Saturday, September 21, 2024

పగటి కలలు

Self Drum: అదొక అతి శీతల అతి పెద్ద కన్వెన్షన్ హాల్. ఇసుకవేస్తే రాలేంత జనంతో హల్ పలుచగా, చప్పగా, నీరసంగా ఉంది. కానీ బీ బీ సీ మెదలు లోకల్ సిటీ కేబుల్ దాకా జర్నలిస్టులు, కెమెరా సిబ్బంది, లైవ్ , డిజిటల్ మీడియా వారు వందల మంది పెట్టుడు పెయిడ్ సిబ్బంది ముందు వరుసలో చిక్కగా చక్కగా ఉన్నారు. స్టేజ్ వెనుక ఎల్ ఈ డి బ్యాక్ డ్రాపులు 80 బై 80 లో ఆకాశం అంచుల దాకా విస్తరించి ఉన్నాయి. అందులో ప్రపంచంలో ప్రస్తుతం మనుగడలో ఉన్న ఏడున్నర వేల భాషల్లో-

త్రిసహస్రాబ్దికి త్రిసూత్రాలు
Three points for 3000
త్రీసహస్రాబ్ద్ కే లియె త్రి సూత్ర్
3000కు మూన్రు పుల్లికళ్
3000కు మూరు అంశగళు
తీన్ ఛా తీన్ ఛే
త్రీడీ గ్రాఫిక్స్ తో చేసిన అక్షరాలు రకరకాల ఎఫెక్టులతో డిస్ ప్లే అవుతున్నాయి. ఎవరి భాష వచ్చినప్పుడు వారు లేచి ఈలలు వేస్తుంటే లైవ్ కెమెరాలు వెంటనే వారిని జూమ్ లో బంధిస్తున్నాయి.

ఈలోపు సెవెన్ స్టార్ బెంజ్ కారవాన్ వెహికల్లో మేకప్ పూర్తయిన కురువృద్ధ నాయకుడి చెవికి వైర్ లెస్, కార్డ్ లెస్, వెయిట్ లెస్ మైక్ పెట్టారు. ఆడియో వన్ టూ త్రీ టెస్ట్ చేసుకున్నారు. బస్సు డోర్ తెరవగానే ఆయన మీద ఇరవై డ్రోన్లు ఎగురుతున్నాయి. ఇరవై డ్రోన్ కెమెరాలకు విడివిడిగా రెండు వేళ్లు పైకెత్తి విజయచిహ్నం చూపుతూ నడవబోయి…గ్రాండ్ ఎంట్రీ కోసం వేసిన రెడ్ కార్పెట్ మడత కాలికి తగిలి శుభసూచకంగా తూలి పడబోయారు. ఆ నాలుగు సెకన్ల వీడియో లైవ్ లో చూసిన అభిమానుల గుండెలు జారి గల్లంతయ్యాయి. కుడి ఎడమల సాయుధ నల్ల పిల్లులు, తెల్ల కుక్కలు వెంట రాగా స్టేజ్ మీదికి రాగానే…పది నిముషాలు బాణాసంచా నిరాఘాటంగా పేలింది. డి జె సౌండ్ డెసిబుల్ పెరిగి ఆకాశానికి చిల్లులు పడింది. ఒక్కసారిగా బాణాసంచా పొగ కారుమేఘాలు ఆ ప్రాంతమంతా ఆవరించాయి. ఆ పొగకు ఊపిరాడని వారిని వెంటనే ప్రత్యేక అంబులెన్సుల్లో సార్ కే చెందిన ఫైవ్ స్టార్ ఆసుపత్రులకు తరలించారు. డి జె సౌండ్లకు గుండె లయ తప్పినవారి ఎదలమీద నొక్కుతూ అత్యవసర ప్రాణరక్షణ ఉపాయ చికిత్సలు జరుగుతుండగా…

…సార్ తేరుకుని…టమోటో జ్యూస్ తాగి…కళ్లల్లో పొంగివచ్చే ఆనందబాష్పాలను తుడుచుకుని…పి పి టీ ఫస్ట్ స్లయిడ్ ప్లీజ్ అన్నారు.

…అంతే…
బ్రహ్మాండాలు బంతులాడినట్లు…
విశ్వ విశ్వాంతరాళాలు ఊగినట్లు…
ఇంద్ర లోకం నేలకు దిగివచ్చినట్లు…
శివుడి కైలాసం నివ్వెరబోయినట్లు…
విష్ణువు వైకుంఠం చిన్నబోయినట్లు…
అమ్మ మణి ద్వీపం వెలుగు తగ్గినట్లు…
స్వర్గం స్వరం మూగబోయి, సిగ్గుపడినట్లు…
నరకం శాశ్వతంగా పక్కకు తప్పుకున్నట్లు…
ఆ దృశ్యం మాటలకందలేదు. అదొక వాచామగోచర నిర్వికల్ప సమాధి స్థితి.

శ్రీకృష్ణుడు తన విశ్వ రూపాన్ని చూపించడానికి తనే దివ్య నేత్రాలు కూడా ఇచ్చి…కరుణించినట్లు...ఈ మొదటి స్లయిడు భావి 3000 విశ్వ రూప నిర్మాణ నిర్వాణ నిరామయ నిర్గుణ నిరాకార నిస్సంగ భావాన్ని అర్థం చేసుకోవడానికి సారే అందరికీ త్రీడీ కళ్లద్దాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఒక్కసారిగా అందరూ 3000లలోకి వెళ్లిపోయారు.

కళ్లజోళ్లు తీయగానే అందరి విజన్ కాసేపు బ్లర్ అయ్యింది. కళ్లు ఎంత నులుముకున్నా ఏమీ కనిపించలేదు. మూడు గంటల తరువాత నెమ్మదిగా మసకలు తొలిగాయి. ఇప్పుడు అందరికీ స్పష్టంగా కళ్ల ముందు బషీర్ బాగ్ లు కనిపిస్తున్నాయి.

కార్యక్రమం ముగింపు సూచకంగా-
అది నేనే
ఇది నేనే
అటు నేనే
ఇటు నేనే
అన్నీ నేనే
అంతా నేనే
మౌసు నేనే
కీబోర్డ్ నేనే
సెల్లు నాదే
నెట్టు నాదే”
కోరస్ సాంగ్ డెసిబుల్ స్థాయి పెరిగింది. ఆ శబ్దానికే కొన్ని గుండెలు కొట్టుకోవడం ఆగి…ఆ పాట గాలిలో గాలిగా లయమై…పునారవృత్తిరహిత శాశ్వత విజన్ సాయుజ్యం పొందాయి!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్