Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

‘A bird in the hand is worth two in the bush’
ఈ ఇంగ్లీషు సామెతకు అర్థం తెలియకపోతే- కరోనాకు వైద్యం చేసే కార్పొరేట్ ఆసుపత్రులను అడగండి. కరెక్ట్ గా చెబుతారు. ఎత్తుగడలోనే ఇంగ్లీషు సామెత ఎందుకు? అని అభ్యంతరమున్న వారికి
“మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలక బోసుకున్నట్లు” అన్న తెలుగు సామెత సరిపోతుంది.

కరోనా సెకండ్ వేవ్ ను తెలుగులోకి అనువదిస్తే కరోనా రెండో అల అవుతుంది. అచ్చ తెలుగు ఎప్పుడూ మనకు అచ్చిరాదు కాబట్టి గౌరవంగా, గంభీరంగా కరోనా ద్వితీయ తరంగం అని సంస్కృతీకరించుకోవచ్చు. అయినా ద్వితీయ తరంగం అన్న మాటలో తారంగం తారంగం అని ఏదో పాజిటివ్ మీనింగ్ వస్తుంది కానీ- ఇంగ్లీషులో కరోనా దారుణ పాజిటివ్ వ్యాప్తితో వచ్చే నెగటివ్ మీనింగ్ రావడం లేదు. కొడిగడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా నిలబెడుతున్న మీడియా ద్వితీయ తరంగం అని అనువదించి వాడుతోందో? లేదో? తెలియదు. అయినా మన గొడవ పారిభాషిక పదాల అనువాదం గురించి కాదు. భాషల్లో ఎన్నెన్నో సామెతలు ఉంటాయి. వాటి గురించీ కాదు. భాష, సామెతలు, వ్యాకరణం, మాండలికం అన్ని లెక్కలు “లెక్క” ముందు లెక్కలేనివి అవుతాయి.

కరోనా వేళ లెక్కలన్నీ వెక్కి వెక్కి ఏడవాల్సిన ఈ నగదు లెక్కకు- ఎ బర్డ్ ఇన్ హ్యాండ్, మబ్బుల్లో నీళ్ల సామెతలకు లంకె ఏమిటో చూద్దాం. ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు ఉన్నా కరోనా పేషంట్లకు చాలడం లేదు. ఏ నోట విన్నా ఇప్పుడు పరీక్షలు, ఫలితాలు, పాజిటివ్ లు, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడాలు, ఐ సి యూ లు, వెంటిలేటర్లే వినిపిస్తున్నాయి. ఎద్దు పుండు కాకికి ముద్దు సామెత వినడానికి ఈ సమయంలో వికారంగా వున్నా- కరోనా పుండు కార్పొరేట్ ఆసుపత్రులకు ముద్దు అన్నది కూడా అంతే వాస్తవం. నానా పేర్లతో చిత్ర విచిత్రమయిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు మనం చేసి ఉంటాం. మనకు ఏ రోగం వచ్చి ఉంటుందో- సరిగ్గా ఆ రోగమొక్కటే మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి రాదు అని ఆసుపత్రి వాడు భూతద్దం వేసి కనుక్కునే దాకా ఆ విషయం మనక్కూడా తెలియదు. తెలిసే అవకాశం, తెలివిడి ఇన్సూరెన్స్ వాడు కలిగించడు. భారత దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే విభక్తి ప్రత్యయాలను సరిగ్గా అర్థం చేసుకోక తప్పుగా అనుకుంటున్నాం. హెల్త్ కోసం ఇన్సూరెన్స్ కాదు. దాని నిగూఢ విభక్తిని సరిగ్గా విరుచుకుంటే వచ్చే అర్థం- ఇన్సూరెన్స్ కంపెనీల హెల్త్ కోసం మన హెల్త్ పాడు చేసుకుని కట్టే ఇన్సూరెన్స్ అని! హెల్త్ ఇన్సూరెన్స్ దందా మీద భారత్ లో జరగాల్సినంత చర్చ జరగలేదు. అవసరం లేకపోయినా ఆ పాలసీ నియమ నిబంధనల అనుమతిస్తాయి కాబట్టి ఇన్ పేషంట్ దగ్గరి నుండి ఎక్కువగా పిండుకోవడం ఒక ప్రమాదం. కట్టేది మనం కాదు కదా అనుకుని లేని రోగాలకు కూడా వైద్యం చేయించుకోవడం రెండో ప్రమాదం. కరోనా లాంటి విపత్తుల వేళ హెల్త్ ఇన్సూరెన్సులకు విలువ లేకపోవడం అసలు ప్రమాదం.

హెల్త్ ఇన్సూరెన్స్ సంగతి దేవుడెరుగు. తాజాగా ప్రయివేటు ఆసుపత్రుల్లో నగదు తప్ప- డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చెల్లింపులను ఒప్పుకోవడం లేదు. ఏదయినా డబ్బులే కదా? అని సామాన్యులకు అనిపించవచ్చు. ఇక్కడే ఉంది కిటుకు. కరోనా పరీక్షలకు, వైద్యానికి ఫలానా ధరకు మించి వసూలు చేయడానికి వీల్లేదు అని ప్రభుత్వాలు హుకుం జారీ చేసి, తనిఖీలు మొదలు పెట్టాయి. హార్డ్ క్యాష్ నోట్ల కట్టల నగదు తీసుకుంటే లెక్కా లేదు. రసీదు లేదు. అంతా చీకట్లో తెల్లకోట్లు వేసుకుని చేసే నలుపు వ్యాపారం. నోట్ల కట్టలు ఉంటే బతకండి. లేకపోతే మీ చావు మీరు చావండి. నోట్ల రద్దు తరువాత నోట్ల కట్టలు కనిపించడమే మానేశాయి. నోట్లు దొరకవు. కార్డులు పని చేయవు. కష్టాలు చెప్పి రావడమంటే ఇదే.
మాయల ఫకీరు ప్రాణం కొమ్మ మీద చిలుకలో ఉంది. మన ప్రాణం నోట్ల కట్టల్లో ఉంది!

ప్రారంభంలో రెండు సామెతలు ఏవో అనుకున్నట్లున్నాం కదా!
ఆసుపత్రి వారి దృష్టిలో-

“A currency note bundle in the patient’s hand is worth more than thousand debit and credit cards”

“డెబిట్/క్రెడిట్ కార్డు మబ్బుల్లో డబ్బులు చూసి- ఆసుపత్రి మంచం మీద డబ్బులు పోగొట్టుకోవడానికి అసుపత్రులేమీ అహోబిల మఠాలు కాదు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com