Padma Awards : అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే…వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను కూడా పూర్తి చేయలేం.
ఎప్పుడయినా, ఎవరికయినా గుర్తింపు ముఖ్యం. ప్రశంస, అభినందన, సన్మానం, పదోన్నతి, నగదు బహుమతి, బిరుదు ప్రదానం...అన్నీ గుర్తింపులో ప్రధానమే.
అవార్డులు ఎన్ని రకాలు? ప్రభుత్వ, ప్రయివేటు అవార్డులు గ్రహించడానికి (గ్రహించడం మాటకు వ్యుత్పత్తి అర్థం ‘తీసుకోవడం’ అనే పాజిటివ్ మీనింగ్ తో పాటు ‘లాక్కోవడం’ అనే నెగటివ్ మీనింగ్ ఉండడం ఇక్కడ అనవసరం) అర్హతలు ఏమిటి? పనిచేస్తే వాటంతటవే వచ్చే అవార్డులు; పైరవీలు చేసుకుంటే వచ్చే అవార్డులు; డబ్బు ఖర్చు పెట్టుకుంటే వచ్చే అవార్డులు; భావజాల అవార్డులు, రాజకీయ అవార్డులు; సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని కొన్ని విద్యలతో తెచ్చుకునే అవార్డులు…ఇలా అవార్డుల స్వరూప స్వభావాలు, వాటిని పొందే పద్ధతుల మీద అవార్డుల కోసం ప్రయత్నించేవారికి జ్ఞానం ఉన్నట్లే ఆయా అవార్డులు వారికి ఎలా వచ్చాయో అన్న స్పష్టత లోకానికి కూడా ఉంటుంది.
అవార్డులు ఎంతో విలువయినవి. అందువల్ల చాలా సార్లు అవార్డులకు విలువ చెల్లిస్తూ ఉంటారు. ఇంతకంటే లోతుగా వెళ్లడం భావ్యం కాదు.
మనం రోడ్డు మీద వెళుతుంటే మన ఎదురుగా వాహనాల నంబరు ప్లేట్ల మీద:-
President
International Human Rights Mission
Chairman
National welfare advisory commission
Member
Telecom Users Welfare association
అని ఎర్రటి స్టిక్కర్ల మీద తెల్లటి అక్షరాల్లో కనిపిస్తూ ఉంటుంది. హైవే మీద గంటల కొద్దీ కారు ప్రయాణం బోర్ కొట్టకుండా వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇలాంటి శాఖలు, సంస్థలు ఉన్నాయేమో అని గూగుల్లో వెతుకుతూ ఉంటాను. ఇప్పటిదాకా నాకు ఎదురయిన ఒక్క హోదా కూడా గూగుల్లో దొరకలేదు. స్థూలంగా- విశ్వమానవ శ్రేయస్సు కోరుకునే ఎవరయినా ఇలా పెట్టుకోవచ్చు.
అలాగే- బిరుదులు కూడా ఒకరు ఇవ్వకపోయినా మనకు మనమే పెట్టేసుకోవచ్చు. ఇంటిపేరు కంటే ఘనంగా వాటిని ముందు తగిలించుకోవచ్చు. కీర్తి కిరీటాలు, భుజ కీర్తులు, ముంజేతి కంకణాలు, పాదుకా పట్టాభిషేకాలు, గజమాలలు, దుశ్శాలువలు, గజారోహణలు, సన్మాన పత్రాలు, పుష్పాభిషేకాలు అనాదిగా ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. ఇందులో అక్కడక్కడా స్వరూపం మారుతుంది కానీ…స్వభావం మాత్రం మారదు.
గౌరవ డాక్టర్లు పెరిగే సరికి అసలు డాక్టర్లు తమను తాము ఎలా పిలుచుకోవాలో మరిచిపోయారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే పౌర పురస్కారాలకు ఎవెరెవరు అర్హులో ఇకపై ప్రజలు కూడా సూచించడానికి అవకాశం కల్పిస్తూ ఒక పోర్టల్ ను ఏర్పాటు చేశారు. ప్రజలది సూచన. రాష్ట్ర ప్రభుత్వాలది సిఫారసు.
నిజానికి ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. కొందరికి అవార్డులు ఎందుకొచ్చాయో? ఎలా వచ్చాయో? మనకు అర్థం కాదు. కొన్ని అవార్డులు తమకెందుకొచ్చాయో తీసుకున్నవారికే తెలియదు.
సోనీ ఇండియన్ ఐడల్ ఫైనల్లో గెలవడానికి మా పిల్లాడికి మీ ఓట్లు వేసి పుణ్యం కట్టుకోండి అని తల్లిదండ్రులు అభ్యర్థిస్తూ ఉంటారు. అలా…ఇకపై అవార్డులు గ్రహించాలనుకుంటున్నవారు పోర్టల్లో సిఫారసు చేయండి అని అభ్యర్థిస్తారేమో!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :