండు అర్థాలు వస్తాయి. ఒకటి- దొంగలు ఆడే ఆట. రెండు- దొంగలు కాకపోయినా మామూలువారు దొంగల్లా ఆడే ఆట. అంటే మోసపు ఆట.

దివాలా ఆట (I P Games):  భారతదేశంలో ఈ ఆట మీద ఎందరికో పేటెంట్ ఉంది. ఇలా దివాలా తీసి ఐ పి పెట్టినవారు రాజకీయాల్లో చేరి కేంద్ర ఆర్థిక మంత్రి పక్కన కూర్చుని ఐ పి పెట్టేవారితో ఎలా జాగ్రత్తగా ఉండాలో బ్యాంకులకు బాధ్యతగా సలహాలు ఇస్తుంటారు.

విలాసాల ఆట (Luxury Games): ఇది సంపన్నులకు మాత్రమే. విలాసమే విలాసం లేనిదయ్యేంత విలాసంగా ఉంటాయి వీరి ఆటలు.

కుట్రల ఆటConspiracy Games: ఆటలో కుట్రలు బయటికి కనపడవు. కుట్రలే ఒక ఆటగా ఆడేవారు ఆ ఆటలో నైపుణ్యం సంపాదించుకుని…ఎదుటివారు వారి కుట్రలను పసిగట్టలేనంత మెళకువగా ఆడుతూ ఉంటారు.

తొండాట (Foul Game): ఒలింపిక్స్ లో తొండాట ఉండి ఉంటే భారతదేశం నుండి హీనపక్షం కోటి మంది క్రీడాకారులు పోటీ పడేవారు. తొండాటను ప్రొఫెషనల్ గా నేర్పాల్సిన పనిలేదు. సహజంగా అబ్బుతుంది. పెట్టుబడి లేదు. కఠోర సాధన అనవసరం.

పేక ముక్కలాట (Playing Cards): సప్త మహా వ్యసనాల్లో జూదం అనాదిగా ఉంది. చేతికి ముక్కలు దొరకాలే కానీ- ఆట రాదని, ఆడలేనని అనేవారు ఉండరు.

బతుకు ఆట Life Game): భారతదేశంలో ముప్పాతిక శాతం జనాభాకు బతుకు నిత్య క్రీడ. గెలుపు నీడ పడకపోయినా ఆడుతూనే ఉంటారు. మెడల్స్ రానే రావని తెలిసినా ఆడుతూనే ఉంటారు. ఓడిపోతామని తెలిసినా ఆడుతూనే ఉంటారు. బతకడానికి బరిలో గిరిగీసి ఆడుతూనే ఉంటారు.

దేవుడి ఆట (Gods must be crazy):మన కళ్ళ ముందు కనిపించే ప్రపంచం ఒక మాయ. మిథ్య. అద్దంలో ప్రతిబింబం. అసలు కాదు. ప్రతిబింబాన్నే అసలు అనుకుంటున్నామని అసలు తెలిసినవారు చెబుతూ ఉంటారు. ఇదో విచిత్రమయిన భావనాత్మక క్రీడ. దీనికి ప్లే గ్రౌండ్ మనసు. ప్లేయర్ మెదడు. ప్లే కల్పన. ఇదొక దేవుడి ఆట.

(పాత కథనం. కొన్ని మార్పులు, చేర్పులతో)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్