Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకలిసి తింటే కలదు సుఖము

కలిసి తింటే కలదు సుఖము

ఇంట్లో వారందరూ కలిసి కూర్చుని ఒకేసారి తింటే ఆరోగ్యమని బ్రిటన్ లో ఒక పరిశోధన తేల్చింది. ఇంగ్లీషు వాడు చెబితేనే ఏదయినా మనం వింటాం కాబట్టి- అందరూ కూర్చుని ఒకేసారి తినడంలో ఉన్న సౌలభ్యమేమిటో ఆలోచించాలి. నిజానికి భారత దేశంలో మొన్నటిదాకా అన్ని ప్రాంతాల్లో ఇలా తినడమే ఉండేది. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. అర్బన్ లైఫ్, వేగం, ఉద్యోగాల ఉక్కిరి బిక్కిరి, డైనింగ్ టేబుళ్ల నాజూకు, టీవీ చూస్తూ, సెల్ మాట్లాడుతూ తినడం లాంటి వాటి వల్ల తింటున్నదేమిటో తెలియదు. తిన్నది వంటబట్టదు.

“అమృతమస్తు” అని అనుకుని తినడం మన సంప్రదాయం. అంటే తింటున్నది అమృతం అగుగాక అని తింటున్నాం. వంటకు మంట వెలిగించేప్పుడే ఒక దైవకార్యానికి పని మొదలు పెడుతున్నంత పవిత్రంగా భావించిన రోజులనుండి శరణార్థులకు స్విగ్గీ ఆహార పొట్లాలదాకా మన ఆహార ప్రయాణం చిన్నది కాదు. బ్రిటన్ పరిశోధనతో మనం విభేదించాల్సిన పనిలేదు కానీ- ఆచరణలో మనకు కొన్ని చిక్కులున్నాయి.

దయ్యాలు నెయ్యాలతో కయ్యాలు పెట్టుకునే గబ్బిలాల పురుషుల, సాలీడు పురుషోత్తముల విరోచితగాథలు చూస్తే తప్ప మన పిల్లలు నోట్లో ముద్ద పెట్టుకోలేరు. అత్తా కోడళ్లు కొట్టుకునే సీరియళ్లను అత్తా కోడళ్లు కొట్టుకుంటూ చూస్తేనే అన్నం తినగనలరు. క్రికెట్ మ్యాచ్ వస్తుంటే మ్యాచ్ చూస్తూ తినాలి. సరిగ్గా భోజనం దగ్గరే ఆలుమగలు గొడవపడి రుసరుసలాడుతూ విసవిస మెతుకులు మింగాలి. మరీ అర్జెంటు పనులున్న పెద్దవారు కారులో వెళుతూ- ఎవరూ లేని అనాథలా కారు వేగానికి అనుగుణంగా తినాలి. ఇంకా సంపన్నులు గాల్లో విమానంలోనే తిని గాల్లోనే తిరుగుతూ ఉండాలి. పనిలేకపోయినా అర్ధరాత్రి దాకా ఊరిమీదపడి తిరిగి ఇంటికొచ్చి ఫ్రిడ్జ్ లో సాంకేతికంగా పాచి ముద్ర పడని పాత పదార్థాన్ని దొంగలా తినాలి. వీకెండ్, సెలవులు, ఇంట్లో శుభ కార్యాలు జరిగితే ఇంట్లో వండినది తినడం మహాపరాధం. నామోషి. బయట హోటల్లో కృతయుగారంభానికి ముందు బ్రహ్మ లోకాలను సృష్టి చేసిన రోజు వండి ఫ్రిడ్జ్ లో పెట్టినది మనకు క్యాండిల్ లైట్ లో వడ్డిస్తే ఆ రుచే రుచి!

కొంతలో కొంత కరోనా వల్ల ఇంటి భోజనం, ఇంటి రుచులకు విలువ పెరిగింది. భారతీయ సంప్రదాయ వంటింటి దినుసులు ఇంగువ, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, వెల్లుల్లి, శొంఠి, కరివేపాకు, కొత్తిమీర, పుదినా, యాలకులు, లవంగాలు అద్భుతమయిన ఔషధాలని ఇన్నాళ్లకు జనం నమ్ముతున్నారు. దేవుడికన్నా దెబ్బే గురువు. రేప్పొద్దున ఇంట్లో అందరూ కూర్చుని ఒకేసారి తింటూ ఆనందంగా, ఆరోగ్యంగా గడిపే రోజులు కూడా మళ్లీ రావచ్చు. రావాలి.

(పాత వ్యాసం)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్