Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

సకల శాస్త్రాలు ఇప్పుడు కరోనాతోనే ముడిపడతాయి……

 

కరోనా వైరస్

కరోనా వైద్యం

కరోనా గృహ నిర్బంధం

కరోనా రాజకీయం

కరోనా పాలన

కరోనా మేనేజ్మెంట్

కరోనా ఆర్థిక శాస్త్రం

కరోనా మానసిక శాస్త్రం

కరోనా తెచ్చిన మార్పు

కరోనా పెట్రో శాస్త్రం

కరోనా మెట్రో జీవనం

కరోనా పరిశుభ్రత

కరోనా దూరం

కరోనా భయం

కరోనా భక్తి

ఇలా ఇక ఆవు వ్యాసానికి అమ్మమ్మ కరోనా కాబోతోంది.

 

 

ఇందులో కరోనా దెబ్బకు ఆంక్షలు, గృహ నిర్బంధాలతో ఇంట్లో వంటిల్లు ఎక్కడుందో తెలియనివారు కూడా వంట ఇంటి మొహం చూస్తున్నారు. ఎప్పుడూ గరిట పట్టనివారు గరిట తిప్పుతున్నారు. ఒక రకంగా గృహిణులకు పని మూడింతలు పెరిగింది. నిజానికి వారి శాపాలవల్లే భారతదేశంలో కరోనా భయపడి ఈమాత్రం అణకువగా ఉంది. ఫ్యూడల్, పురుషాధిక్య భావనలు వేల ఏళ్లుగా నరనరాన జీర్ణించుకుపోయిన జాతి మనది. శాశ్వత మిలటరీ కమాండ్ పోస్టులకు మహిళలను మొన్న మొన్న అనుమతించినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. మహిళలకు క్షమాపణ చెప్పుకోవాలి.

 

కరోనా దెబ్బకు యావత్ గృహిణులకు పురుష ప్రపంచం బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన చారిత్రక అవసరముంది. ఒకవేళ క్షమాపణ చెప్పడానికి నామోషి అయితే- కనీసం గృహిణుల పనితీరును, శ్రమను, ఓర్పును, ఇంటి నిర్వహణ విద్యను అభినంచాల్సిన అవసరమయినా ఉంది.

 

ఒక్కో పనికి రోజు కూలీ, నెల వేతనానికి ఏవేవో ప్రమాణాలుంటాయి. ఇల్లాలి ఇంటి పనికి ఈ భూప్రపంచంలో ఎవరయినా కూలీ లేదా జీతం నిర్ణయించగలరా? ఒక వేళ నిర్ణయిస్తే ఇవ్వగలరా? సంస్కృత భాష సరిగ్గా అర్థం కాక- “ఉద్యోగం పురుష లక్షణం” అన్న మాటను ఉద్యోగం చేయడం మగవారి లక్షణం, హక్కు, బలం, బలహీనత, అహంకారం, మమకారం, గొడ్డుకారం అని రకరకాలుగా అన్వయించుకున్నారు. నిజానికి ఇక్కడ “పురుష” అంటే మనిషి అనే అర్థం తప్ప పురుషులకు మాత్రమే అని కానే కాదు. ఒక వేళ ఇందులో పురుష లక్షణం- మగవారిదే అయితే చతుర్విధ ఫల పురుషార్ధాలు, పురుష కార్యం, పురుష యత్నం – అన్నీ కూడా మగవారికే పరిమితం కావాలి.

 

వేద ధర్మం ప్రకారం భార్యలేని పురుషుడు యజ్ఞం చేయడానికే అర్హుడు కాడు. చివరికి శ్రీరాముడి స్తోత్రంలో పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం – మాటను కూడా ఇలాగే మగవారికయినా మరులుగొల్పే రాముడి అందం –  అని తప్పు అర్థం చెబుతున్నారు. సినిమాల్లో పెద్ద పెద్ద కవులు కూడా అలాగే పాటలు రాశారు. మనిషిగా పుట్టిన రాముడి అందం మనుషులందరినీ ఆకర్షిస్తుంది- అనే ఇక్కడ అర్థం. చివరకు భాషలు, వ్యాకరణం, వ్యుత్పత్తి, అర్థాలు, అన్వయాల్లో కూడా మహిళలకు అన్యాయం జరిగింది. జరుగుతోంది. స్త్రీ -పురుషులు సమానం అని గొంతుచించుకుని అరిచే ఈ రోజుల్లో కూడా మహిళలను ఆడవారు, ఆడువారు అనే అంటున్నాం. స్త్రీ, మహిళ మాటల్లో ఉన్న గౌరవం ఆడ, ఆడు, ఆడది మాటల్లో లేదు. ఆ మాటల వ్యుత్పత్తి తెలిస్తే అందులో బాధ, నింద, అవమానం, చిన్నచూపు ఏమిటో అర్థమవుతుంది. భాషలో, వ్యాకరణంలో మహిళలకు జరిగిన అన్యాయం మరెప్పుడయినా లోతుగా ఉదాహరణలతో మాట్లాడుకుందాం. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్లో గృహిణుల థాంక్ లెస్ జాబ్ కే పరిమితమవుదాం.

 

జన్మకో శివరాత్రిలా ఈ ఆంక్షల స్వీయ నిర్బంధాల్లో కొందరు పురుష పుంగవులు ఎంతో కొంత నడుం వంచుతూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు పెట్టి స్వీయ అశ్రు ధారలు కారుస్తూ ఉండి ఉండవచ్చు. కానీ- కరోనాకు ముందు, కరోనా నిర్బంధంలో, తరువాత సగటు భారతీయ గృహిణి కష్టం ఎంతో ఇప్పుడయినా ఇంట్లో ఉన్న మగవారు గమనించాలి. గుర్తించాలి. ఆ శ్రమకు తగిన జీతమో, కూలినో ఇవ్వాలని వారు అడగట్లేదు. ఇస్తే తప్పు లేదు. మహిళలు ఇన్ని చేస్తున్నా, ఇంకా మోస్తున్నా అది మీ బాధ్యత, మీ ఖర్మ, మీరందుకే పుట్టారు- అన్నట్లు పురుషులు ఇంకా ఇంకా అవమానిస్తే, విసిగిస్తే, బరువు మోపితే ప్రకృతి సహజన్యాయ సూత్రాలు ఎప్పుడో ఒకప్పుడు తాళ్లు తెంచుకోక మానవు.

 

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాస్తత్రాఫలాక్రియః”

ఈ ఒక్క శ్లోకంతో యావత్ మహిళా జాతికి మనం మంగళం పాడాం.

 

భారతీయ మహిళకు కావాల్సింది మంగళహారతులు కాదు. వారికి కావాల్సింది మౌన వేదనను అర్థం చేసుకునే మనుషులు, మనసులు, మమతలు. మోయలేని ఇంటి పని భారాన్ని ఎంతో కొంత పంచుకునే మనుషులు. కరోనా వేళ అయినా మగవారికి ఈ కనువిప్పు కలగాలని కోరుకుందాం. మహిళల పనిభారం కొంత తగ్గాలని ఆశిద్దాం.

 

పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com