Monday, July 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహంపీ విఠలాలయంలో సౌండ్ ఎఫెక్ట్స్ కు చర్మపు పరదాలు

హంపీ విఠలాలయంలో సౌండ్ ఎఫెక్ట్స్ కు చర్మపు పరదాలు

Original Sound: ఇప్పుడంటే ఇన్నిన్ని మైకులు, భూమి బద్దలయ్యే ఎకో సౌండ్ బాక్సులు ఉన్నాయి కానీ…ఒక రెండొందల ఏళ్లు వెనక్కు వెళితే...ఇవేమీ లేని రోజుల్లో త్యాగయ్య ఒక్క కీర్తననే ఎనిమిది గంటలపాటు పాడితే చుట్టూ కూర్చున్న పదివేల మందికి ఎలా స్పష్టంగా వినపడింది?  అని ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రశ్న వేసి…దానికి ఆయనే లోతయిన సమాధానం కూడా చెప్పారు. ఆయన మాటల్లోనే-

“మైకుల్లేవు కాబట్టే గట్టిగా అరవాలి. పాడిన పల్లవినే పదిసార్లు పాడాలి. చరణంలో ప్రతి పాదాన్ని ఇరవై సార్లు పాడాలి. ఇప్పటిలా స్టేజీ ఎదురుగా శ్రోతలు కూర్చునేవారు కాదు. స్టేజీ చుట్టూ వలయాకారంలో శ్రోతలు కూర్చునేవారు. గాయకుడు ఒక్కోసారి ఒక్కో వైపు తిరుగుతూ పాడేవాడు. చుట్టూ కూర్చున్నవారిలో చివరి పంక్తిలో ఉన్నవారికి కూడా వినిపించిందని రుజువైతే తప్ప గాయకుడి పల్లవి అనుపల్లవి దాటి చరణాల్లోకి వచ్చేది కాదు.

అలా పాడడం సంప్రదాయం అనుకుని ఇప్పటికీ అలాగే పాడుతున్నాం. ఇప్పుడు గుసగుసలాడినా చెవుల్లో రక్తం వచ్చేలా సౌండ్ పెంచుకునే సాంకేతిక వెసులుబాటు ఉంది.

అప్పుడు వీనులవిందుగా, జనరంజకంగా పాడిన వారి గాత్ర గాంభీర్యం, అందరికీ వినపడడానికి కచేరీ నిర్వహణలో వారు పాటించిన పద్ధతులు ఇప్పుడు మన ఊహకు కూడా అందవు”.

మూడు శతాబ్దాలపాటు ఒక వెలుగు వెలిగిన విజయనగర రాజధాని హంపీ విఠలాలయంలో రాతి స్తంభాల్లో సంగీత స్వరాలు పలకడం తెలిసిందే. భవిష్యత్తులో అయోమయానికి తావు లేకుండా ఏ స్తంభంలో ఏ వాద్యం పలుకుతుందో కింద ఆ వాద్య పరికరాన్ని చెక్కారు. రోజూ సాయంత్రం దీపాలు వెలిగించగానే విఠలాలయంలో నాట్యప్రదర్శన ఉండేది. గంధపు చెక్కలతో ఈ రాతి స్తంభాల మీద లయబద్దంగా వాయించేవారు. ఆ శబ్దం గాలికి చెల్లాచెదురు కాకుండా చుట్టూ చర్మంతో చేసిన పరదాలు కట్టేవారు. ముందు మాత్రం తెరిచి ఉంచేవారు. దాంతో నాట్య దృశ్యం ప్రేక్షకుల కళ్ళకు పండగ. రాతిలో పలికిన రాగాలు వీనులకు విందు.

ఆ పరదాలు కట్టిన రాతి కొక్కేలను ఇప్పటికీ విఠలాలయం పైకప్పు దూలాల్లో చూడవచ్చు.

ఇప్పుడు కచేరీల్లో చీమ చిటుక్కుమన్నా ప్రళయభీకర ధ్వనిగా మార్చే షూర్ మైకులు, గుండెను కంపింపజేసే జె బీ ఎల్ సౌండ్ బాక్సులు ఉన్నాయి. నాటకాల్లో వైర్ లెస్ మైకులున్నాయి. బ్యాక్ గ్రవుండ్ తెరలుగా వీడియోను ప్లే చేసే ఎల్ ఈ డి వాల్స్ ఉన్నాయి. విద్యుత్ బల్బుల తళతళలున్నాయి. ముందే రికార్డ్ చేసి పెట్టుకున్న ఆడియో ట్రాక్ లు సందర్భానికి తగినట్లు ప్లే చేసుకునే వెసులుబాట్లు ఉన్నాయి.

ఇవేమీ లేనిరోజుల్లో కూడా శ్రోతలు ఇంతకంటే బాగా విన్నారు. ప్రేక్షకులు ఇంతకంటే గొప్పగా కళ్లల్లో నింపుకున్నారు. కాలం తనను తాను మలచుకుంటూనే ఉంటుంది. శబ్దం గాలిలో కలిసిపోకుండా మన చెవులకు చేరవేయడానికి చర్మపు పరదాలు కట్టిన విజయనగర విఠలాలయ శబ్ద విన్యాసాన్ని తరచి చూస్తే…రాతి గుండెలయినా కరిగి…పొంగిపోవాల్సిందే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్